బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది: అమిత్‌ షా

18 Nov, 2023 13:38 IST|Sakshi

సాక్షి, గద్వాల: తెలంగాణలో రాబోయే ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలని బీజేపీ అగ్రనేత, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అన్నారు. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు బీసీలకు తీవ్ర అన్యాయం చేశానని, బీజేపీకి అవకాశం ఇస్తే బీసీనే సీఎం చేస్తుందని హామీ ఇచ్చారాయన. శనివారం మధ్యాహ్నం గద్వాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీజేపీ సకల జనుల విజయసంకల్ప సభలో పాల్గొని ఆయన ప్రసంగించారు. 

‘‘ఇచ్చిన హామీలను కేసీఆర్‌ నిలబెట్టుకోలేదు. గద్వాల పేదలకు 500 ఇళ్లు ఇస్తానని ఇవ్వలేదు. రైతులకు కనీస హక్కులు ఇవ్వకుండా కేసీఆర్‌ మోసం చేశారు. అబద్ధపు మాటలతో కేసీఆర్‌ ప్రజల్ని మోసం చేస్తున్నారు. పెండింగ్‌ ప్రాజెక్టులను కేసీఆర్‌ పూర్తి చేయలేదు.  తెలంగాణలో బీఆర్‌ఎస్‌ టైం అయిపోయింది.. బీజేపీ టైం వచ్చింది. డబుల్‌ ఇంజిన్‌ సర్కార్‌ వస్తే తెలంగాణ వేగంగా అభివృద్ధి చెందుతుంది’’ అని షా ప్రసంగించారు. 

‘‘కేసీఆర్‌ హయాంలో స్కామ్‌లెన్నో వెలుగులోకి వచ్చాయి. మిషన్‌ భగీరథ, కాళేశ్వరం, మద్యం కుంభకోణాలు బయటపడ్డాయి. దేశంలోనే కేసీఆర్‌ ప్రభుత్వం అత్యంత అవినీతి  ప్రభుత్వం. దళితుడ్ని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసం చేశారు. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే టైం వచ్చింది. 

..కాంగ్రెస్‌ పార్టీ తెలుగు రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం చేసింది. కాంగగ్రెస్‌ హయాంలో ఉమ్మడి ఏపీకి 2 లక్షల కోట్లు ఇస్తే.. కేవలం తెలంగాణకే మోదీ ప్రభుత్వం రెండున్నర లక్షల కోట్లు ఇచ్చింది. కానీ, కేసీఆర్‌ ప్రభుత్వం నిధుల్ని సక్రమంగా వినియోగించలేదు’’ అని షా ఆరోపించారు. 

‘‘కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం అంతా ఒక్కటే. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌లు బీసీలకు అనుకున్నంత స్థాయిలో టికెట్లు ఇవ్వలేదు. అవి బీసీ వ్యతిరేక పార్టీలు. బీజేపీతోనే బీసీలకు న్యాయం జరుగుతుంది.  బీజేపీకి ఓటేస్తే.. బీసీని సీఎం చేస్తాం. ఒక బీసీని ప్రధానిని చేసిన పార్టీ బీజేపీ. కేంద్రంలో 20 మందికిపైగా ఓబీసీలను మంత్రులను చేశాం. తెలంగాణలో అధికారంలోకి వస్తే 4 శాతం ముస్లిం రిజర్వేషన్‌ రద్దు చేస్తాం. ఆ రద్దు చేసిన రిజర్వేషన్లు ఎస్టీలకు, ఓబీసీలకు ఇస్తాం.

తెలంగాణలో నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడుతోంది బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం. పేపర్‌ లీకేజీ కారణంగానే ప్రవళిక అనే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. ఐదేళ్లలో రెండున్నర లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాం. ఎంఐఎంకి లొంగిపోయి.. ఎందుకు విమోచన దినోత్సవం జరపడం లేదు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సెప్టెంబర్‌ 17వ తేదీని అధికారికంగా విమోచన దినోత్సవంగా జరుపుతాం. బీజేపీ అభ్యర్థులకు ఓటేసి గెలిపించండి. బీజేపీని గెలిపిస్తే.. అయోధ్య రామమందిర ఉచిత దర్శనం కల్పిస్తాం’’ అని షా ప్రసంగాన్ని ముగించారు.

మరిన్ని వార్తలు