-->

మూణ్నాళ్ల ముచ్చటే!

29 Mar, 2024 02:00 IST|Sakshi

అవగాహన లేకే

యువత పెడదారి..

ప్రస్తుత సమాజంలో యువత ఎవరి మాట లెక్క చేయడం లేదు. దీంతో భవిష్యత్‌ బుగ్గిపాలవుతోంది. పిల్లలను సన్మార్గంలో నడిపించేందుకు తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నా వారు మాత్రం అడ్డదారులు తొక్కుతున్నారు. ప్రేమ పెళ్లిళ్లు చేసుకుని కొన్నాళ్లకే వాటిని తెగతెంపులు చేసుకునే పరిస్థితులే ఎక్కువ కనిపిస్తున్నాయి. పిల్లలు తల్లిదండ్రుల మాటకు విలువనిచ్చి వారు చూసిన వివాహాలే చేసుకోవడం ఉత్తమం.

–వై.సుధాకర్‌ రెడ్డి, సీఐ, కాజీపేట

కాజీపేట : వారిద్దరూ మైనర్లు.. ఓ కళాశాలలో పరిచయమవుతారు. పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. పెద్దలకు ఇష్టం లేకపోయినా బయటకు వెళ్లి వివాహం చేసుకుంటారు. ఆపై వివాహ బంధంలో సంతానం జన్మించిన తరువాత ఇక అక్కడి నుంచి ఇద్దరి మధ్య విభేదాలు ప్రారంభమవుతాయి. ఆ విభేదాలు కాస్త విడిపోయే వరకు వస్తాయి. ఇదంతా 2000 సంవత్సరంలో తేజ దర్శకత్వంలో వచ్చిన ‘చిత్రం’ సినిమాలోని సన్నివేశం. ఆ చిత్రంలో చూపించిన విధంగానే ప్రస్తుత సమాజంలోని యువత కూడా పయనిస్తోంది. మైనార్టీ తీరని వయసులోనే ప్రేమ అనే బంధానికి ఆకర్షితులై ఇబ్బందులకు గురవుతున్నారు. ఫలితంగా బంగారు భవిష్యత్‌ను చేజేతుల నాశనం చేసుకుంటున్నారు.

పోలీసులను ఇబ్బందులకు

గురి చేస్తున్న కేసులు..

ప్రస్తుత సమాజంలో ప్రేమ వివాహాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. అయితే ప్రేమకు ఎంత త్వరగా ఆకర్షితులవుతున్నారో అంతే త్వరగా విభేదాలు ప్రారంభమై విడిపోతున్నారు. ఒక కాజీపేట పట్టణంలోనే నెలలో 10 నుంచి12కు పైగా జంటలు పోలీసుస్టేషన్‌కు చేరుతున్నాయి. దీంతో ఉమ్మడి జిల్లాలో నిత్యం ఎన్ని కేసులు నమోదవుతున్నాయో అర్థం చేసుకోవచ్చు. తమ గారాల కూతుళ్లు కనిపించకపోతే చాలు.. అతృత పడే తల్లిదండ్రులు వెంటనే పోలీసు స్టేషన్ల బాట పడుతున్నారు. దీంతో పోలీసులు కేసులు నమోదు చేసుకోవడం.. ఆ జంటల కోసం వెతికి పీఎస్‌కు తీసుకొచ్చే క్రమంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అధికారులు వాపోతున్నారు. వివిధ కారణాలతో కేసు విచారణలో కొద్దిగా జాప్యం జరిగిన పోలీసులపైనే ఆరోపణలు వెల్లువెత్తుతుంటాయి. తీరా వచ్చక ఆ యువకుడిపై ఉన్న వ్యామోహం తీరాక తల్లిదండ్రుల మాటలు వినకపోవడం.. కొద్దిరోజుల్లోనే ప్రేమ అనే భ్రమ తొలగిపోయి ఇండ్లకు తిరిగి రావడం చేస్తున్నారు. ఇంట్లో వాళ్లు ఆదరించరనే భయం ఉన్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు.

● అమ్మాయి కొద్దిగా చనువుగా మాట్లాడితే చాలు దీనినే ప్రేమగా అర్థం చేసుకుని చదువుపై దృష్టి తగ్గిస్తున్నారు. ఒకవేళ వారు ప్రేమకు అంగీకరిస్తే పర్వాలేదు. లేదా ఏదో ఒక అఘాయిత్యం చేసుకోవడానికి కూడా యువత వెనుకాడడం లేదు. ఇంట్లో చెప్పకుండా వివాహం చేసుకుని కొన్నాళ్లకు తిరిగి రావడం పరిపాటిగా మారింది. వచ్చిన వారు మైనర్లు అయితే పోలీసులు కౌన్సెలింగ్‌ ఇస్తున్నారు. అయితే కొంతమంది మాత్రమే దూరం కావడానికి ఒప్పుకుంటుండగా.. మరికొంతమంది తాము విడిపోయేది లేదంటూ ఖరాఖండిగా చెబుతుండడంతో పోలీసులు కూడా ఏమీ చేయలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. అయితే ఇదంతా బాగానే ఉన్నా ప్రేమ వివాహం చేసుకున్న వారు సంతాన అనంతరం విభేదాలు ప్రారంభమై ఎంతో మంది విడిపోతున్న ఘటనలు కనిపిస్తున్నాయి. ఆ సమయంలో మళ్లీ వారు పోలీసుస్టేషన్‌ లేదా కోర్టు మెట్లు ఎక్కక తప్పడం లేదు. ఇలా యువత తమ భవిష్యత్‌ను నాశనం చేసుకునే పరిస్థితులు ఏర్పడుతున్నాయి.

● కాజీపేటకు చెందిన ఓ విద్యార్థిని హనుమకొండలోని ఓ కళాశాలలో చదువుతుండగా మడికొండకు చెందిన యువకుడు ఆమెను ప్రేమ పేరుతో లొంగదీసుకుని వివాహం చేసుకున్నాడు. ఈ ఘటన స్థానిక పోలీసుస్టేషన్‌కు వచ్చింది. అయితే అక్కడ తల్లిదండ్రులు ఎంత నచ్చచెప్పినా ఆ అమ్మాయి వినకపోవడంతో చివరకు వారు తమకు కుమార్తె జన్మించలేదంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ప్రేమ వివాహం కొంత కాలం సాజావుగా సాగినా కుటుంబంలో కలహాలు ప్రారంభం కావడంతో ఆ యువతి మళ్లీ తల్లిదండ్రుల చెంతకు చేరింది.

● కాజీపేట ప్రశాంత్‌నగర్‌కు చెందిన యువకుడిని మూడు నెలల కింద అదే ప్రాంతంలో ఉన్న యువతి ప్రేమ వివాహం చేసుకుంది. అయితే తల్లిదండ్రులు ఎంత నచ్చ చెప్పినా ఆ యువకుడే కావాలంటూ పట్టుబట్టింది. ఈ విషయంపై కాజీపేట పోలీసుస్టేషన్‌లో కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ఆ యువతిని ఎలా పోషిస్తావని సదరు యువకుడిని పోలీసులు ప్రశ్నిస్తే సరైన సమాధానం చెప్పలేకపోయాడు. అయితే వారిద్దరి మధ్య కలహాలు నెలకొనడంతో పోలీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.

● ఇటీవల దర్గాకాజీపేట ప్రాంతానికి చెందిన ఓ మహిళ తాను చదువుతున్న కళాశాలలో యువకుడిని ప్రేమించింది. అయితే అది పెద్దలకు ఇష్టంలేకపోవడంతో వేరే యువకుడికిచ్చి పెద్దలు వివాహం చేశారు. కొద్దిరోజులు ఆ యువకుడితో ఉన్నప్పటికీ ఆమె ప్రేమించిన వ్యక్తిని మరచిపోలేక అతడి వద్దకు వెళ్లిపోయింది. కాని కొన్నాళ్లకు ప్రేమికుడితో విభేదాలు రావడంతో మళ్లీ తల్లిదండ్రుల చెంతకే చేరింది.

చిన్నతనంలోనే ప్రేమ వివాహాలు.. కొన్నాళ్లకే ఎడబాటు

పీఎస్‌లలో నిత్యం ప్రేమ పెళ్లిళ్ల

పంచాయితీలు

యువత పెడదారి..

దుఃఖసాగరంలో తల్లిదండ్రులు

Election 2024

మరిన్ని వార్తలు

Greenmarkdevelopers