టెక్‌ పరిశ్రమ ఆదాయం 254 బిలియన్‌ డాలర్లకు! | Sakshi
Sakshi News home page

టెక్‌ పరిశ్రమ ఆదాయం 254 బిలియన్‌ డాలర్లకు!

Published Sat, Feb 17 2024 9:27 AM

Tech Industry Revenue Growth 3.8 Percent Said Nasscom - Sakshi

ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ టెక్నాలజీ పరిశ్రమ ఆదాయం 3.8 శాతం వృద్ధి చెంది 254 బిలియన్‌ డాలర్లకు చేరవచ్చని ఐటీ సంస్థల సమాఖ్య నాస్కామ్‌ అంచనా వేసింది. టెక్‌ రంగం గత ఆర్థిక సంవత్సరంలో 244.6 బిలియన్‌ డాలర్ల ఆదాయం నమోదు చేసింది.

ఈసారి హార్డ్‌వేర్‌ని మినహాయిస్తే ఆదాయం 3.3 శాతం పెరిగి 199 బిలియన్‌ డాలర్లుగా ఉండవచ్చని వార్షిక నివేదికలో నాస్కామ్‌ తెలిపింది. గతేడాది టెక్నాలజీపై కంపెనీలు చేసే వ్యయాలు 50 శాతం మేర, టెక్‌ కాంట్రాక్టులు 6 శాతం మేర తగ్గిపోయినప్పటికీ  దేశీ పరిశ్రమ 3.8 శాతం (9.3 బిలియన్‌ డాలర్లు) వృద్ధి నమోదు చేయొచ్చని పేర్కొంది. అలాగే నికరంగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని వివరించింది.

‘ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరం పరిశ్రమ వృద్ధి చెందనుంది. ఆశ్చర్యకరంగా ఎగుమతులు కొంత తగ్గినప్పటికీ దేశీ మార్కెట్‌ గణనీయంగా పుంజుకుంది. దేశీయ మార్కెట్‌కి ఇది అత్యంత వేగవంతమైన వృద్ధి కావచ్చు‘ అని నాస్కామ్‌ ప్రెసిడెంట్‌ దేవయాని ఘోష్‌ తెలిపారు. ప్రధానంగా ప్రభుత్వం, కంపెనీలు ఖర్చులు చేయడం వల్ల దేశీయంగా పరిశ్రమ ఆదాయ వృద్ధికి ఊతం లభిస్తోందని ఆమె వివరించారు. గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ (జీసీసీ) దేశాలకు భారత్‌ అత్యంత ప్రాధాన్య హబ్‌గా కొనసాగుతోందని తెలిపారు. ఎగుమతుల ద్వారా వచ్చే మొత్తం ఆదాయంలో ఇంజినీరింగ్‌ రీసెర్చ్, డెవలప్‌మెంట్‌ (ఈఆర్‌డీ) విభాగం వాటా 48 శాతంగా ఉందని ఘోష్‌ చెప్పారు. ఈ రంగం అంచనాలకు మించిన పనితీరు కనపర్చవచ్చని భావిస్తున్నట్లు తెలిపారు.  

ఏఐ, క్లౌడ్‌లో ఉద్యోగాలు.. 
కృత్రిమ మేథ (ఏఐ) రాకతో ఉద్యోగాలు పోతున్నాయంటూ వార్తలు వచ్చినప్పటికీ వాస్తవానికి ఉపాధి కల్పన పెరిగిందని ఘోష్‌ చెప్పారు. పరిశ్రమలో నికరంగా 60,000 ఉద్యోగాల కల్పన జరిగిందని, మొత్తం సిబ్బంది సంఖ్య 54.3 లక్షలకు చేరిందని ఆమె తెలిపారు. ఏఐ, డేటా, క్లౌడ్, సైబర్‌ సెక్యూరిటీ వంటి విభాగాల్లో నియామకాలు ఉండనున్నాయని చెప్పారు. దీంతో కంపెనీలు తమ సిబ్బందికి కొత్త నైపుణ్యాల్లో శిక్షణ కల్పించడంపై మరింతగా కృషి చేస్తున్నాయన్నారు. అంతర్జాతీయంగా 6,50,000 మంది పైచిలుకు ఉద్యోగులు జనరేటివ్‌ ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ పొందుతున్నారని ఘోష్‌ చెప్పారు.     

Advertisement

తప్పక చదవండి

Advertisement