TS Elections 2023: చర్చనీయాంశంగా మారిన.. రాజయ్య రాజకీయ వ్యూహం..!

6 Sep, 2023 11:15 IST|Sakshi

వరంగల్‌: స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డా.తాటికొండ రాజయ్య తాజా రాజకీయ వ్యూహం ఏమిటనేది పొలిటికల్‌ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. ఆగస్టు 21న సీఎం కేసీఆర్‌ స్టేషన్‌ ఘన్‌పూర్‌ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా కడియం శ్రీహరిని ప్రకటించిన తర్వాత రాజయ్య వ్యూహం మార్చారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌.. కేటీఆర్‌, పార్టీ నేతల పట్ల లాయల్‌గానే ఉంటున్నా.. కడియం శ్రీహరిని ప్రత్యర్థిగా చూస్తున్న తీరు రాజకీయవర్గాల్లో చర్చనీయాంశం అవుతోంది.

టికెట్‌ ఖరారైన నేపథ్యంలో కడియం శ్రీహరి నిర్వహించిన భారీ ర్యాలీకి దూరంగా ఉన్న రాజయ్య... రాయబారానికి వెళ్లిన ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌ రెడ్డి తదితర నేతలను కలవకుండా తిరిగారు. మాదిగ దండోరా అండతో రాజకీయంగా చక్రం తిప్పుతున్న రాజయ్య, సోమవారం కాంగ్రెస్‌ నేత దామోదర రాజనర్సింహతో భేటీ కావడం చర్చనీయాంశంగా మారింది.

ఈ విషయమై మాదిగ చామర్‌ ఇంటర్నేషనల్‌ ఫౌండేషన్‌ (ఎంసీఐఎఫ్‌) ఆధ్వర్యంలో జరిగిన సమ్మేళనంలో పాల్గొనేందుకు మాత్రమే వెళ్లానని, ఇందులో అన్ని పార్టీలకు చెందిన మాదిగలతోపాటు తాను కూడా హాజరైనట్లు సమర్థించుకున్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ చీఫ్‌విప్‌, బీఆర్‌ఎస్‌ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్‌.. మంగళవారం రాజయ్య ఇంటికి వెళ్లి సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. రాజయ్య మాత్రం భేటీల వెనుక రహస్యం ఏమీ లేదన్న గంటన్నరకే స్టేషన్‌ఘన్‌పూర్‌లో తనను కలిసిన ఎమ్మార్పీఎస్‌ నాయకులతో మాట్లాడుతూ ఏ రాజకీయపార్టీలో ఉన్నా.. మాదిగలు ఐక్యంగా ఉండాలన్నారు.

ఓ వైపు అసంతృప్తివాదులను బుజ్జగించేందుకు పార్టీ అధిష్టానం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్న తరుణంలో స్టేషన్‌ ఘన్‌పూర్‌ వివాదం చల్లారకపోగా రోజుకో తీరుగా మారుతోంది. ఈ క్రమంలో కారు దిగి కాంగ్రెస్‌లో చేరుతారనే ప్రచారాన్ని కొట్టిపారేస్తూ, తన రాజకీయ భవిష్యత్తును కాలమే నిర్ణయిస్తుందని చెబుతున్న ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య భవిష్యత్‌ వ్యూహం ఏమిటనేది రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని వార్తలు