Major Rail Accidents: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే..

16 Nov, 2023 09:38 IST|Sakshi

ఇటీవలి కాలంలో వరుసగా జరుగుతున్న రైలు ‍ప్రమాదాలు అందరినీ ఆందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా న్యూఢిల్లీ-దర్భంగా ఎక్స్‌ప్రెస్ రైలులో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రైలులో మంటలు చెలరేగి, మూడు బోగీలు దగ్ధమయ్యాయి. యూపీలోని ఇట్టావా స్టేషన్‌ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఎటువంటి ప్రాణహాని జరగలేదని అధికారులు తెలియజేశారు. కాగా గడచిన పదేళ్లలో పలు రైలు ప్రమాదాలు చోటుచేసుకోగా, వందలమంది ప్రాణాలు కోల్పోయారు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం! 

2012: మే 22న ఆంధ్రప్రదేశ్‌లో హంపి ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురయ్యింది. ఈ ఘటనలో గూడ్స్ రైలు, హుబ్లీ-బెంగళూరు హంపి ఎక్స్‌ప్రెస్ ఢీకొన్నాయి. రైలులోని నాలుగు బోగీలు పట్టాలు తప్పడంతోపాటు, ఒక బోగీలో మంటలు చెలరేగడంతో దాదాపు 25 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు.

2014: మే 26న ఉత్తరప్రదేశ్‌లోని సంత్ కబీర్ నగర్‌లోని ఖలీలాబాద్ స్టేషన్ సమీపంలో ఆగి ఉన్న గూడ్స్ రైలును గోరఖ్‌పూర్ వైపు వెళ్తున్న గోరఖ్‌ధామ్ ఎక్స్‌ప్రెస్ ఢీకొంది. ఈ ప్రమాదంలో 25 మంది మృతి చెందారు. 50 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

2016: నవంబర్ 20న ఇండోర్-పాట్నా ఎక్స్‌ప్రెస్ కాన్పూర్‌లోని పుఖ్రాయాన్ సమీపంలో పట్టాలు తప్పడంతో, 150 మంది ప్రయాణికులు మృతి చెందారు. 150 మందికి పైగా  ప్రయాణికులు గాయపడ్డారు.

2017: ఆగస్టు 23న ఉత్తరప్రదేశ్‌లోని ఔరైయా సమీపంలో ఢిల్లీకి వెళ్లే కైఫియత్ ఎక్స్‌ప్రెస్‌కు చెందిన తొమ్మిది కోచ్‌లు పట్టాలు తప్పడంతో 70 మంది గాయపడ్డారు.

2017: ఆగస్ట్ 18న పూరీ-హరిద్వార్ ఉత్కల్ ఎక్స్‌ప్రెస్ ముజఫర్‌నగర్‌లో పట్టాలు తప్పడంతో 23 మంది మృతి చెందారు. 60 మందికిపైగా ప్రయాణికులు గాయపడ్డారు.

2022: జనవరి 13న పశ్చిమ బెంగాల్‌లోని అలీపుర్‌దువార్ ప్రాంతంలో బికనీర్-గౌహతి ఎక్స్‌ప్రెస్‌కు చెందిన 12 కోచ్‌లు పట్టాలు తప్పడంతో తొమ్మిది మంది మరణించారు. 36 మంది గాయపడ్డారు.

2023: జూన్ 2న ఒడిశాలో బెంగళూరు-హౌరా సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్, షాలిమార్-చెన్నై సెంట్రల్ కోరమాండల్ ఎక్స్‌ప్రెస్‌, గూడ్స్ రైలు ఢీకొన్న ఘటనలో 291 మంది మృతి చెందారు. 1,1000 మందికి పైగా ప్రయాణికులు గాయపడ్డారు.

ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదాలివే..

మరిన్ని వార్తలు