నెట్టింట హల్‌చల్‌: అరుదైన యాపిల్స్‌, ధర ఎంతో తెలుసా?

18 Nov, 2023 15:56 IST|Sakshi

ప్రపంచంలో అనేక రకాల  పండ్లు ఉన్నప్పటికీ యాపిల్‌ ప్రత్యేకతే వేరు కాదా. యాపిల్‌ పండు లాంటి బుగ్గలు, ఎర్రటి యాపిల్‌ ఇలాంటివి ఇప్పటి దాకా విన్నాం.  బొద్దుగా ఎర్రగా ఉన్న పిల్లల్ని ముద్దుగా ‘యాపిల్‌’ అని పిలుచుకోవడం కూడా తెలుసు. ఆ తరువాతి కాలంలో గ్రీన్‌ యాపిల్స్‌ కూడా  వచ్చాయి.  కానీ ఇపుడు బ్లాక్‌ యాపిల్స్‌ కూడా  వచ్చాయి.  మీరు ఎపుడైనా చూశారా?  చదువుతూ ఉంటేనో నోట్లో నీళ్లు ఊరుతున్నాయా? మరి వీటి ధర  ఎంత  తెలుసా? నెట్టింట తెగ వైరల్‌ లవుతున్న ఈ  బ్లాక్‌ డైమండ్‌ యాపిల్‌  వివరాలన్నీ తెలుసు కోవాలంటే మీరు ఈ స్టోరీ  చదవాల్సిందే. 

డాక్టర్‌ అవసరం లేకుండా జీవించాలంటే రోజుకు ఒక యాపిల్‌ అయినా తినాలనేది. అలా విటమిన్లు, ఫైబర్‌, పోషకాలు ఇతర శ్రేష్టమైన గుణాలు ఇందులో మెండు. అందుకే యాపిల్‌ అంటే అంత ప్రత్యేకత.   రెడ్‌ యాపిల్‌లోని లక్షణలతో పోలిస్తే బ్లాక్‌ రంగులో ఉండే యాపిల్స్‌ అసాధారణమైన తీపి, అధిక సహజ గ్లూకోజ్ కంటెంట్‌ను కలిగి ఉంటాయి. మందమైన చర్మంతో నిగనిగలాడే  ఈ యాపిల్స్‌ చైనాలోని ఉన్నత స్థాయి రిటైలర్లు మాత్రమే విక్రయిస్తారు.   అయితే ధర మాత్రం ఒక్కో పండుకు రూ.500 వరకూ ఉంటుంది. 

ఇవి కేవలం చైనా, టిబెట్‌లోని పర్వత ప్రాంతాల్లో మాత్రమే పండుతాయి. అంతేకాదు సాధారణంగా యాపిల్‌ చెట్లు రెండు మూడేళ్లలోనే కాపు మొదలు  పెడితే,  బ్లాక్‌ యాపిల్‌ తొలి పంట చేతికందడానికే కనీసం 8 ఏళ్ల సమయం పడుతుందట. అందులోనూ నిటారుగా ఉన్న పర్వత సానువుల్లో వీటిని పండిస్తారు. ఈ నేపథ్యంలోనే  రైతులు వీటి సాగులో అనేక సవాళ్లను ఎదుర్కొంటారట. వీటిని పెద్ద ఎత్తున సాగు చేయడం కూడా కష్టమే అవుతుంది. హార్వెస్టింగ్ సీజన్ కేవలం రెండు నెలలు మాత్రమే. అందులోనూ 30 శాతం పండ్లు మాత్రమే మార్కెట్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉండి మార్కెట్లోకి వస్తాయి. అందుకే వీటికి అంత డిమాండ్‌.

మరిన్ని వార్తలు