Europe: యూరప్‌ దేశాలను వణికిస్తున్న పారెట్‌ ఫీవర్‌

6 Mar, 2024 07:33 IST|Sakshi

యూరప్‌లోని అనేక దేశాల్లో పారెట్‌ ఫీవర్‌ విజృంభిస్తోంది. ఈ వ్యాధి కారణంగా ఇప్పటివరకూ ఐదుగురు మృతి చెందారు. పారెట్‌ ఫీవర్‌ను సిటాకోసిస్ అని కూడా అంటారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ పారెట్‌ ఫీవర్‌ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే హెచ్చరించింది.

యూరప్‌ దేశాల్లో నివసించే వారిపై పారెట్‌ ఫీవర్‌ తీవ్ర ప్రభావం చూపుతోంది. 2023 ప్రారంభంలో విధ్వంసం సృష్టించిన ఈ వ్యాధి.. ఇప్పుడు 2024 ప్రారంభంలో ఐదుగురి ప్రాణాలను బలిగొంది. గత ఏడాది ఆస్ట్రియాలో 14 పారెట్‌ ఫీవర్‌ కేసులు నమోదయ్యాయి. తాజాగా మరో నాలుగు కేసులు నమోదయ్యాయి. ఫిబ్రవరి 27 నాటికి డెన్మార్క్‌లో ఈ అంటువ్యాధికి సంబంధించిన 23 కేసులు నిర్ధారితమయ్యాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

డెన్మార్క్‌లో ఒక వ్యక్తిలో  ఈ వ్యాధి కనిపించింది. ఈ ఏడాది ఇప్పటికే జర్మనీలో ఐదు కేసులు నమోదయ్యాయి. యూఎస్‌ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపిన వివరాల ప్రకారం పెంపుడు జంతువులు లేదా అడవి పక్షులతో  అనుబంధం కలిగిన వారే అధికంగా ఈ వ్యాధి బారి పడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. పారెట్‌ ఫీవర్‌ అనేది క్లామిడియా ఇన్ఫెక్షన్ కారణంగా వస్తుంది. ఇది వివిధ రకాల అడవి జంతువులు, పెంపుడు పక్షులు, కోళ్లలో కనిపిస్తుంది. ఈ వ్యాధి సోకిన పక్షులు అనారోగ్యంగా కనిపించకపోవచ్చు. కానీ అవి శ్వాస లేదా మలవిసర్జన చేసినప్పుడు బ్యాక్టీరియాను విడుదల చేస్తాయి. ఇదే వ్యాధి వ్యాప్తి చెందడానికి కారణమని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలోనే రెండవ చిన్న ఖండమైన యూరప్‌లో 50 వరకూ సర్వసత్తాక దేశాలు ఉన్నాయి. 

whatsapp channel

మరిన్ని వార్తలు