Pakistan Earthquake Prediction: పాకిస్తాన్‌కు భారీ భూకంపం ముప్పు?

3 Oct, 2023 12:50 IST|Sakshi

పాక్‌లో భారీ భూకంపానికి సంబంధించిన అంచనాలు వెలువడిన నేపధ్యంలో పాకిస్తాన్ ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నెదర్లాండ్స్‌కు చెందిన ఒక పరిశోధనా సంస్థ నుండి వచ్చిన సోషల్ మీడియా పోస్ట్ పాకిస్తాన్‌లో రాబోయే 48 గంటల్లో సంభవించే విధ్వంసక భూకంపానికి సంబంధించిన అంచనాను వెల్లడించింది.

ఈ వార్త విన్నప్పటి నుంచి పాక్‌ పౌరులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. సోలార్ సిస్టమ్ జామెట్రీ సర్వే (ఎస్‌ఎస్‌జీఈఓఎస్‌)కు చెందిన ఒక పరిశోధకుడు.. పాకిస్తాన్, దాని చుట్టుపక్కల ప్రాంతాలలో బలమైన వాతావరణ హెచ్చుతగ్గులు గమనించామని, ఇది రాబోయే బలమైన భూకంపాన్ని సూచిస్తుందని పేర్కొన్నారు. 

ఈ వార్త దేశంలో దావానలంలా వ్యాపించింది. రానున్న 48 గంటల్లో దేశంలో పెను భూకంపం వచ్చే అవకాశం ఉందంటూ వాట్సాప్‌ గ్రూపుల ద్వారా ప్రచారం జరుగుతోంది. డచ్ శాస్త్రవేత్త ఫ్రాంక్ హూగర్‌బీట్స్‌ ఈ విషయాన్ని తెలియజేశారంటూ ప్రచారం జరుగుతోంది. అతను గతంలో టర్కీ, సిరియాలో ప్రమాదకరమైన భూకంపాలను అంచనా వేయడానికి గ్రహాల అమరికను అధ్యయనం చేశారు. మరో 48 గంటల్లో పాకిస్థాన్‌లో బలమైన భూకంపం వస్తుందని ఈ శాస్త్రవేత్త అంచనా వేసినట్లు ఈ పోస్ట్‌లో పేర్కొన్నారు. ఈ నేపధ్యంలో పాక్‌ ప్రజలు భయాందోళనలకు లోనవుతున్నారు. ప్రాణాలను దక్కించుకునేందుకు ఏం చేయాలంటూ అధికారుల సలహాలు తీసుకుంటున్నారు.
ఇది కూడా చూడండి: అతి చిన్న స్వయం ప్రకటిత దేశం ఏది? జనాభా ఎంత?
 

మరిన్ని వార్తలు