రష్యా వ్యాక్సిన్ ట్రయల్స్ కు గ్రీన్ సిగ్నల్

17 Oct, 2020 17:53 IST|Sakshi

స్పుత్నిక్ -వీ  3వ దశ క్లినికల్  ట్రయల్స్ డా.రెడ్డీస్ కు అనుమతి

సాక్షి, న్యూఢిల్లీ:  కరోనా  మహమ్మారి అంతానికి రష్యా అభివృద్ది చేసిన స్పుత్నిక్-వి వ్యాక్సిన్ 3వ దశ క్లినికల్ ట్రయల్స్ కు మన దేశంలో అనుమతి లభించింది. హైదరాబాద్‌కు చెందిన ఫార్మా దిగ్గజం డాక్టర్ రెడ్డిస్ లాబొరేటరీస్, రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఫండ్ (ఆర్‌డిఐఎఫ్)లకు డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) అనుమతినిచ్చింది. తాజా అనుమతి మేరకు భారతదేశంలో స్పుత్నిక్ వి వ్యాక్సిన్  ట్రయల్స్ నిర్వహించ నున్నామని ఇరు సంస్థలు శనివారం ప్రకటించాయి. (రెండో వాక్సిన్ : పుతిన్ కీలక ప్రకటన)

2020 సెప్టెంబరులో, డాక్టర్ రెడ్డీస్, ఆర్‌ఈఐఎఫ్ స్పుత్నిక్ వి వ్యాక్సిన్ ని భారతదేశంలో పంపిణీ చేసేందుకు ఒక ఎంఓయూ కుదుర్చుకున్న సంగతి  తెలిసిందే. ఇందులో భాగంగా, భారతదేశంలో రెగ్యులేటరీ ఆమోదం పొందిన తరువాత డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ కి 100 మిలియన్ మోతాదుల వ్యాక్సిన్‌ను సరఫరా చేయనుంది. మొదట భారత్ లో 3వ దశ ట్రయల్ మాత్రమే నిర్వహించాలని అనుకున్నా సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సిడిఎస్కో) నిపుణుల కమిటీ (ఎస్ఇసి) ఆదేశాల మేరకు వరుసగా 2,3 దశల క్లినికల్ ట్రయల్ నిర్వహిచనుంది. 1500 మందితో అడాప్టివ్ ఫేజ్ 2,3 హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ నిర్వహణకు సన్నద్ధమవుతున్నామని టీకాను విదేశాలలో మార్కెటింగ్ చేస్తున్న ఆర్‌డిఐఎఫ్ తెలిపింది.

సురక్షిత, సమర్థవంతమైన వ్యాక్సిన్ తీసుకువచ్చేందుకు కట్టుబడిఉన్నామని డాక్టర్ రెడ్డీస్కో-చైర్మన్, ఎండీ జీవీ ప్రసాద్ తెలిపారు. డీసీజీఐ సానుకూల సహకారం  సంతోషానిచ్చిందని ఆర్‌డిఐఎఫ్ సీఈఓ కిరిల్ డిమిత్రివ్ పేర్కొన్నారు. భారతీయ క్లినికల్ ట్రయల్ డేటాతో పాటు, రష్యాలోమూడో దశ క్లినికల్ ట్రయల్ డేటా, వ్యాక్సిన్‌ భద్రత, రోగనిరోధకతపై విదేశాల్లో నిర్వహించిన అధ్యయనాలను కూడా అందిస్తామన్నారు. కాగా రష్యాకు చెందిన స్పుత్నిక్‌-వి కొవిడ్‌-19 వ్యాక్సిన్‌పై భారత్‌లో భారీ స్థాయిలో ట్రయల్స్‌ నిర్వహించాలనుకున్న డాక్టర్‌ రెడ్డీస్‌కు అనుతిమిని నిరాకరించిన సంగతి తెలిసిందే.

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు