ఆస్ట్రేలియా కరెన్సీపై బ్రిటిష్‌ రాజరికం కనుమరుగు

3 Feb, 2023 05:38 IST|Sakshi

కాన్‌బెర్రా: ఆస్ట్రేలియా మరో బ్రిటిష్‌ వలసపాలన తాలూకు గుర్తును చెరిపేసుకుంటోంది. అక్కడి 5 ఆస్ట్రేలియా డాలర్ల కరెన్సీ నోటుపై ఇన్నాళ్లూ బ్రిటిష్‌ రాణి ఎలిజబెత్‌ ముఖచిత్రాన్ని ముద్రించారు. రాణి ఎలిజబెత్‌ అస్తమయం తర్వాత రాజుగా పగ్గాలు చేపట్టిన కింగ్‌ ఛార్లెస్‌ ముఖచిత్రాన్ని 5 డాలర్ల కరెన్సీ నోటుపై ముద్రించాలని భావించట్లేదని ఆస్ట్రేలియా కేంద్ర బ్యాంక్‌ తాజాగా ప్రకటించింది. అయితే, ఛార్లెస్‌ ఫొటో ఉండే కొత్త నాణేలను మాత్రం ఈ ఏడాది చివరిలోపు చలామణిలోకి తీసుకురానున్నారు.

ఇన్నాళ్లూ ఒక్క 5 డాలర్ల నోటుపైనే బ్రిటిష్‌ రాజరిక ఆనవాళ్లు ఉండేవి. ఎలిజబెత్‌ ఫొటో తొలగింపుతో నోట్లపై నామరూపాలు పోయినట్లే. ఈ మార్పుపై ప్రభుత్వంతో చర్చించాకే ఈ తుది నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర బ్యాంక్‌ వెల్లడించింది. ఆస్ట్రేలియా రాజ్యాంగం ప్రకారం బ్రిటిష్‌ రాజరికమే అత్యున్నత పరిపాలన హోదాలో ఉంది. కానీ మారిన వర్తమాన రాజకీయ, భౌగోళిక పరిస్థితుల్లో ఆ రాజరికం కేవలం అలంకారప్రాయంగా తయారైంది.

‘కొత్త నోటుకు ఒకవైపు ఆస్ట్రేలియా పార్లమెంట్, మరో వైపు ఆస్ట్రేలియా తొలితరం స్థానికుల లేదా దేశ అద్భుత ప్రకృతి అందాల ఫొటోను పొందుపరుస్తాం’ అని ఆర్థిక మంత్రి జిమ్‌ చామర్స్‌ అన్నారు. కరెన్సీపై రాజరికాన్ని వదలుకోవడంపై అక్కడి రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గణతంత్రదేశంగా ఆవిర్భవించే ప్రయత్నం చేస్తోందని కొందరు ఎంపీలు వ్యాఖ్యానించారు.

మరిన్ని వార్తలు