కరోనా సోకితే 8 నెలలు సేఫ్‌?

24 Dec, 2020 08:09 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఒకసారి కరోనా బారిన పడ్డవారికి కనీసం 8 నెలలపాటు ఆ వైరస్‌ నుంచి రక్షణ లభిస్తుందని ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కరోనా నియంత్రణకు అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్ల ద్వారా ఎక్కువ కాలం రక్షణ లభించే అవకాశముందని తమ పరిశోధన ద్వారా తెలుస్తోందని ఆస్ట్రేలియా లోని మొనాష్‌ యూనివర్సిటీ శాస్త్రవేత్త మెమో వాన్‌ జెల్మ్‌ తెలిపారు. సైన్స్‌ ఇమ్యూనాలజీ జర్నల్‌లో ప్రచురితమైన వివరాల ప్రకారం.. కరోనా బారినపడ్డవారిలో రోగ నిరోధక వ్యవస్థకు చెం దిన మెమరీ బీ–సెల్స్‌ను గుర్తించారు. (చదవండి: వందేళ్ల తర్వాత సేమ్‌ సీన్‌ రిపీట్‌..!)

ఈ కణాలు వ్యాధి, వైరస్‌ రెండింటినీ గుర్తుంచుకుంటాయి. ఒకవేళ మళ్లీ వైరస్‌ దాడి చేస్తే ఈ కణాలు రోగనిరోధక వ్యవస్థను చైతన్యపరిచి యాంటీ బాడీలు వేగంగా ఉత్పత్తి అయ్యేలా చేస్తాయి. పరిశోధనల్లో భాగంగా 25 మంది కరోనా సోకిన వారిని ఎంపిక చేశామని, వ్యాధికి గురైన నాలుగో రోజు నుంచి 242వ రోజు వరకు పరిశీలించామని వాన్‌ జెల్మ్‌ తెలిపారు. వైరస్‌ నిరోధానికి ఉపయోగపడే యాంటీబాడీలు 20వ రోజు నుంచి తగ్గిపోవడం మొదలైందని, కాకపోతే మెమరీ బీ– సెల్స్‌ చివరి రోజు వరకు కొనసాగాయని పేర్కొన్నారు. ఈ మెమరీ సెల్స్‌ వైరస్‌ కొమ్ము, న్యూక్లియో ప్లాస్టిడ్‌ ప్రొటీన్‌ రెండింటినీ గుర్తించగలదన్నారు.  (చదవండి: ముంబై, కర్ణాటకల్లో రాత్రి కర్ఫ్యూ)

మరిన్ని వార్తలు