బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌.. ప్యాలెస్‌ కీలక ప్రకటన

6 Feb, 2024 07:58 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3 అస్వస్థతకు గురయ్యారు. ఈ నేపథ్యంలో ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ నిర్ధారణ అయినట్టు బకింగ్‌హాం ప్యాలెస్‌ తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది. ఈ క్రమంలోనే ఛార్లెస్‌-3 సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్‌ వివరించింది. 

వివరాల ప్రకారం.. బ్రిటన్‌ రాజు ఛార్లెస్‌-3కి క్యాన్సర్‌ ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు బకింగ్‌హం ప్యాలెస్‌ సోమవారం ఓ ప్రకటనలో పేర్కొంది. అయితే, అది ప్రొస్టేట్‌ క్యాన్సర్‌ కాదని, ఇటీవల పెరిగిన ప్రొస్టేట్‌కు చికిత్స సందర్భంగా వ్యాధి బయటపడిందని తెలిపింది. అది ఏ రకమైన క్యాన్సరనేది అధికారికంగా వెల్లడి కాలేదు. దీంతో, కింగ్‌ ఛార్టెస్‌ సోమవారం నుంచి చికిత్స తీసుకుంటున్నారని ప్యాలెస్‌ వివరించింది. కాగా, క్యాన్సర్‌కు చికిత్స పూర్తి చేసుకుని త్వరలోనే ఆయన సాధారణ విధుల్లోకి వస్తారని పేర్కొంది. 

మరోవైపు.. వీలైనంత త్వరగా ఛార్లెస్-3 పూర్తి విధుల్లోకి రావాలనుకుంటున్నారని చికిత్స సమయంలో బహిరంగ కార్యక్రమాలకు దూరంగా ఉండనున్నారని ప్యాలెస్​ అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆయన హాజరయ్యే అధికారిక కార్యక్రమాలు ఇతర సీనియర్ రాజ కుటుంబీకులు నిర్వర్తించనున్నారు. 2022సెప్టెంబరు​లో తన తల్లి క్వీన్‌ ఎలిజబెత్‌-2 96 ఏళ్ల వయసులో మరణించడం వల్ల ఛార్లెస్​-3 బ్రిటన్​ రాజుగా ఎన్నికయ్యారు.

దేశాధినేతల స్పందన..
ఛార్లెస్​-3 క్యాన్సర్​ బారిన పడడంపై బ్రిటన్​ ప్రధాని రిషి సునాక్ ఎక్స్​ వేదికగా స్పందించారు. ‘మీరు త్వరగా కోలుకోవాలి. త్వరలోనే సంపూర్ణ ఆరోగ్యంతో మీరు తిరిగి వస్తారనడంలో నాకు ఎటువంటి సందేహం లేదు. దేశం మొత్తం మీ వేగవంతమైన రికవరీని కోరుకుంటుంది’ అంటూ రాసుకొచ్చారు. కెనడా ప్రధాని జస్టిన్‌ ట్రూడోతో పాటు బ్రిటన్​ మాజీ ప్రధానులు లిజ్ ట్రస్, బోరిస్ జాన్సన్, సర్ టోనీ బ్లెయిర్​ కూడా ఎక్స్​ వేదికగా రాజు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.

whatsapp channel

మరిన్ని వార్తలు

Garudavega