చైనా వ్యాక్సిన్‌కు అంత సీన్‌ లేదు, అసలు విషయమిదే!

12 Apr, 2021 01:17 IST|Sakshi

మా వ్యాక్సిన్లకు సామర్థ్యం తక్కువ.. అంగీకరించిన చైనా ఉన్నతాధికారులు

బీజింగ్‌: చైనా సరుకులోని డొల్లతనం మరోసారి బట్టబయలైంది. ఆ దేశం తయారు చేసిన కోవిడ్‌–19 వ్యాక్సిన్‌లు సరిగా పని చేయడం లేదని అక్కడి ప్రభుత్వ ఉన్నతాధికారే అంగీకరించారు. అందుకే ఆ వ్యాక్సిన్‌లన్నింటినీ కలగలిపి, దాని సామర్థ్యం పెంచేలా కొత్త వ్యాక్సిన్‌ తయారు చేయడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోందని చైనా సెంటర్స్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డైరెక్టర్‌ గావూ ఫూ వెల్లడించారు. చైనాలో తయారైన వ్యాక్సిన్లకు కరోనా నుంచి అత్యధిక రక్షణ కల్పించే సామర్థ్యం లేదని గావూ విలేకరుల సమావేశంలో బాహాటంగానే వెల్లడించారు. ఇన్నాళ్లు పశ్చిమాది దేశాలు తయారు చేసిన వ్యాక్సిన్ల పనితీరుపై విషం గక్కిన చైనా, తమ దేశంలో తయారైన టీకా డోసుల్ని భారీగా వివిధ దేశాలకు ఎగుమతి చేసింది.

ఇప్పుడు ఆ దేశమే తమ దేశంలో తయారైన వ్యాక్సిన్లు సరిగ్గా పని చేయడం లేదని అంటోంది.  చైనాలో తయారైన సినోవాక్‌ వ్యాక్సిన్‌ సామర్థ్యం 50.4శాతం మాత్రమేనని బ్రెజిల్‌లో పరిశోధనల్లో ఇప్పటికే వెల్లడైంది. అదే అమెరికాలో తయారైన ఫైజర్‌ వ్యాక్సిన్‌ 97శాతం సామర్థ్యంతో పని చేస్తోంది. చైనా ఇప్పటివరకు సంప్రదాయ పద్ధతుల్లోనే వ్యాక్సిన్‌ను తయారు చేసింది. అదే పశ్చిమాది దేశాలు ఎంఆర్‌ఎన్‌ఏ అనే ఆధునిక పద్ధతిలో వ్యాక్సిన్‌ను రూపొందించాయి.

ఇదే  విధానంలో రూపొందించిన అమెరికాకు చెందిన  ఫైజర్‌ వ్యాక్సిన్‌ రక్షణ, సామర్థ్యంపై ఇన్నాళ్లూ డ్రాగన్‌ దేశం సందేహాలు లేవనెత్తింది. గావూ కూడా ఎంఆర్‌ఎన్‌ఏ విధానంలో చేసే వ్యాక్సిన్లకి దుష్ప్రభావాలు ఉంటాయని గతంలో వ్యాఖ్యానిం చారు. కానీ ఇప్పుడు రూటు మార్చుకొని ఆ పద్ధతుల్లోనే టీకా తయారు చేయాలని ప్రభుత్వానికి సలహా ఇస్తున్నారు. చైనాలో ఇప్పటివరకు 3.4 కోట్ల మంది రెండు టీకా డోసుల్ని తీసుకోగా, 6.5 కోట్ల మంది సింగిల్‌ డోసుని తీసుకున్నారు. 
(చదవండి: వెంట్రుకలపై క్రేజ్‌: చైనాకు జుట్టు అక్రమ రవాణా )

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు