China: చైనా వక్రబుద్ధి?.. మరో అక్రమ వంతెన నిర్మాణం

3 May, 2022 19:15 IST|Sakshi
చైనా చేపట్టిన బ్రిడ్జ్‌ నిర్మాణానికి సంబంధించిన శాటిలైట్‌ ఫోటో

చైనా తన వక్రబుద్ధిని మరో సారి ప్రదర్శించింది. భారత్‌ను ఎలాగైనా దెబ్బకొట్టేందుకు దొంగ ప్రయత్రాలు చేస్తోంది. ఇందులో భాగంగా తూర్పు లద్దాఖ్‌ సరిహద్దుల్లో వేగంగా నిర్మాణాలు చేపడుతోంది. ఈ నేపథ్యంలో పాంగాంగ్ సరస్సుపై ఖుర్నాక్ వద్ద వంతెన నిర్మాణం పూర్తి చేసింది. తాజాగా ఈ బ్రిడ్జ్‌ను దగ్గరలోని సైనిక స్థావరానికి అనుసంధానించేలా రోడ్డు నిర్మాణం చేపట్టినట్లు శాటిలైట్‌ చిత్రాలు చెబుతున్నాయి. ఖుర్నాక్ సమీపంలో గతేడాది సెప్టెంబర్ చివరి వారం నుంచి డ్రాగన్ వంతెన నిర్మాణం ప్రారంభించింది. ఇది ఏప్రిల్ తొలివారంలో పూర్తయింది. దీంతో ఖుర్నాక్ నుంచి దక్షిణ ఒడ్డుకు 180 కిలోమీటర్ల దూరం కాస్తా.. 50 కిలోమీటర్లకు తగ్గిపోయింది. 

1962 నుంచి చైనా అక్రమ ఆక్రమణలో కొనసాగుతున్న ప్రాంతాల్లో ఈ వంతెనను నిర్మించింది. ఇది వరకే ఈ వంతెన నిర్మాణంపై.. ‘భారత ప్రభుత్వం ఈ అక్రమ ఆక్రమణను ఎప్పటికీ అంగీకరించలేదు’ అని విదేశాంగ శాఖ సహాయ మంత్రి వి.మురళీధరన్ ఈ ఏడాది ప్రారంభంలో పార్లమెంటులో తెలిపారు. పాంగాంగ్‌ సరస్సు సమీపంలోని కీలక స్థానాలపై నియంత్రణ సాధించడం కోసం చైనా ఇదంతా చేస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా గత ఆగస్టు 2020 నాటి పరిస్థితి ఎదురైనప్పుడు భారత సాయుధ బలగాలు ఎదుర్కోవడానికి ముందస్తు చర్యలో భాగంగా ఈ వంతెన నిర్మాణమని చేపట్టింది. దీంతో స్పంగూర్ సరస్సు వద్దనున్న చైనా దళాలకు అత్యవసరమైనప్పుడు ఖుర్నాక్, సిరిజాప్లలోని స్థావరాల నుంచి అదనపు మద్దతును వేగంగా అందించే అవకాశం లభించింది.
చదవండి: PM Modi-PM Danish: డెన్మార్క్ ప్ర‌ధాని నివాసంలో మోదీ చర్చలు.. వీడియో వైరల్‌

మరిన్ని వార్తలు