రష్యాలో సైన్యంపై పుతిన్‌ సన్నిహితుడి తిరుగుబాటు.. పాతిక వేలమంది చావడానికి రెడీ!

24 Jun, 2023 10:43 IST|Sakshi

పుతిన్‌ సన్నిహితుడిపై సాయుధ తిరుగుబాటు ఆరోపణలు

వాగ్నర్ చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్ అరెస్ట్‌కు ఆదేశాలు 

మిలిటరీపై ప్రిగోజిన్‌ ఎదురుదాడి ప్రకటన 

మాస్కోలో తీవ్రవాద వ్యతిరేక ఆపరేషన్ పాలన విధింపు 

హాట్‌ డాగ్స్‌ అమ్ముకునే స్టేజ్‌ నుంచి.. ఎదురుతిరిగేదాకా.. ప్రిగోజిన్‌ ప్రస్థానం

మాస్కో: రష్యాలో తిరుగుబాటు జెండా ఎగిరింది. కిరాయి సైన్యం గ్రూప్‌ వాగ్నర్ చీఫ్‌ యెవ్జెనీ ప్రిగోజిన్ అరెస్ట్‌కు ఆదేశాలు జారీ చేశాయి. క్రెమ్లిన్ ఆయనపై సాయుధ తిరుగుబాటు ఆరోపణలు చేయడం గమనార్హం. ఈ పరిణామంతో చిర్రెత్తిపోయిన ప్రిగోజిన్.. రష్యా సైన్యంపై ప్రతిదాడికి ఆదేశాలిచ్చాడు. అంతేకాదు రష్యాలో వినాశనం తప్పదంటూ హెచ్చరికలు జారీ చేశారు. 

మా సైన్యం పాతికవేల మంది. అంతా చావడానికి సిద్ధంగా ఉన్నాం. రష్యా కోసం ఏమైనా చేస్తాం.  మేమింకా ముందుకు వెళ్తాం. అడ్డొచ్చిన ప్రతీది నాశనం చేసి ముగిస్తాం అంటూ ప్రిగోజిన్ ఆడియో సందేశం పంపించాడు. అంతేకాదు.. ఇప్పటికే వార్నర్‌ గ్రూప్‌ రోస్తోవ్‌ రీజియన్‌లోకి ప్రవేశించిందంటూ ప్రకటించారాయన. మార్చ్‌గా పలు నగరాల వైపు వెళ్తున్నట్లు తెలిపారు. దీంతో.. మాస్కోతో పాటు పలు ప్రధాన నగరాల్లో హైఅలర్ట్‌ ప్రకటించారు. 

ఒకప్పుడు రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సన్నిహిత వర్గమైన ఈ వాగ్నర్ ప్రైవేటు సైన్యం గతంలో తమతో కలిసి ఉక్రెయిన్ పై పోరాడటంలో సహకరించింది. కానీ ఇప్పుడు వారితో వైరం రష్యా సైన్యానికి పెను ప్రమాదమే తెచ్చిపెట్టింది. రష్యా మిలిటరీ తన గ్రూపును లక్ష్యంగా చేసుకుని క్షిపణుల దాడకి దిగుతోందని.. ప్రతిఘటన కొనసాగుతుందని యెవ్జెనీ ప్రిగోజిన్ ప్రకటించాడు. పుతిన్ శత్రువైన మిఖాయిల్ ఖోదోర్ కోవ్స్కీ కూడా యెవనిన్ ప్రిగోజిన్ కు మద్దతుగా నిలవాలని రష్యా ప్రజానీకానికి పిలుపునివ్వడం విశేషం 

యెవనిన్ ప్రిగోజిన్ నాయకత్వంలోని వాగ్నర్ ప్రైవేటు సైన్యం ఇప్పటికే రస్తొవ్ దక్షిణ మిలటరీ ప్రధాన కార్యాలయాన్ని స్వాధీనం చేసుకున్నట్లు, అంతర్జాతీయ వ్యవహారాల ప్రధాన కార్యాలయం తోపాటు ఎఫ్.ఎస్.బి డిపార్ట్మెంటును, ఒక పోలీస్ డిపార్ట్మెంటును కూడా తమ ఆధీనంలోకి తెచ్చుకున్నట్లు లోకల్ చానళ్లు ప్రసారం చేస్తున్నప్పటికీ అధికారంగా రష్యా సైన్యం ధ్రువీకరించలేదు. 

రోస్తోవ్‌లోకి వార్నర్‌ గ్రూప్‌ ప్రవేశించిందని ప్రిగోజిన్‌ ప్రకటించినప్పటికీ.. సైన్యం దానిని ధృవీకరించలేదు.  కానీ తిరుగుబాటు సైన్యం రాక గురించిన సమాచారమందగానే రష్యా సైన్యం ప్రజలను అప్రమత్తం చేసిన ఎవ్వరూ ఇళ్ల నుంచి బయటకు కదలవద్దని హెచ్చరించింది. మాస్కో నగర మేయర్ సెర్జీ సోబ్యానిన్ మాట్లాడుతూ ఉగ్రవాద వ్యతిరేక చర్యలను తీసుకుని రక్షణ వలయాన్ని పటిష్టం చేయనున్నామని తెలిపారు. 

లిపెట్స్క్ పరిసర ప్రాంతాల్లో కూడా ప్రజలను, స్థానిక భద్రతా దళాలను అప్రమత్తం చేసినట్లు తెలిపారు లిపెట్స్క్ గవర్నర్ ఇగర్ అర్థమొనోవ్. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని తెలిపాయి క్రెమ్లిన్ వర్గాలు. 

పుతిన్‌కు బాగా క్లోజ్‌.. 

యెవ్జెనీ ప్రిగోజిన్. 1961 రష్యాలో జన్మించారు. 1990 నుంచి  పుతిన్‌తో ఆయన అనుబంధం కొనసాగుతోంది. ఉక్రెయిన్‌ యుద్ధం తొలినాళ్లలో ప్రిగోజిన్‌ రాజకీయ చర్చకు సైతం దారి తీశారు. 

► పొలిటికో ప్రకారం.. ప్రిగోజిన్‌, పుతిన్‌ ఒకే ఊరివాళ్లు(అప్పుడు లెనిన్‌గ్రాడ్‌.. ఇప్పుడు సెయింట్‌ పీటర్‌బర్గ్‌). 18 ఏళ్ల వయసులోనే క్రిమినల్‌గా జైలుకు వెళ్లాడు. ఆ తర్వాత దొంగతనం కేసులోనూ జైలుపాలయ్యాడు. ఆపై 13 ఏళ్లకు దోపిడీ కేసులో 13 ఏళ్ల జైలు శిక్షపడి.. అందులో 9 ఏళ్లపాటు శిక్ష అనుభవించాడు. 

► జైలు నుంచి బయటకు వచ్చాక హాడ్‌డాగ్స్‌ అమ్ముతూ జీవనం కొనసాగించాడు. అటుపై సెయింట్‌ పీటర్‌బర్గ్‌లో ఖరీదైన రెస్టారెంట్లను తెరిచాడు. 

► పుతిన్‌ చెఫ్‌గా  ప్రిగోజిన్‌కి ఓ పేరుంది. రెస్టారెంట్‌ బిజినెస్‌ కాటరింగ్‌ ఆర్డర్స్‌తో ప్రభుత్వానికి బాగా దగ్గరయ్యాడు ప్రిగోజిన్‌. ఆ తర్వాత మీడియా రంగం, ఇంటర్నెట్‌ రంగంలోకి ప్రవేశించాడతను. 

► ఈ ఏడాది జనవరిలో 62 ఏళ్ల ప్రిగోజిన్‌.. రష్యా సైన్యానికి తోడుగా ప్రైవేట్‌ సైన్యం వాగ్నర్‌తో ఉక్రెయిన్‌ యుద్ధంలో భాగం పంచుకుంటూ వస్తున్నాడు. ఉక్రెయిన్‌లోనే కాదు.. ఆఫ్రికా, మధ్య ఆఫ్రికా రిపబ్లిక్‌, లిబియా, మాలిలోనూ వాగ్నర్‌ గ్రూప్‌ దురాగతాలు కొనసాగుతున్నాయని పాశ్చాత్య దేశాలు ఆరోపిస్తూ వస్తున్నాయి.

ఇదీ చదవండి: నూతన రంగాల్లోనూ కలిసి ముందుకు   

>
మరిన్ని వార్తలు