కాంగ్రెస్‌ వస్తే.. ఆరు నెలలకో సీఎం

15 Nov, 2023 05:21 IST|Sakshi
తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ అభివృద్ధి ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా ముందుంది: మంత్రి కేటీఆర్‌ 

తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో ప్రసంగం 

సాక్షి, హైదరాబాద్‌: ‘కాంగ్రెస్‌లో ముఖ్యమంత్రి పదవి కోసం మాజీ మంత్రి జానారెడ్డి సహా 11 మంది అభ్యర్థులు రెడీగా ఉన్నారు. కాంగ్రెస్‌ పార్టీ కొత్త సీసాలో పాత సారా లాంటిది. సీల్డ్‌ కవర్‌ సీఎంలు, అంతర్గత కుమ్ములాటలు నిత్యకృత్యం. కాంగ్రెస్‌ ఇస్తున్న గ్యారంటీల సంగతేంటోగానీ ఆరు నెలలకో సీఎం మాత్రం గ్యారంటీ’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌ అన్నారు.

మంగళవారమిక్కడ జరిగిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో కేటీఆర్‌ ప్రసంగించారు. సుస్థిర ప్రభుత్వం, దృఢమైన నాయకత్వం ఉంటేనే తెలంగాణ అభివృద్ధి నిరంతరంగా సాగుతుందన్నారు. ‘ఎవరు అవునన్నా, కాదన్నా తొమ్మిదిన్నరేళ్లలో మాకు నికరంగా దొరికిన ఆరున్నరేళ్లలో అసాధారణ విజయాలు సాధించాం. తెలంగాణ భూతల స్వర్గమైందని చెప్పడం లేదు.

సమస్యలు నిరంతరం ఉంటూనే ఉంటాయి. వాటిని పరిష్కరించడం ప్రభుత్వ బాధ్యత. కేసీఆర్‌ ప్రజల మనిష్, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ నేడు దేశానికి దిక్సూచీగా మారింది. మా పార్టీ ఎమ్మెల్యేలపై అక్కడక్కడా అసంతృప్తి ఉన్నా బీఆర్‌ఎస్‌కే ఓటర్లు మద్దతు పలుకుతారు. మేము దైవాంశ సంభూతులం కాదు. అందరినీ సంతృప్తపరచడం సాధ్యం కాదు. ఏ రకమైన ప్రభుత్వం కావాలో మీరే ఎంచుకోండి’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. 

మరింత వేగంగా అభివృద్ధి చేస్తాం 
‘హైదరాబాద్‌లో అభివృద్ధి ఇప్పటి దాకా చేసింది ట్రైలర్‌ మాత్రమే.. అసలు సినిమా ముందుంది. వచ్చే ప్రభుత్వంలో మరింత వేగంగా హైదరాబాద్‌ అభివృద్ధి చేసి చూపిస్తాం. 332 కి.మీ. రీజినల్‌ రింగ్‌ రోడ్డు నిర్మించడంతోపాటు ఔటర్‌ రింగ్‌రోడ్డు, రీజినల్‌ రింగ్‌ రోడ్డు నడుమ కొత్త హైదరాబాద్‌ను నిర్మిస్తాం. గత రెండున్నర దశాబ్దాల్లో అభివృద్ధి కోణంలో తెలంగాణపై ప్రభావం చూపిన వారు వైఎస్, చంద్రబాబు, కేసీఆర్‌ మాత్రమే’అని కేటీఆర్‌ అన్నారు.

కర్ణాటక పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడినట్లు ఉంది. అక్కడి కొత్త ప్రభుత్వం బిల్డర్లపై విధించిన స్పెషల్‌ ట్యాక్స్‌ 40 నుంచి 400 శాతానికి పెరిగింది. ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తేనే తెలంగాణ, హైదరాబాద్‌ అభివృద్ధి కళ్లకు కనబడుతుంది’అని కేటీఆర్‌ పేర్కొన్నారు. ఈ సమావేశంలో తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు ప్రభాకర్‌రావు, రాఘవరావు, పీర్జాదిగూడ మేయర్‌ జక్క వెంకట్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కేటీఆర్‌ దళిత్‌ ఇండియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అండ్‌ ఇండస్ట్రీస్‌ (డిక్కీ) ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

మరిన్ని వార్తలు