ఇద్దరు చిన్నారులకు కోవిడ్‌

23 Dec, 2023 05:06 IST|Sakshi

నాంపల్లి: నిలోఫర్‌ ఆసుపత్రిలో కోవిడ్‌ కేసులు పెరుగుతున్నాయి. ఆగాపుర ప్రాంతానికి చెందిన 14 నెలల చిన్నారికి కోవిడ్‌ పాజిటివ్‌ నిర్ధారణ అయింది. శుక్రవారం రంగారెడ్డి జిల్లాకు చెందిన మరో రెండు నెలల చిన్నారికి పాజిటివ్‌ వచ్చింది. దీంతో నిలోఫర్‌లో కోవిడ్‌ కేసుల సంఖ్య రెండుకు చేరింది. ఇవి పాత వేరియంట్‌ కేసులా లేక కొత్త వేరియంట్‌ (జేఎన్‌–1) కేసులా అని తెలుసుకునేందుకు చిన్నారి రోగుల రక్త నమూనాలను జీనోమిక్‌ సీక్వెన్స్‌ సెంటర్‌కు పంపించినట్లు నిలోఫర్‌ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఉషారాణి తెలిపారు. చిన్నారులకు కోవిడ్‌ పాజిటివ్‌గా నిర్దారణ కావడంతో వైద్యాధికారులు అప్రమత్తం అయ్యారు. ఆసుపత్రిలో ప్రత్యేక కోవిడ్‌ వార్డును ఏర్పాటు చేశారు. ఇన్ఫోసిస్‌ భవనంలో 120 బెడ్ల సామర్థ్యంతో ప్రత్యేక వార్డును అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికిప్పుడు కోవిడ్‌ కేసులు పెరిగినా 20 మంది రోగులకు సరిపడా సౌకర్యాలను సమకూర్చినట్లు, అవసరమైతే వార్డును పూర్తిస్థాయిలో వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని డాక్టర్‌ ఉషారాణి తెలిపారు.

శేరిలింగంపల్లిలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసు

శేరిలింగంపల్లి: శేరిలింగంపల్లిలో కోవిడ్‌ ఒక పాజిటివ్‌ కేసు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గౌలిదొడ్డికి చెందిన 34 ఏళ్ల వ్యక్తికి కోవిడ్‌ ఉన్నట్లు నిర్ధారణ కావడంతో కాంటినెంటల్‌ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నట్లు శుక్రవారం శేరిలింగంపల్లి అర్బన్‌ హెల్త్‌ సెంటర్‌ సీహెచ్‌ఓ స్వామి తెలిపారు.

బంజారాహిల్స్‌లో అగ్నిప్రమాదం

అయిదుగురిని కాపాడిన కానిస్టేబుళ్లు

పంజగుట్ట: బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–1లోని ఓ వ్యాపార సముదాయ భవనంలోని ఆరో అంతస్తులో విద్యుత్‌ షార్ట్‌సర్క్యూట్‌ కారణంగా శుక్రవారం తెల్లవారుజామున మంటలు చెలరేగి దట్టమైన పొగలు వ్యాపించాయి. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో అయిదుగురిని కాపాడారు. ఘటన వివరాలు ఇలా.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌– 1లోని జలగం వెంగళ్‌రావు పార్క్‌ ఎదురుగా ఉన్న మల్లిక్‌ ఎస్టేట్‌లో వ్యాపార సముదాయం ఉంది. ఆరో అంతస్తులో టెర్రస్‌పై ఉన్న ఫ్లాట్‌లో అపార్ట్‌మెంట్‌లో పని చేసే ఓ కుటుంబం ఉంటోంది. శుక్రవారం ఉదయం 7. 30 గంటల ప్రాంతంలో టెర్రస్‌పై నుంచి మంటలు రావడాన్ని గమనించిన స్థానికులు వెంటనే పంజగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పెట్రోకార్‌ సిబ్బంది, ట్రాఫిక్‌ కానిస్టేబుళ్లు శ్రావణ్‌ కుమార్‌, సత్యనారాయణ, దశరథరామిరెడ్డి ఫైర్‌ ఇంజిన్‌కు ఫోన్‌ చేసి రప్పించారు. బయట ఉన్న ఓ డంబుల్‌ కానిస్టేబుళ్లు సాయంతో తలుపు గడియలు పగులగొట్టి ఫ్లాట్‌ లోపల ఉన్న అయిదుగురు కుటుంబ సభ్యులను బయటకు తీసుకువచ్చారు. అప్పటికే ఇంట్లోని వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. ప్రమాదం నుంచి బయటపడిన ఓ మానసిక దివ్యాంగుడిని, అతని కుటుంబ సభ్యులను ఆసుపత్రికి తరలించారు. పోలీసులు చూపిన చొరవకు స్థానికులు అభినందించారు. ఆలస్యంగా వచ్చిన మూడు ఫైరింజిన్‌లు మంటలను ఆర్పాయి.

>
మరిన్ని వార్తలు