లోకేష్‌కూ అనుమానమే.. మంగళగిరి నుంచి పోటీకి దూరమేనా?

17 Dec, 2023 14:20 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, గుంటూరు: గుంటూరు తెలుగుదేశం పార్టీలో ఆందోళన నెలకొంది. సీట్ల కేటాయింపులపై ఇప్పటికీ ఏమీ తేల్చకపోవడం, మరోవైపు వైఎస్సార్‌సీపీలో జరిగిన మార్పులతో తాము కూడా అభ్యర్థులను మార్చాలని అధిష్టానం ఆలోచన చేస్తుండటంతో సీటు ఆశిస్తున్న నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. గుంటూరు జిల్లాలో పొన్నూరు తప్ప అన్ని నియోజకవర్గాలలో అస్పష్టత కొనసాగుతోంది. పొన్నూరులో కూడా ధూళిపాళ్లను ఎంపీగా పంపిస్తారనే ప్రచారం సాగుతోంది. గుంటూరు నగరానికి వస్తే మూడు వర్గాలు, ఆరు గ్రూపులుగా పార్టీ చీలిపోయింది. రెండు నియోజకవర్గాలలో ఇన్‌చార్జులను కాదని కొంతమంది నేతలు సొంతంగా కార్యక్రమాలు నిర్వహిస్తుండటం, వారు బహిరంగంగానే గొడవలకు దిగడం పరిపాటిగా మారింది.

లోకేష్‌కూ అనుమానమే
మంగళగిరిలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్‌కే స్థానంలో చేనేత సామాజిక వర్గానికి చెందిన గంజి చిరంజీవిని ఇన్‌చార్జిగా ప్రకటించడంతో తెలుగుదేశం ఆలోచనలో పడింది. నారా లోకేష్‌ మంగళగిరి నుంచి పోటీ చేస్తారని చెబుతున్నా, చివరి నిముషంలో ఏ నిర్ణయం అయినా తీసుకోవచ్చని మంగళగిరి పార్టీ నేతలు చెబుతున్నారు.

పశ్చిమలో కోవెలమూడి వర్సెస్‌ ఉయ్యూరు
గుంటూరు పశ్చిమలో నియోజకవర్గ ఇన్‌చార్జిగా కోవెలమూడి రవీంద్ర(నానీ) ఉండగా, అతనికి పోటీగా ఎన్‌ఆర్‌ఐలు మన్నవ మోహనకృష్ణ, ఉయ్యూరు శ్రీనివాస్‌, నియోజకవర్గ నేతలు డాక్టర్‌ నిమ్మల శేషయ్య, తాళ్ల వెంకటేష్‌ యాదవ్‌ స్వచ్ఛంద సేవా కార్యక్రమాల పేరుతో తమ సొంత ప్రచారం సాగిస్తున్నారు. చివరి నిముషంలో పొత్తులో తెనాలి జనసేనకు ఇస్తే మాజీ మంత్రి ఆలపాటి రాజాను రంగంలోకి దింపుతారన్న ప్రచారం జరుగుతోంది. వైద్య ఆరోగ్య శాఖ మంత్రి విడదల రజినీకి గుంటూరు పశ్చిమ బాధ్యతలు వైఎస్సార్‌ సీపీ అప్పగించడంతో మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణను సత్తెనపల్లి బదులుగా గుంటూరు పశ్చిమలో పోటీ చేయిస్తారన్న ప్రచారం సాగుతోంది.

తెలుగుదేశం–జనసేన మధ్య ‘తెనాలి’ రగడ
తెనాలిలో తెలుగుదేశం–జనసేన మధ్య కోల్డ్‌వార్‌ జరుగుతోంది. ఈ సీటు తమకే కావాలని మాజీ మంత్రి ఆలపాటి రాజా పట్టుపడుతున్నారు. జనసేన తరపున తాను తెనాలి నుంచి పోటీ చేస్తున్నట్లు నాదెండ్ల మనోహర్‌ ఇప్పటికే పలుమారు ప్రకటించుకున్నారు. ఆలపాటి రాజా పేద యువతుల వివాహానికి మంగళసూత్రం ఉచితంగా ఇస్తున్నారు. ఇదేం ఖర్మ రాష్ట్రానికి, భవిష్యత్‌కు గ్యారెంటీ కార్యక్రమాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మిచాంగ్‌ తుఫాన్‌ బాధిత రైతుల పరామర్శ కోసం చంద్రబాబునాయుడు వచ్చినప్పుడు ఆయన బలప్రదర్శన చేశారు. మరోవైపు రోజు మార్చి రోజు నాదెండ్ల మనోహర్‌ ఇక్కడే ప్రెస్‌మీట్‌ పెడుతూ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. రైతు సమస్యలు, వ్యాపారుల సమస్యలపై నేరుగా వెళ్లి వారిని కలుస్తున్నారు.

తాడికొండలో శ్రావణ్‌కు పొగ
రాజధాని ప్రాంతమైన తాడికొండలో ప్రస్తుతం ఇన్‌చార్జిగా, జిల్లా పార్టీ అధ్యక్షుడుగా ఉన్న తెనాలి శ్రావణ్‌కుమార్‌కు వ్యతిరేకంగా తొలినుంచి ఓ వర్గం పావులు కదుపుతుంది. అందులో భాగంగా గత ఎన్నికల ముందే చంద్రబాబు నాయుడు ఎదుట వారు శ్రావణ్‌కుమార్‌కు సీటు ఇవ్వకుండా శతవిధాలా అడ్డుపడ్డారు. దీంతో శ్రావణ్‌కుమార్‌ను బాపట్ల ఎంపీగా, అక్కడ ఎంపీగా పోటీ చేసిన మాల్యాద్రిని ఇక్కడకు సీటు కేటాయించగా శ్రావణ్‌కుమార్‌ వర్గం కూడా గట్టిగా పట్టుబట్టడంతో తిరిగి ఎక్కడ వారిని అక్కడే ఉంచేశారు. ఇప్పుడు కూడా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఫిరంగిపురం మండలం పొనుగుపాడు గ్రామానికి చెందిన గేరా రవిబాబు, తుళ్లూరు మండలం బోరుపాలెం గ్రామానికి చెందిన తోకల రాజవర్థన్‌లు సీటు కోసం గట్టిగా ప్రయత్నాలు చేస్తున్నారు. రాజవర్ధన్‌కు రాయపాటి వర్గం అండగా నిలబడింది.

ప్రత్తిపాడులో ఆర్‌.ఆర్‌. రగడ
ప్రత్తిపాడులో ప్రస్తుతం ఇన్‌చార్జిగా ఉన్న రిటైర్డ్‌ ఐఏఎస్‌ బి.రామాంజనేయులును పార్టీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అయనకు మద్దతుగా ఉన్న మాజీ మంత్రి మాకినేని పెదరత్తయ్య పెత్తనాన్ని కూడా వారు వ్యతిరేకించడంతోపాటు బహిరంగంగానే తమ అసమ్మతిని బయటపెడుతున్నారు. పెదనందిపాడు, గుంటూరు రూరల్‌లో కూడా రామాంజనేయులు అనుకూల, వ్యతిరేకవర్గాలు బాహాబాహీకి దిగిన సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రత్తిపాడు, తాడికొండలలో ప్రస్తుతం ఇన్‌చార్జులుగా ఉన్న వారి సామాజిక వర్గాలకు చెందిన నేతలనే వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జులుగా ప్రకటించడంతో ప్రత్తిపాడు, తాడికొండలలో కూడా అభ్యర్థులను మార్చేందుకు టీడీపీ అధిష్టానం ప్రయత్నాలు మొదలుపెట్టింది.

తూర్పులో హెచ్చరికలు, కొట్లాటలు
గుంటూరు తూర్పులో నియోజకవర్గ ఇన్‌చార్జిగా మహ్మద్‌ నసీర్‌ ఉండగా, అతనికి పోటీగా గుంటూరు నగర పార్టీ అధ్యక్షుడు డేగల ప్రభాకర్‌, సయ్యద్‌ ముజీబ్‌ సొంతంగా కార్యక్రమాలు చేస్తున్నారు. నసీర్‌, ముజీబ్‌ గ్రూపుల మధ్య గొడవలు పెరిగి పోలీసు స్టేషన్‌ మెట్లెక్కే పరిస్థితి ఇరుగ్రూపుల మధ్య నెలకొంది. మరోవైపు తూర్పు నియోజకవర్గ ఇన్‌చార్జిగా నసీర్‌ అహ్మద్‌ తీరుపై కార్యకర్తలు, నాయకుల్లో పూర్తి వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట
ఇక ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్‌ అసలు పూర్తిగా నియోజకవర్గాన్ని వదిలిపెట్టేశారు. నియోజకవర్గానికి వచ్చి కూడా సంవత్సరాలు దాటిపోతుండటం, మళ్లీ పోటీ చేసే ఉద్దేశం లేకపోవడంతో ఎంపీ అభ్యర్థి కోసం కూడా వెతుకులాటలో ఉంది. ఆలపాటి రాజా, ధూళిపాళ్ల నరేంద్ర వంటి సీనియర్‌ నేతలు ఎంపీగా రావడానికి సుముఖత వ్యక్తం చేయకపోవడంతో బయట వ్యక్తులను తీసుకువచ్చే ప్రయత్నాలలో ఆ పార్టీ ఉంది.

>
మరిన్ని వార్తలు