-->

తాగునీటి లీకేజీలపై వెంటనే స్పందించండి

27 Mar, 2024 01:05 IST|Sakshi
తాగునీటి సరఫరాపై సమీక్షిస్తున్న కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే

వరంగల్‌ అర్బన్‌: తాగునీటి పైపులైన్లు, వాల్వ్‌ల లీకేజీల పట్ల సీరియస్‌గా స్పందించాలని గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే.. ఇంజనీరింగ్‌ అధికారులను ఆదేశించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో వేసవిలో నీటిఎద్దడి ఎదుర్కోవడానికి చేపట్టాల్సిన చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో కమిషనర్‌ పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ లీకేజీలపై సమాచారం అందగానే వెంటనే స్పందించి అరికట్టేందుకు చొరవ చూపాలన్నారు. చివరి నల్లా కనెక్షన్‌ వరకు నీటి సరఫరా జరగాలన్నారు. కొత్త ప్రాంతాల్లో నీటి సరఫరాకు వాల్వ్‌ల బిగింపు ప్రక్రియ వేగంగా చేయాలన్నారు. లీకేజీలు తరచూ ఏర్పడడానికి కారణాలు ఏమిటని ఇంజనీర్లను ప్రశ్నించగా, నీటి అధిక ఒత్తిడితోపాటు పాతపైపులైన్లు, వివిధ అవసరాల కోసం రోడ్లు తవ్వడం వల్ల ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు. వేసవిలో పాదచారులు, ఇతర పనుల కోసం బయటికి వచ్చేవారి దాహార్తి తీర్చడానికి చలివేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కాజీపేట సర్కిల్‌ పరిధిలో 25, కాశిబుగ్గ సర్కిల్‌ పరిధిలో 25 ప్రాంతాల్లో, ముఖ్యంగా జన సంచారం ఉన్న ప్రాంతాల్లో చలివేంద్రాలు ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో ఎస్‌ఈ ప్రవీణ్‌ చంద్ర, ఈఈలు బీఎల్‌ శ్రీనివాస రావు, రాజయ్య, సంజయ్‌ కుమార్‌, శ్రీనివాస్‌, డీఈలు సారంగం, రవికుమార్‌, రవి కిరణ్‌, రంగారావు, ఏఈలు పాల్గొన్నారు.

భవన నిర్మాణ అనుమతులపై పరిశీలన..

భవన నిర్మాణ ధ్రువీకరణ అనుమతుల కోసం నమోదైన దరఖాస్తులను కమిషనర్‌ అశ్విని తానాజీ వాకడే మంగళవారం టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వరంగల్‌ ఆకుతోట కన్వెన్షన్‌ హాల్‌ ప్రాంతం, ఉర్సు గుట్ట సమీపంలో, ఖమ్మం రోడ్డు ఓల్డ్‌ బీట్‌ బజార్‌ ప్రాంతాల్లో పర్యటించి భవనాలు నిర్మించే స్థలాలు, డాక్యుమెంట్లు, ప్లాన్‌లను పరిశీలించారు. నిబంధనల మేరకు నిర్మాణ అనుమతులు జారీ చేస్తామని పేర్కొన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆమెవెంట సిటీ ప్లానర్‌ వెంకన్న, సీఎంహెచ్‌ఓ రాజేష్‌, టీపీఓలు సుష్మ, బషీర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సంపత్‌ రెడ్డి తదితరులు ఉన్నారు.

ఎక్కడున్నా యుద్ధప్రాతిపదికన అరికట్టాలి

50 చోట్ల చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి

గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌

అశ్విని తానాజీ వాకడే

నీటి సరఫరాపై అధికారులతో సమీక్ష

నోడల్‌ అధికారులతో సమీక్ష

బల్దియా ప్రధాన కార్యాలయంలోని కౌన్సిల్‌ హాల్‌లో వరంగల్‌ (తూర్పు) నియోజకవర్గస్థాయి నోడల్‌ అధికారులతో మంగళవారం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఏఆర్‌ఓ, బల్దియా కమిషనర్‌ అశ్విని తానా జీ వాకడే మాట్లాడుతూ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన విధి విధానాలు, చేపట్టా ల్సిన చర్యల పట్ల కఠినంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. సైబర్‌ సెక్యూరిటీకి సంబంధించి సీ విజిల్‌ యాప్‌, సువిధ లాగిన్‌లపై విషయ పరిజ్ఞానం కలిగి ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ అనిసుర్‌ రషీద్‌, కుడా సీపీఓ అజిత్‌ రెడ్డి, సెక్రటరీ విజయలక్ష్మి, కృష్ణారెడ్డి, నందిరాం నాయక్‌, తదితరులు పాల్గొన్నారు.

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers