China Flight Crash: చైనాలో ఘోర విమాన ప్రమాదం.. మొత్తం 132 మంది మృతి!

21 Mar, 2022 14:03 IST|Sakshi

బీజింగ్‌: చైనా దక్షిణ గ్వాంగ్జీ ఝువాంగ్‌ ప్రాంతంలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. 132 మందితో వెళ్తున్న ఒక పాసింజర్‌ విమానం సోమవారం ఈ ప్రాంతంలో కుప్పకూలిందని అధికార వర్గాలు ప్రకటించాయి. ప్రమాదంలో అంతా మరణించి ఉంటారని భావిస్తున్నారు. చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌కు చెందిన బోయింగ్‌ 737 ఎయిర్‌క్రాఫ్ట్‌ గ్వాంఝుకు వెళ్లేందుకు కున్మింగ్‌ నుంచి స్థానిక సమయం ప్రకారం మధ్యాహ్నం 1.10కి బయలుదేరింది. 2.52 కు గమ్యస్థానం చేరాల్సి ఉండగా వుఝు సమీపంలోని టెంగ్జియాన్‌ కౌంటీ ప్రాంతంలోకి రాగానే కొండను ఢీకొని కూలిపోయింది. మంటలను అదుపులోకి తెచ్చామని, సహాయక చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు. ఘటనపై చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై విచారణకు ఆదేశించారు.


నిట్టనిలువునా కూలింది 
ప్రమాద దృశ్యాలు దగ్గర్లోని మైనింగ్‌ కంపెనీ సెక్యూరిటీ కెమెరాలో రికార్డయ్యాయి. విమానం అదుపు తప్పి నిట్టనిలువుగా కూలిపోతూ కన్పించింది. 29వేల అడుగుల ఎత్తు నుంచి వేగంగా పడిపోతూ కేవలం 2.15 నిమిషాల్లో 9 వేల అడుగులకు చేరింది. మరో 20 సెకన్లలో 3,225 అడుగులకు దిగిందని ఫ్లైట్‌ రాడార్‌ వెల్లడిస్తోంది. అంతెత్తునుంచి విమానం నేలను తాకడానికి దాదాపు 30 నిమిషాలు పడుతుంది. కానీ 3 నిమిషాల్లో నేలకూలడం ప్రమాద తీవ్రతను తెలియజేస్తోందని నిపుణులు భావిస్తున్నారు. విమాన భద్రతలో చైనా ట్రాక్‌ రికార్డు గొప్పగా ఉంది. చైనాలో చివరిసారి 2010లో విమాన ప్రమాదం జరిగింది. 

బోయింగ్‌ విమానాలపై నిఘా: భారత్‌
ప్రమాద వార్త తెలియగానే భారత్‌లోని బోయింగ్‌ 737 విమానాలన్నింటిపై మరింత నిఘా పెట్టినట్లు డీజీసీఏ ప్రకటించింది. 2018, 2019ల్లో అంతర్జాతీయంగా జరిగిన బోయింగ్‌ ప్రమాదాల తర్వాత దేశంలో బోయింగ్‌ 737 మాక్స్‌ విమానాలను డీజీసీఏ నిషేధించింది. సాంకేతిక మార్పుల తర్వాత గత ఆగస్టు నుంచి తిరిగి అనుమతించింది. ప్రస్తుతం దేశంలో స్పైస్‌జెట్, ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్, విస్తారా వద్ద బోయింగ్‌ 737 విమానాలున్నాయి. ప్రమాదంపై బోయింగ్‌ స్పందించలేదు. చైనా ఈస్ట్రన్‌ ఎయిర్‌లైన్స్‌ తమ ఆధీనంలోనిబోయింగ్‌ విమానాలన్నింటినీ నిలిపివేసింది. 

మరిన్ని వార్తలు