అమెరికా టూరిస్టులపై చైనా కీలక నిర్ణయం

31 Dec, 2023 08:36 IST|Sakshi

వాషిం‍‍గ్టన్‌: అమెరికా నుంచి వచ్చే పర్యాటకుల విషయంలో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త ఏడాది తొలి రోజు నుంచి చైనాకు వచ్చే అమెరికా పర్యాటకులకు  నిబంధనల్లో భారీ సడలింపులు ఇచ్చింది. రౌండ్‌ ట్రిప్‌ ఫ్లైట్‌ టికెట్లు, హోటల్‌ రిజర్వేషన్‌ ప్రూఫులు, చైనా నుంచి అందిన ఇన్విటేషన్లు తీసుకురావాల్సిన అవసరం లేదని చైనా విదేశాంగ శాఖ తెలిపింది. ఈ మేరకు వాషింగ్టన్‌లోని చైనా ఎంబసీ ఒక ప్రకటన చేసింది. 

చైనా, అమెరికా ప్రజల మధ్య సంబంధాలు మెరుగుపర్చేందుకే ఈ నిబంధనల సడలింపు నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటనలో చైనా ఎంబసీ తెలిపింది. అయితే కొవిడ్‌తో దెబ్బతిన్న పర్యాటక రంగాన్ని పునరుద్ధరించడానికే చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్‌, స్పెయిన్‌, మలేషియా దేశాల పౌరులకు 15 రోజుల పాటు దేశంలో పర్యటించేందుకుగాను వీసా ఫ్రీ ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత నెలలో చైనా ప్రకటించడం గమనార్హం. 

కొవిడ్‌కు ముందు ఏడాది 2019లో చైనాలో విదేశీ టూరిస్టుల ఎంట్రీ ఎగ్జిట్‌లు 977 మిలియన్లు నమోదవగా ఈ ఏడాది అవి 8.4 మిలియన్లకు పడిపోయాయి. చైనా పర్యాటక రంగం ఎంత దారుణంగా దెబ్బతిన్నదో ఇమిగ్రేషన్‌ డిపార్ట్‌మెంట్‌ విడుదల చేసిన ఈ గణాంకాల ద్వారా స్పష్టమవుతోంది.

ఇదీచదవండి.. ట్రంప్‌ పోరాటం వాటితోనే.. 15 నుంచి ఎన్నికల రేసు స్టార్ట్‌

 

>
మరిన్ని వార్తలు