పన్నూ హత్య ‘కుట్ర’ భగ్నం? అమెరికా కథనాలపై భారత్‌ స్పందన ఇది

23 Nov, 2023 11:33 IST|Sakshi

ఖలిస్థానీ వేర్పాటువాది, నిషేధిత సిఖ్స్‌ ఫర్‌ జస్టిస్‌ సంస్థ నేత గురుపత్వంత్‌ సింగ్‌ పన్నూ హత్యకు కుట్ర జరిగిందన్న ఓ కథనం అంతర్జాతీయంగా చర్చనీయాంశంగా మారింది. అయితే ఆ కుట్రను తాము భగ్నం చేశామని, పైగా ఈ విషయాన్ని భారత్‌ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు అమెరికా ప్రకటించడంతో మరింత దుమారం రేపింది. 

అమెరికా గడ్డపై గురుపత్వంత్‌ సింగ్ పన్నూను చంపేందుకు చేసిన ప్రయత్నాలను.. తాము భగ్నం చేశామని అక్కడి అధికారులు వెల్లడించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్‌ కథనం ప్రచురించింది. అందులో సారాంశం..

‘‘ఈ అంశాన్ని మేం తీవ్రంగా పరిగణించాం. అంతేకాదు.. భారత ప్రభుత్వానికి చెందిన ఉన్నతస్థాయి అధికారుల వద్ద దీనిని ప్రస్తావించాం. ఈ విషయం వినగానే భారత అధికారులు ఆశ్చర్యంతో పాటు ఆందోళన వ్యక్తం చేశారు. దీనిపై ఢిల్లీ వర్గాలు తదుపరి దర్యాప్తు చేస్తాయని మాకు అర్థమైంది. రాబోయే రోజుల్లో దీని గురించి మరింత సమాచారం బయటకు వస్తుంది. ఈ కుట్రకు బాధ్యులైన వారికి శిక్ష పడాలని మేం భావిస్తున్నాం’’ అని అమెరికా జాతీయ భద్రతా మండలి అధికార ప్రతినిధి ఆండ్రీన్‌ వాట్సన్‌ పేరిట కథనం ప్రచురితమైంది.

ఇదీ చదవండి: గురుపత్వంత్ సింగ్ పన్నూ ఎవరో తెలుసా?

మరోవైపు ఈ కథనంపై ఆందోళన వ్యక్తం చేసిన భారత విదేశాంగశాఖ.. అమెరికా ఇచ్చిన సమాచారాన్ని తాము పరిశీలిస్తున్నట్లు తెలిపింది. భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అరీందమ్‌ బాగ్చి మాట్లాడుతూ.. భారత్‌-అమెరికా భద్రతా సహకారంపై ఇరు దేశాల మధ్య ఇటీవల కొన్ని చర్చలు జరిగాయి. వీటిలో భాగంగా వ్యవస్థీకృత నేరగాళ్లు, ఉగ్రవాదులు, వారి మధ్య బంధాలు, తదితర అంశాల గురించి అమెరికా అధికారులు కొంత సమాచారమిచ్చారు. ఆ సమాచార తీవ్రతను భారత్‌ గుర్తించింది. అది రెండు దేశాల భద్రతా ప్రయోజనాలకు ఆందోళనకరం. అమెరికా పంచుకున్న ఆ సమాచారాన్ని సంబంధిత శాఖలు పరిశీలిస్తున్నాయి’’ అని అన్నారు. 

మరోవైపు పన్నూ హత్యకు జరిగిన కుట్రకు సంబంధించి అమెరికా నిఘా దర్యాప్తు సంస్థ ఎఫ్‌బీఐ దర్యాప్తు చేస్తోందట. అయితే, ఈ కుట్ర గురించి అమెరికాకు ఎలా తెలిసింది? కుట్రను ఎలా భగ్నం చేశారన్న వివరాలను మాత్రం సదరు వర్గాలు బయటపెట్టలేదు. 

ఇదీ చదవండి: గురపత్వంత్‌కు భారత్‌ దెబ్బ.. అదుర్స్‌

మరిన్ని వార్తలు