'లొంగిపోవడం లేదా చావడం'.. హమాస్‌కు నెతన్యాహు అల్టిమేటం

22 Dec, 2023 09:25 IST|Sakshi

టెల్ అవీవ్: గాజాపై ఇజ్రాయెల్ సేనలు విరుచుకుపడుతున్నాయి. హమాస్‌ను అంతం చేయడమే ధ్యేయంగా ముందుకు కదులుతున్నాయి. కాల్పుల విరమణకు  అంగీకరించడం లేదు. బందీల విడుదలపై ఇంకా ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు. హమాస్ ఉగ్రవాదులకు లొంగిపోవడం లేదా చనిపోవడం మాత్రమే దారి ఉందని హెచ్చరికలు జారీ చేశారు. హమాస్‌ను అంతం చేయడానికి వారు తలదాచుకున్న సొరంగాలను సముద్ర నీటితో నింపుతున్న విషయం తెలిసిందే.

యుద్ధంలో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమెన్ నెతన్యాహు ఇప్పటికే స్పష్టం చేశారు. హమాస్‌ను అంతం చేసిన తర్వాతే కాల్పుల విరమణ ఉంటుందని తెలిపారు. బందీలను సురక్షితంగా పరిరక్షిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇజ్రాయెల్‌కు గాజా నుంచి ఎప్పటికీ ముప్పు లేకుండా అయ్యే వరకు పోరాటం సాగుతుందని చెప్పారు. 

ఇజ్రాయెల్-హమాస్ మధ్య ఇటీవల కాల్పుల విరమణ వారంపాటు కొనసాగింది. ఈ క్రమంలో హమాస్ 105 మంది ఇజ్రాయెలీ బందీలను విడుదల చేసింది. ఇజ్రాయెల్ కూడా 240 మంది పాలస్తీనా బందీలను బయటకు వదిలివేసింది. ఇరుపక్షాల మధ్య కాల్పుల విరమణ శాశ్వతంగా కొనసాగుతుందని ప్రపంచ దేశాలు అభ్యర్థించాయి. కానీ పరిస్థితి మళ్లీ మొదటికి వచ్చింది. 

అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి చేసింది. ఆకస్మిక దాడి నుంచి తేరుకున్న ఇజ్రాయెల్ ప్రతిదాడిని ప్రారంభించింది. అధునాతన ఆయుధాలతో గాజాపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ సైన్యం గాజాలో కొంత భాగాన్ని ఆక్రమించింది. హమాస్ వైపు దాదాపు 18వేల పైగా మంది మరణించారు. ఇజ్రాయెల్ వైపు 1100 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చదవండి: చెక్‌ రిపబ్లిక్‌లో కాల్పులు.. 15 మంది మృతి

>
మరిన్ని వార్తలు