ఆయన మరణం పుతిన్‌ నాశనానికే: బైడెన్‌ ఫైర్‌

17 Feb, 2024 09:32 IST|Sakshi

ఆయన చనిపోవడం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత, పుతిన్‌దే పూర్తి బాధ్యత.. అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు అమెరికా అధ్యక్షుడు బైడెన్‌..  

రష్యా ప్రతిపక్ష నేత,  పుతిన్‌ విమర్శకుడు అలెక్సీ నావల్నీ(47) హఠాన్మరణంపై యావత్‌ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది. అర్కిటిక్‌ సర్కిల్‌లోని రష్యా పీనల్‌ కాలనీలో కారాగార శిక్ష అనుభవిస్తున్న ఆయన.. ఉన్నట్లుండి కుప్పకూలి మరణించారని.. వైద్యులు ప్రయత్నించినా లాభం లేకపోయిందని అధికారిక వర్గాలు ప్రకటించాయి.  అయితే.. అంతకు ముందు రోజు కూడా కోర్టు విచారణకు నవ్వుతూ హాజరైన నావల్నీ.. ఉన్నట్లుండి మరణించడంతో క్రెమ్లిన్‌ పాత్రపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

అలెక్సీ నావల్నీ మృతిపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. శుక్రవారం వైట్‌హౌజ్‌లో ఆయన మాట్లాడుతూ.. నావల్నీ మరణం నాకేం ఆశ్చర్యంగా అనిపించలేదు. ఆయనొక పోరాటయోధుడు. అవినీతి విషయంలో పుతిన్‌ను ఎదురించాడు.  పుతిన్ ప్రభుత్వ పాల్పడుతున్న హింసకు ధైర్యంగా అడ్డుచెప్పాడు. నావల్నీ(అలెక్సీ నావల్నీ) చావుకి పుతిన్‌దే బాధ్యత.. ఇది పుతిన్‌ వినాశనానికి దారి తీయక తప్పదు’’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారాయన. మరోవైపు నావల్నీ మృతిపై పూర్తిస్థాయి నివేదికను రూపొందించే పనిలో ఉన్నట్లు వైట్‌హౌజ్‌ వర్గాలు వెల్లడించాయి. 

ఇంకోవైపు మ్యూనిచ్‌ భద్రతా సదస్సులో పాల్గొన్న ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్‌.. అలెక్సీ నావల్నీ భార్య  యూలియాని కలిసి ఓదార్చారు. ఆ సందర్భంలో మీడియాతో మాట్లాడుతూ యూలియా కన్నీటి పర్యంతమయ్యారు. ‘‘నా భర్త మృతి నిజమే అయితే అందుకు పుతిన్, ఆయన అనుచర గణమే బాధ్యులు. ఎప్పటికైనా వారు శిక్ష నుంచి తప్పించుకోలేరు’’ అని యూలియా అన్నారు. 

అతి(తీవ్ర)వాదం అభియోగాలపై కిందటి ఏడాది ఆగస్టులో అలెక్సీ నావల్నీకి 19 ఏళ్ల జైలుశిక్ష పడింది. ‘‘నా ప్రాణం ఉన్నంతవరకు లేదా ఈ (పుతిన్‌) ప్రభుత్వం ఉన్నంత కాలం నేను జైల్లోనే ఉంటానన్న సంగతి నాకు తెలుసు’’ అని నాటి తీర్పు సమయంలో నావల్నీ వ్యాఖ్యానించారు. రెండు నెలల కిందటే ఆయన్ని.. అర్కిటిక్‌ సర్కిల్‌లోని రష్యా పీనల్‌ కాలనీకి తరలించారు.

ఇదీ చదవండి: నిరసన గళం మూగబోయింది

పుతిన్‌ హేట్స్‌ నావల్నీ 
రష్యా అధ్యక్ష కార్యాలయం క్రెమ్లిన్‌ విధానాలను వ్యతిరేకిస్తూ నావల్నీ అనేక నిరసనలు చేపట్టారు. అందుకుగాను పలుమార్లు అరెస్టయ్యారు. గత అధ్యక్ష ఎన్నికల్లో నావల్నీ పోటీ చేశారు. వ్లాదిమిర్‌ పుతిన్‌కు ఆయనంటే తీవ్ర కోపం. నావల్నీ పేరును పలికేందుకు కూడా ఇష్టపడేవారు కాదు. నావల్నీకి మరింత ఎక్కువ పేరు రావొద్దనే ఆయన పేరును పుతిన్‌ పలికేవారు కాదన్నది విశ్లేషకుల అభిప్రాయం. ఎప్పుడైనా ఆయన గురించి మాట్లాడాల్సి వస్తే.. ఆ వ్యక్తి అని మాత్రమే సంబోధించేవారు.

ఆది నుంచీ ధిక్కార స్వరమే!
ప్రభుత్వ అధికారుల అవినీతిపై ఆయన అలుపెరుగని పోరాటం చేశారు. పుతిన్‌ సర్కారు పాలనా విధానాల్లో లోపాలను తీవ్రంగా ఎండగట్టారు. ఈ క్రమంలో తన ప్రాణాలకు ముప్పు ఎదురైనా లెక్కచేయలేదు. నాయకులు/అధికారుల అవినీతిపై స్వతంత్ర దర్యాప్తు జరిపి అనేక కీలక వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చారు. ప్రభుత్వరంగ టీవీ ఛానళ్లలో నావల్నీకి ఏమాత్రం ప్రచారం లభించేది కాదు. అయితే యూట్యూబ్‌ వీడియోలు, సామాజిక మాధ్యమ ఖాతాలతో ఆయన జనానికి బాగా దగ్గరయ్యారు.

whatsapp channel

మరిన్ని వార్తలు