Goa Liberation Day: గోవా విముక్తికి భారత్‌ ఏం చేసింది?

19 Dec, 2023 08:34 IST|Sakshi

మన దేశంలో గోవా విమోచన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 19న నిర్వహిస్తుంటారు. దేశంలోని అందమైన బీచ్‌లు కలిగిన రాష్ట్రం గోవా. నైట్‌ లైఫ్‌కు గోవా ప్రసిద్ధి చెందింది. భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా, అనేక రాచరిక రాష్ట్రాలు  విదేశీ శక్తుల చేతుల్లో ఉండేవి. ఇటువంటి రాష్ట్రాల్లో గోవా ఒకటి.

భారతదేశానికి 1947, ఆగస్టు 15న స్వాతంత్ర్యం లభించింది. అయితే గోవా రాష్ట్రం అప్పటికి పోర్చుగీసు ఆధీనంలో ఉంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన 14 సంవత్సరాల తర్వాత 1961 డిసెంబర్ 19న గోవా భారతదేశంలో చేరింది. నాటి నుండి ప్రతి సంవత్సరం డిసెంబర్ 19ని గోవా విమోచన దినంగా జరుపుకుంటున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నాటి ప్రభుత్వం, ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ.. గోవా స్వాతంత్ర్యం కోసం అనేక సార్లు చర్చలు జరిపారు. అయితే పోర్చుగీస్.. గోవాకు విముక్తి కల్పించేందుకు ఏమాత్రం అంగీకరించలేదు.

పోర్చుగీస్‌తో చర్చలు విఫలమైన తరువాత భారత ప్రభుత్వం గోవా స్వాతంత్ర్యం కోసం ‘ఆపరేషన్ విజయ్’ ప్రారంభించింది. గోవాకు విముక్తి కల్పించేందుకు 30 వేల మంది సైనికులతో కూడిన బృందాన్ని భారత్‌ యుద్ధరంగంలోకి దించింది. మూడు వేలమంది పోర్చుగీస్ సైనికులపై భారత వైమానిక దళం, నేవీ, ఆర్మీ దాడి చేశాయి. ఈ దాడి కేవలం 36 గంటలపాటు కొనసాగింది. దీంతో పోర్చుగీస్ బేషరతుగా గోవాపై నియంత్రణను వదులుకోవాలని నిర్ణయించుకుంది.

ఈ దాడి తరువాత గోవా.. భారతదేశంలో చేరి కేంద్రపాలిత ప్రాంతంగా మారింది. అయితే 1987, మే 30న గోవాకు భారత్‌ పూర్తి రాష్ట్ర స్థాయి హోదాను కల్పించింది. నాటి నుండి ప్రతీ ఏటా మే 30ని గోవా వ్యవస్థాపక దినోత్సవంగా జరుపుకుంటున్నారు. 

>
మరిన్ని వార్తలు