పాకిస్తాన్‌పై పీఓకే కన్నెర్ర

18 Sep, 2023 06:16 IST|Sakshi
పీవోకేలో స్థానికుల బైక్‌ ర్యాలీ

చుక్కలనంటుతున్న కరెంటు బిల్లులపై జనం ఆగ్రహ జ్వాలలు 

కోట్లి (పీఓకే):  పాకిస్తాన్‌పై పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే) వాసులు కన్నెర్రజేస్తున్నారు. దశాబ్దాలుగా పాక్‌ తమపై సవతి తల్లి ప్రేమ చూపుతోందంటూ మండిపడుతున్నారు. చివరికి కరెంటు బిల్లుల మదింపులో కూడా ఈ వివక్ష భరించలేనంత ఎక్కువగా ఉందంటూ వాపోతున్నారు. ‘మా ప్రాంతం నుంచే ఏకంగా 5,000 మెగావాట్ల కరెంటు ఉత్పత్తి అవుతోంది. దాన్నంతటినీ తరలించుకుపోయి దేశమంతటికీ వాడుకుంటున్నారు.

బిల్లుల విషయానికి వచ్చేసరికి ప్రధాన భూభాగంలో వారికి తక్కువగా, మాకు భరించలేనంత ఎక్కువగా వేస్తున్నారు. ఇది మా పట్ల సహించరాని అన్యాయం‘ అంటూ ఆక్రోశిస్తున్నారు. అది కాస్తా కొద్ది రోజులుగా ఆగ్రహంగా మారి కట్టలు తెంచుకుంటోంది. భారీ కరెంటు బిల్లులకు వ్యతిరేకంగా జనం నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.  ఒక్క కోట్లి జిల్లాలోనే కేవలం ఒక్క నెలలో  రూ.139 కోట్ల బిల్లులు వచ్చాయని ప్రముఖ స్థానిక నేత తౌకీర్‌ వాపోయారు. ‘అందులో  కేవలం రూ.19 కోట్ల బిల్లులు కట్టారు. వచ్చే నెల నుంచి అవి కూడా కట్టేది లేదు‘ అని అన్నారు. తమకు దశాబ్దాలుగా అన్యాయం జరుగుతోందని ఆరోపించారు.
 

మరిన్ని వార్తలు