Burj Khalifa: బుర్జ్‌ ఖలీఫాపై భారత జెండా రెపరెపలు ఎందుకంటే...

26 Apr, 2021 14:30 IST|Sakshi

అబుదాబి: దేశ వ్యాప్తంగా కరోనా వైరస్‌ చాపకిందనీరులా వ్యాపిస్తూనే ఉంది. రోజు లక్షల్లో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులు గణనీయంగా పెరగడంతో ఆసుపత్రిలో పేషంట్లకు బెడ్స్‌ దొరకని పరిస్థితి. అంతేకాకుండా ఆక్సిజన్‌ కొరత కూడా ఏర్పడింది. కరోనాపై యుద్ధం చేస్తున్న భారత్‌కు పలుదేశాలు మద్దతు పలుకుతున్నాయి. అమెరికా, యూకే, జర్మనీ, యూఏఈ మొదలైన దేశాలు తమ వంతు సహాయాన్ని అందించడం కోసం ముందుకు వచ్చాయి.

భారత్‌కు మద్దతు తెలుపుతూ దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫాపై భారతదేశ జాతీయ జెండాను ప్రదర్శించారు. అంతేకాకుండా ‘స్టేస్ట్రాంగ్ ఇండియా’ అనే సందేశాన్ని బుర్జ్‌ ఖలీఫాపై ప్రదర్శించారు. అబుదాబిలోని భారత రాయబార కార్యాలయం ఆదివారం  ట్విట్‌లో ప్రపంచంలోని ఎత్తైన భవనం బుర్జ్ ఖలీఫాపై భారత జాతీయజెండాను 17 సెకన్ల పాటూ ప్రదర్శించిన వీడియోను ట్విటర్‌లో పోస్ట్‌ చేసింది.

ప్రస్తుతం భారత్‌లో కొత్తగా 3,54,653 కరోనా కేసులు నమోదు కాగా 2,808 మరణాలు సంభవించాయి. అయితే నిన్న ఒక్కరోజే 2,19,272 మంది కరోనా నుంచి కోలుకోవడం విశేషం. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,73,13,163గా ఉండగా, కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,95,123కి చేరింది. ఈ మేరకు సోమవారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలను విడుదల చేసింది.


చదవండి: క‌రోనా సెకండ్ వేవ్‌కు ఎన్నిక‌ల సంఘ‌మే కార‌ణం: హైకోర్టు

మరిన్ని వార్తలు