20 ఏళ్ల తర్వాత అగ్నిపర్వతం బద్ధలు

23 May, 2021 12:40 IST|Sakshi

కిన్షాసా: కాంగోలోని ఇరగోంగో అగ్నిపర్వం దాదాపు రెండు దశాబ్దాల తర్వాత బద్దలైంది. అగ్ని పర్వతం విస్ఫోటనంతో లావా పైకి ఉప్పొంగుతోంది. దీంతో ఆకాశమంతా ఎరుపురంగులోకి మారింది. లావా ధారలుగా ప్రవహిస్తూ గోమా నగరంలోని ప్రధాన రహదారులపైకి చేరడంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురయ్యారు. దాదాపు రెండు మిలియన్ల మంది గోమా నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్తున్నారు. అయితే, ఇప్పటి వరకు ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదని అధికార వర్గాలు తెలిపాయి.1977 లో నైరాగోంగో పర్వతం విస్ఫోటనం వల్ల సుమారు 2 వేల మంది మరణించారు. అలాగే 2002లో విస్పోటనం చెందగా.. తప్పించుకునే దారిలేక వందలాది మంది మృతి చెందారు. లక్ష మందికిపైగా ప్రజలు నిరాశ్రయులయ్యారు. 

శనివారం రాత్రి మరోసారి అగ్నిపర్వతం బద్దలవడంతో ప్రజలంతా ఆందోళనకు గురవుతున్నారు. అయితే అగ్నిపర్వతం పేలుడుతో వెంటనే అప్రమత్తమైన ప్రభుత్వం సహాయక చర్యలు ప్రారంభించింది. కాగా యూరప్‌ పర్యటనలో ఉన్న కాంగో అధ్యక్షుడు ఫెలిక్స్‌ టిసెకెడి ఆదివారం స్వదేశానికి రానున్నట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు సుమారు మూడువేల మంది ప్రజలు కాంగోను విడిచి వెళ్లినట్లు రువాండా ఇమ్మిగ్రేషన్‌ అధికారులు పేర్కొన్నారు. కొందరు కివు సరస్సు పడవల్లో ఆశ్రయం పొందగా.. మరికొందరు మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని ఎత్తయిన పర్వత ప్రాంతానికి చేరుకున్నారు.

ఇక ఈ ఘటనపై ఐక్యరాజ్య సమితి శాంతి భద్రత బృందం స్పందించింది. లావా గోమా నగరం వైపు వెళ్లడం లేదని, ప్రస్తుతం తాము అప్రమత్తంగానే ఉన్నట్లు పేర్కొంది. కాగా అగ్నిపర్వత విస్ఫోటనం గురించి సకాలంలో తెలియజేయకపోవడంతో ప్రజల్లో అయోమయం నెలకొంది. అధికారులు సకాలంలో స్పందిచకపోవడం, సోషల్‌ మీడియాలో రకరకాల వార్తలు ప్రచారం కావడంతో ప్రజల్లో గందరగోళం పెంచింది.
 

(చదవండి: హఠాత్తుగా మారిన వాతావరణం: చైనాలో పెనువిషాదం

మరిన్ని వార్తలు