Israel Hamas War: ఆ యుద్ధంతో భారత్‌కు నష్టం ఏమిటి?

31 Oct, 2023 07:43 IST|Sakshi

ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంతో భారతదేశానికి ఎటువంటి సంబంధం లేదు. అయితే యుద్ధం చాలా కాలం పాటు కొనసాగితే దాని ఫలితాలు భారత్‌పై పడే అవకాశాలున్నాయి. వాస్తవానికి, ప్రస్తుతం ప్రపంచంలోని ప్రతి దేశం ఏదో ఒక దేశంతో అనుసంధానమై ఉంది. అటువంటి పరిస్థితిలో ఒక దేశం ఇబ్బందుల్లో పడితే అది ఇతర దేశాలపై ప్రభావం చూపుతుంది. అయితే భారతదేశ పరిస్థితి కొద్దిగా భిన్నంగా ఉంది. ఎందుకంటే ఇజ్రాయెల్‌తో భారత్‌ సంబంధాలు ఇతర దేశాల కంటే మెరుగ్గా ఉన్నాయి. ఈ రెండు దేశాల మధ్య వ్యాపార సంబంధాలు బలంగా ఉన్నాయి. అందుకే ఇప్పుడున్న పరిస్థితిలో ఇజ్రాయెల్‌- హమాస్‌ యుద్ధం త్వరగా ముగియకపోతే భారత్‌కు ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయి. 

యుద్ధం ఇలానే కొంతకాలం కొనసాగితే భారతదేశం భారీ ఆర్థిక నష్టాన్ని చవిచూడవలసి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ముందుగా భారతదేశ దిగుమతి-ఎగుమతులు ప్రభావితమవుతాయి. ఫలితంగా దేశంలో ద్రవ్యోల్బణంపై ఒత్తిడి పెరిగే అవకాశాలున్నాయి. ఇప్పటికే ముడి చమురు ఉత్పత్తి తగ్గుతోంది. అటువంటి పరిస్థితిలో ఈ యుద్ధం కారణంగా రాబోయే రోజుల్లో ముడి చమురు ధరలు రాకెట్ వేగంతో పెరిగే అవకాశం ఉంది. 

ఆసియాలో ఇజ్రాయెల్‌కు భారతదేశం మూడవ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఇజ్రాయెల్‌ కంపెనీలు భారత్‌లో పెట్టుబడులు పెట్టాయి. భారతదేశ ఎగుమతుల్లో ఇజ్రాయెల్ వాటా 1.8%. ఇజ్రాయెల్ భారతదేశం నుండి 5.5 నుండి 6 బిలియన్ డాలర్ల విలువైన శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులను కొనుగోలు చేస్తుంది. ఇజ్రాయెల్ భారతదేశం నుండి శుద్ధి చేసిన పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఆభరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇంజినీరింగ్ సంబంధిత ఉత్పత్తులను దిగుమతి చేసుకుంటుంది. పలు భారతీయ కంపెనీలు ఇజ్రాయెల్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ప్రస్తుతం అంతగా ప్రభావం కనిపించనప్పటికీ యుద్ధం త్వరగా ముగియకపోతే నష్టాల గణాంకాలు కనిపించనున్నాయి. 

ఇజ్రాయెల్‌తో పాటు భారత్‌కు పాలస్తీనాతో కూడా వాణిజ్య సంబంధాలు ఉన్నాయి. భారతదేశం-పాలస్తీనా మధ్య వాణిజ్యం ఇజ్రాయెల్ ద్వారా జరుగుతుంది. 2020లో భారత్-పాలస్తీనా వాణిజ్య పరిమాణం సుమారు $67.77 మిలియన్లు. భారతదేశం నుండి మార్బుల్, గ్రానైట్, సిమెంట్, బాస్మతి బియ్యం, వైద్య, శస్త్రచికిత్స పరికరాలు మొదలైనవి పాలస్తీనాకు ఎగుమతి అవుతాయి. ఇదే సమయంలో భారతదేశం తాజా, ఎండిన ఖర్జూరాలు, లోహాలతో తయారైన వస్తువులను పాలస్తీనా నుంచి దిగుమతి చేసుకుంటుంది. యుద్ధం తీవ్రతరం అయితే పాలస్తీనాతో భారతదేశ దిగుమతి, ఎగుమతులు ప్రభావితం కానున్నాయి. అందుకే భారత్‌ ఈ యుద్ధం త్వరగా ముగియాలని కోరుకుంటోంది.
ఇది కూడా చదవండి: దేశంలో అత్యల్ప అక్షరాశ్యత గల జిల్లా ఏది?

మరిన్ని వార్తలు