నాలుక మడతేసి.. ప్రత్యర్థులకు మళ్లీ దొరికిన ప్రెసిడెంట్‌

2 Mar, 2024 11:47 IST|Sakshi

వాషింగ్టన్‌: బైడెన్‌ మళ్లీ నాలుక మడతేశారు. ఒకటి చెప్పాలనుకుని మరొకటి చెప్పి ఎన్నికల వేళ రాజకీయ ప్రత్యర్థులకు మళ్లీ దొరికిపోయారు. నవంబర్‌లో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రైమరీ బ్యాలెట్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. డెమొక్రాట్ల తరపున అధ్యక్ష అభ్యర్థిత్వ రేసులో బైడెన్‌ ముందున్నారు. అయితే బైడెన్‌ వయసు చాలా ఎక్కువని, రెండోసారి అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు ఆయన పనికిరారని ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ డెమొక్రాట్లలో కూడా కొందరు విమర్శిస్తున్నారు.

ఈ నేపథ్యంలో బైడెన్‌ తన మతిమరుపు, వృద్ధాప్యాన్ని మళ్లీ మళ్లీ బయటపెట్టుకోవడం ఆయన ప్రత్యర్థులకు ఆయుధంగా మారుతోంది. తాజాగా శుక్రవారం ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోనితో వైట్‌హౌజ్‌లో బైడెన్‌ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమెరికా ఇక నుంచి పాలస్తీనాలోని గాజాలో ఆహారపొట్లాలు విమానాల ద్వారా జారవిడుస్తుందని చెప్పబోయి ఉక్రెయిన్‌కు ఆహారం సప్లై చేస్తామని స్టేట్‌మెంట్‌ ఇచ్చారు.

అయితే అది ఉక్రెయిన్‌ కాదని, గాజా అని కొద్దిసేపటి తర్వాత వైట్‌హౌజ్‌ క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. గత నెల మొదటి వారంలో కూడా ఈజిప్ట్‌ ప్రధాని అబ్దిల్‌ ఫట్టా పేరును ప్రస్తావిస్తూ ఆయనను మెక్సికో అధ్యక్షుడిగా పేర్కొనడం విమర్శలకు దారి తీసింది. అయితే బైడెన్‌ డాక్టర్లు మాత్రం ఆయన అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించేందుకు అవసరమైన ఫిట్‌నెస్‌తో ఉన్నారని స్పష్టం చేయడం గమనార్హం.   

ఇదీ చదవండి.. కరువు కోరల్లో గాజా.. బైడెన్‌ కీలక ప్రకటన 

whatsapp channel

మరిన్ని వార్తలు