అమెరికాలో భారతీయ వైద్య విద్యార్థిపై కాల్పులు, మృతి

23 Nov, 2023 19:16 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికాలో మరో  భారతీయ విద్యార్థి దుండగుడి  కాల్పులకు బలైపోయాడు.  నార్త్‌ ఇండియాకు  చెందిన వైద్య విద్యార్థి  ఆదిత్య అద్లాఖా కారులో ఉండగానే కాల్పులు జరిపారు. ఈ సంఘటన నవంబర్ 9న జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆదిత్య ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల తరువాత తుదిశ్వాస విడిచాడు. యూనివర్శిటీ ఆఫ్ సిన్సినాటి  మెడికల్‌ సెంటర్‌ ఒక ప్రకటన విడుదల చేసింది.  ఆదిత్య మరణంపై  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. 

ఆదిత్య అద్లాఖా యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటి మెడికల్ స్కూల్‌లో మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీ ప్రోగ్రామ్‌లో నాల్గవ సంవత్సరం డాక్టరల్ విద్యార్థి.  వెస్ట్రన్ హిల్స్ ప్రాంతంలో కారు డ్రైవ్‌ చేస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. దీంతో అదుపుతప్పిన కారు ఒక గొడను ఢీకొట్టింది.  దీంతో అద్లాఖా పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే అతడిని యూసీ మెడికల్ సెంటర్‌కు తరలించినా ఫలితం లేకపోయింది. రెండు రోజుల తర్వాత మరణించినట్లు హామిల్టన్ కౌంటీ కరోనర్ కార్యాలయం ధృవీకరించింది.  ఆదిత్య నడిపిన కారు, అద్దాలకు బుల్లెట్‌ రంధ్రాలను గుర్తించామని విచారణ అధికారులు తెలిపారు. ఈ కేసులో ఇంతవరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదు.

యూనివర్శీటీ సీనియర్లతోపాటు ఆరోగ్య వ్యవహారాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్, డీన్ ఆండ్రూ ఫిలక్‌ అద్లాఖా ఆకస్మిక మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. న్యూరోఇమ్యూన్ కమ్యూనికేషన్‌లో అద్లాఖా అద్భుతమైన పరిశోధన చేశారని  గుర్తు చేసుకున్నారు.

కాగా ఆదిత్య 2018లో ఢిల్లీ యూనివర్సిటీ పరిధిలోని రాంజాస్ కాలేజీలో బ్యాచిలర్ డిగ్రీ చదివాడు. 2020లో ఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్‌) నుంచి ఫిజియాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేశాడు. ఆ తరువాత మాలిక్యులర్ అండ్ డెవలప్‌మెంటల్ బయాలజీలో పీహెచ్‌డీ కోసం అమెరికా వెళ్లాడు.

మరిన్ని వార్తలు