సర్వేశా నీవే దిక్కు!

15 Nov, 2023 07:41 IST|Sakshi

హైదరాబాద్: వనస్థలిపురానికి చెందిన ఒక వ్యూహకర్త ఓ ప్రధాన పార్టీకి చెందిన అభ్యర్థి గెలుపు అవకాశాలపై సర్వే చేపట్టారు. ఇందుకోసం సుమారు 60 మంది బీటెక్‌ విద్యార్థులను రంగంలోకి దించారు. కాలనీలు, బస్తీలు, డివిజన్‌ల వారీగా ఆ విద్యార్థులు కొద్ది రోజులుగా విస్తృతంగా సర్వే నిర్వహిస్తున్నారు. ఓటర్లతో చర్చిస్తున్నారు. వివిధ వర్గాలకు చెందిన వారి అభిప్రాయాలను సేకరించి క్రోడీకరించారు. ఈ సర్వేల నుంచి రూపొందించిన నివేదికల ఆధారంగా సదరు అభ్యర్థి ఏయే వర్గాల్లో బలంగా ఉన్నారో, ఎక్కడ బలహీనంగా ఉన్నారో వ్యూహకర్త తేల్చిచెప్పారు.

సాధారణంగా ప్రధాన పార్టీలు తమ గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపై పెద్ద పెద్ద సంస్థలతో ఒప్పందాలను కుదుర్చుకొని వ్యూహాలను రూపొందించుకుంటాయి. కానీ ఇప్పుడు అభ్యర్థులు సైతం తమ నియోజకవర్గాల్లో వ్యక్తిగతంగా ఇలాంటి సర్వేలను నిర్వహించుకుంటున్నారు. ఇందుకోసం రెండు, మూడు నియోజకవర్గాలను ఎంపిక చేసుకొని సర్వేలు నిర్వహించి వ్యూహాలను సిద్ధం చేసే వ్యూహకర్తలు కూడా వచ్చేశారు.

ప్రస్తుత ఎన్నికల ప్రచార పర్వంలో ఈ ట్రెండ్‌ బలంగా కొనసాగుతోంది. ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌, బీజేపీ తదితర పార్టీలకు చెందిన అభ్యర్ధులు తమ అధినాయకత్వం చేపట్టే సర్వేలకు తోడు ఈ తరహా సొంత సర్వేలపై సీరియస్‌గా దృష్టి సారించారు. కేవలం ఒంటెత్తు ప్రచారం కొనసాగించకుండా ప్రత్యర్థుల కదలికలను గమనిస్తూ ప్రచారాన్ని కొనసాగించేలా వ్యూహాలకు పదునుపెడుతున్నారు. ఇందుకోసం ఈ సర్వేలు ఎంతో దోహదం చేస్తున్నాయని ఒక పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి నాయకుడొకరు తెలిపారు. ఈ సర్వేల కోసం అభ్యర్థులు భారీ మొత్తంలోనే వెచ్చించడం గమనార్హం.

నా బలమేంటి.. బలహీనతలేంటి?
ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ అభ్యర్థుల్లో అంతర్మథనం పెరిగింది. ఇప్పటి వరకు కొనసాగించిన ప్రచారాన్ని, గెలుపుపై ఉన్న ధీమాను సమీక్షించుకుంటూనే మరోవైపు బరిలో నిలిచిన వారి బలాబలాలను అంచనా వేస్తున్నారు. ‘నేను గెలవాలంటే ఏం చేయాలి.. నా బలం ఏంటీ.. బలహీనతలేంటీ’ అనే అంశాన్ని లక్ష్యంగా చేసుకొని ఈ సర్వేలను నిర్వహించుకుంటున్నారు.

ఇటీవల ఉప్పల్‌కు చెందిన ఒక పార్టీ అభ్యర్థి ఇదే తరహా సర్వే నిర్వహించారు. కొన్ని వర్గాల ప్రజలకు ఆయన దూరంగా ఉన్నట్లు సర్వేలో వెల్లడైంది.దీంతో ఆ వర్గాలకు చేరువయ్యేందుకు సదరు అభ్యర్థి దృష్టి సారించారు. అలాగే ప్రత్యర్థి బలహీనంగా ఉన్నచోట కూడా తన బలాన్ని పెంచుకోవాల్సి ఉందని గ్రహించారు. ఇలా నగరంలోని అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్ధులు సొంత సర్వేల ఆధారంగా ప్రచారాన్ని కొనసాగిస్తున్నారు. ఈ సర్వేలతో బీటెక్‌ వంటి ఉన్నత చదువులు చదివిన విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉపాధి లభిస్తోంది. వ్యూహకర్తలు సైతం భారీ మొత్తంలోనే సొమ్ము చేసుకుంటున్నారు.

తటస్థులే టార్గెట్‌..
సాధారణంగా ఏ ఎన్నికల్లో అయినా సరే బరిలో నిలిచిన అభ్యర్థులు ప్రతి కాలనీకి, గల్లీకి నిరంతరం వెళ్లడం సాధ్యం కాదు. అదే సమయంలో ప్రతిచోటా ఓట్ల సంఖ్యను పెంచుకోవాలి. ఇందుకోసం ద్వితీయ శ్రేణి నాయకులపై ఆధారపడి ఓటర్లను చేరుకుంటున్నారు. నియోజకవర్గ స్థాయి నుంచి డివిజన్‌ స్థాయి వరకు అభ్యర్థుల అనుచరులే కీలకంగా వ్యవహరిస్తున్నారు. బలమైన ఓటు బ్యాంకులను కాపాడుకొనేందుకు వ్యూహాత్మకంగా ప్రచారాన్ని కొనసాగిస్తూనే తటస్థులను టార్గెట్‌ చేస్తున్నారు. ఇందుకోసం కమ్యూనిటీల వారీగా ఓటుబ్యాంకులను కొల్లగొట్టేందుకు చర్యలు చేపడుతున్నారు.

‘ఏ డివిజన్‌లో, ఏ కాలనీలో, ఏ బస్తీలో ఉన్న ప్రజలు ఎటు వైపు ఆసక్తి చూపుతున్నారనేది ద్వితీయశ్రేణి నాయకులకే స్పష్టంగా తెలుస్తుంది. అదే సమయంలో తటస్థులెవరో తెలిసేది కూడా ద్వితీయశ్రేణి నాయకులకే. అందుకే ఓటర్లను ఆకట్టుకొనేందుకు, మెజారిటీ పెంచుకొనేందుకు తటస్థులకు చేరువ కావడం ఎంతో కీలకం’ అని ఒక ప్రధాన పార్టీకి చెందిన నాయకుడు చెప్పారు.

మరోవైపు అనుక్షణం ప్రత్యర్థి పార్టీల కదలికలను గమనిస్తూ తమ బలాన్ని పెంచుకొనేందుకు ప్రత్యర్థి పార్టీలో ఉన్న అసంతృప్త నాయకులను తమవైపు రాబట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు.

మరిన్ని వార్తలు