సెక్యులర్‌ ప్రభుత్వంతోనే మత సామరస్యం 

23 Dec, 2023 04:54 IST|Sakshi
చిన్నారులకు కానుకలు అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి

క్రిస్‌మస్‌ వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి 

వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో గెలుపు కాంగ్రెస్‌ పార్టీదే.. 

సాక్షి, హైదరాబాద్‌: సెక్యులర్‌ ప్రభుత్వాల పాలనలోనే మత సామరస్యం సాధ్యమవుతుందని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుస్తుందని, కేంద్రంలో తిరిగి సెక్యులర్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన క్రిస్‌మస్‌ వేడుకల్లో అసెంబ్లీ స్పీకర్‌ జి.ప్రసాద్‌కుమార్, మంత్రి పొన్నం ప్రభాకర్‌లతో కలసి రేవంత్‌ పాల్గొన్నారు.

క్రిస్‌మస్‌ కేక్‌ను కట్‌ చేసి ఉత్సవాలను ప్రారంభించి మాట్లాడారు. దేశంలో కాంగ్రెస్‌ పాలనలో అన్ని మతాలకు సమ ప్రాధాన్యం దక్కుతుందని చెప్పారు. ‘‘డిసెంబర్‌లో తెలంగాణలో మిరాకిల్‌ జరుగుతుందని నేను ముందుగానే చెప్పాను. మొన్న హిమాచల్, నిన్న కర్ణాటక, నేడు తెలంగాణలో సెక్యులర్‌ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయి.పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్‌ గెలుపును అన్ని వర్గాల ప్రజలు కోరుకోవాలి.. అని పేర్కొన్నారు. 

నిత్యం ప్రజల్లోనే ఉంటా.. 
తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం ఏర్పడిందని, ప్రతి సంక్షేమ కార్యక్రమాన్ని చివరి లబ్ధిదారు వరకు అందించే దిశగా పాలన సాగిస్తామని రేవంత్‌ చెప్పారు. తామంతా పాలకుల మాదిరి కాకుండా సేవకుల్లా పనిచేస్తామని.. ప్రజలకు ఎలాంటి సమస్యలున్నా వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నామని వివరించారు. ఆ దిశగానే గడీలను బద్దలుకొట్టి ప్రజలకు ప్రవేశం కల్పించామని.. వారంలో రెండ్రోజులు ప్రజావాణి వింటున్నామని చెప్పారు.

మిడ్జిల్‌ జెడ్పీటీసీ సభ్యుడిగా ప్రజల్లోకి వచ్చిన తాను ఇప్పటివరకు ప్రజలతోనే ఉన్నానని, ఇకపైనా నిత్యం ప్రజల్లోనే ఉంటానని రేవంత్‌ పేర్కొన్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వ ఏర్పాటు కోసం మైనార్టీలు ఎన్నో ప్రార్థనలు చేశారని, ఇప్పుడు దేశంలోనూ కొత్త ప్రభుత్వం కోసం అదే తరహాలో ప్రార్థనలు చేయాలని కోరారు. ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన వారిని సీఎం రేవంత్‌ సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి షబ్బీర్‌ అలీ, ప్రభుత్వ సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ, బిషప్‌లు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు