కరోనా మూలాలు తేలాల్సిందే!

26 Sep, 2020 15:00 IST|Sakshi

సిడ్నీ: కరోనా వైరస్ మహమ్మారి చైనాలోనే పుట్టిందన్న వాదనల మధ్య ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ మరోసారి చైనాపై తన దాడిని ఎక్కుపెట్టారు. కరోనా వైరస్ పుట్టుపూర్వోత్తరాలు తెలుసు కోవడానికి ప్రపంచ దేశాలు తమ వంతు కృషి చేయాలని డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి మహమ్మారి విజృంభించకుండా, ఏం జరిగిందో అర్థం చేసుకునేందుకు మనం చేయగలిగినదంతా చేయాలని  చెప్పారు. ఐక్యరాజ్యసమితి సమావేశంలో మోరిసన్ మాట్లాడుతూ శనివారం ఈవ్యాఖ్యలు చేశారు.  కరోనా మూలలపై విచారణ చేస్తేనే మానవాళికి మరో ప్రపంచ మహమ్మారి ముప్పు తప్పుతుందన్నారు. (కరోనా మరణాలపై డబ్ల్యూహెచ్‌ఓ ఆందోళన)

టెలికాన్ఫరెన్స్ వీడియో లింక్ ద్వారా ఐరాస్ 75 వ వార్షికోత్సవ సమావేశాల్లో ప్రసగించిన మోరిసన్ ప్రపంచ దేశాలను కరోనా వణికించిందని, మానవాళిని విపత్తులో ముంచిందని వ్యాఖ్యనిచారు. కోవిడ్-19 వైరస్ జెనెటిక్ మూలాన్ని,  అది మానవులకు ఎలా వ్యాపించిందో గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే ఎవరు టీకాను కనుగొన్నారో వారు ప్రపంచ దేశాలతో తప్పక పంచుకోవాలని ఇది నైతిక బాధ్యత అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆస్త్రేలియా వాగ్దానం చేస్తోందిని అలాగే అన్ని దేశాలు అలా చేయాలని పిలుపునిచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలో చైనాపై ప్రధాని దాడి తరువాత ఆస్ట్రేలియా చైనా మధ్య సంబంధాలు, వాణిజ్య యుధ్దం సెగలకు మోరిసన్ తాజా వ్యాఖ్యలు మరింత ఆజ్యం పోస్తున్నాయి.  

కాగా ప్రపంచవ్యాప్తంగా విలయాన్ని సృష్టించిన కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తిపై సర్వత్రా ఆగ్రహ జ్వాలలు చెలరేగుతున్న సంగతి తెలిసిందే. అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ తరువాత ఆస్ట్రేలియా డ్రాగన్‌ను టార్గెట్ చేసింది. అప్పటి నుండి చైనా ఆస్ట్రేలియాపై వాణిజ్య ఆంక్షలు విధించింది. బీఫ్ దిగుమతులను నిలిపివేసింది. వైన్ దిగుమతులపై యాంటీ డంపింగ్ దర్యాప్తును ప్రారంభించింది. చైనాలోని వుహాన్ సిటీలోని ఓ ప్రయోగశాలలో ఈ వైరస్ పుట్టిందంటూ ఇప్పటికే అమెరికాతో పాటు పలు పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో దీని పుట్టు పూర్వోత్తరాలపై ఓ స్వతంత్ర దర్యాప్తు నిర్వహించాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్ధపై ఒత్తిడి పెరుగుతోంది. (కరోనాపై లాన్సెట్ తాజా హెచ్చరికలు)

మరిన్ని వార్తలు