-->

No Headline

29 Mar, 2024 02:00 IST|Sakshi

నమాజ్‌.. ఆరోగ్యప్రదాయిని

ప్రార్థనతో రోగాలు మాయం

శరీర భాగాలకు వ్యాయామం

సత్ప్రవర్తన, క్రమశిక్షణ, మోక్షమార్గం

కాజీపేట: రంజాన్‌ మాసంలో నమాజ్‌, ప్రార్థనలతో పాప పరిహారం, మోక్షమార్గం, అల్లాదీవెనలు అందుతాయని ముస్లింల నమ్మకం. నమాజ్‌ వల్ల శరీరంలోని అన్ని భాగాలు వ్యాయామం చేసినట్లే. రక్తప్రసరణ మెరుగుపడడం.. మెదడుకు చురుకుదనంతో పాటు సంపూర్ణ ఆరోగ్యం సిద్ధిస్తుంది. అంతేగాక ఆధ్యాత్మిక కార్యక్రమాలు, దేవుడి ప్రార్థనలో వ్యాయామం మేళవించి ఉంటుంది. అందుకే దైవచింతన ఆరోగ్యానికి మేలు కలుగజేస్తుంది. రంజాన్‌ మాసంలో ముస్లింలు చేసే నమాజ్‌లో ఆరోగ్యానికి దోహదపడే అంశాలెన్నో ఉన్నాయని కాజీపేట జమా మసీదు ఇమామ్‌ షేక్‌ మహబూబ్‌ రహ్మన్‌ వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

నమాజ్‌కు ప్రాధాన్యం...

రంజాన్‌ మాసంలో ప్రతి ముస్లిం ప్రార్థనలు చేస్తూ ఉపవాస దీక్షలో ఉంటారు. అల్లా దీవెనల కోసం ఐదు సార్లు నమాజ్‌ చేస్తారు. నమాజ్‌లో అల్లాను ప్రార్థించడమే కాదు.. సంపూర్ణ ఆరోగ్యం, క్రమ శిక్షణ అలవడుతుంది. నమాజ్‌ వెనుక ఉన్న అసలు పరమార్ధం ఇదే. నమాజ్‌లో తక్బీర్‌, ఖీయాం, రుకూజల్సా, సజ్జా, సలాం, ఖయోదా అనే క్రియలుంటాయి. వీటితో ఎన్నో ఉపయోగాలున్నాయి.

తక్బీర్‌..

నమాజ్‌ ప్రారంభించే ముందు రెండు చేతులను చె వుల వరకు తీసుకెళ్లి మళ్లీ కిందకు దించి నాభిపై ఉంచుతారు. ఈ క్రియ ద్వారా చేతికి బలం చేకూరుతుంది. గుండెకు విశ్రాంతి లభిస్తుంది. రెండు చేతులను పైకెత్తి దించడం ద్వారా ఆధ్యాత్మిక చింతనతో పాటు శరీరంలో రక్తప్రసరణ క్రమపద్ధతిలో జరుగుతుంది.

ఖీయాం..

నమాజ్‌ చదవడానికి నిటారుగా నిలబడడాన్ని ఖీయాం అంటారు. అల్లాహ్‌ అక్బర్‌ అని తక్బీర్‌ ఉచ్చరిస్తూనే కుడిచేతి బోటన, చిటికెన వేళ్లతో ఎడమచేతి మణికట్టును నాభిపై ఉంచుతారు. దీంతో మనసుకు ప్రశాంతత చేకూరుతుంది. రోగాలు ధరిచేరవు. ముఖ్యంగా కీళ్లనొప్పులు తగ్గుతాయి.

సజ్జా..

ఈ ప్రక్రియలో పాదాలు, మోకాళ్లు, అరచేతులు, నుదురు నేలను తాకుతాయి. అల్లాహ్‌ ఎదుట సా ష్టాంగ ప్రమాణం చేయడమే దీని ముఖ్య ఉద్దేశం. దీంతో శరీరంలోని అన్ని అవయవాలకు రక్తప్రసరణ సమపాళ్లలో జరుగుతుంది. మెదడుకు చురుకుదనం వస్తుంది. అల్సర్‌తో బాధపడేవారికి మంచిది. తొడభాగంలోని కొవ్వు కరుగుతుంది.

రుకూజల్సా..

ఈ క్రియ ద్వారా శరీరంలోని కొలెస్ట్రాల్‌ మాయమవుతుంది. ఉదరభాగానికి వ్యాయామం కలుగుతుంది. గుండె, మెదడు సమాంతరంగా ఉండడంతో జీర్ణాశయం పనితీరు మెరుగవుతుంది. బొటనవేళ్ల మధ్య నరాలు ఉత్తేజమవుతాయి. దీంతో వెన్నముఖ నొప్పులు మాయమవుతాయి.

ఖయోదా..

రెండు పాదాలు వెనుకకు మడచి మోకాళ్లపై కూర్చోవడం. ఇది వజ్రాసన భంగిమ. అజీర్తిని దూరం చేయడంతో పాటు ఎముకలు, కీళ్లకు శక్తినిస్తుంది.

సలాం..

నమాజ్‌లో ఇది చివరి ఘట్టం. తలను ఒక దఫా కుడివైపునకు తిప్పి మరోమారు ఎడమ వైపునకు తిప్పడం ద్వారా సలాం ఆచరిస్తారు. నమాజ్‌ను ఆచరించే సమయంలో భుజాలపై దైవ దూతలు ఉండి భక్తులు చేస్తున్న మంచి చెడులను గమనిస్తుంటారు. ఇది మెదడుకు లాభం ఇవ్వడంతో పాటు నేత్ర శక్తిని పెంపొందిస్తుంది.

Election 2024

మరిన్ని వార్తలు