కిమ్‌ ఆంక్షలు: ‘బతికిపోయాను ఉత్తర కొరియాలో పుట్టలేదు’

27 Feb, 2021 13:29 IST|Sakshi

స్వదేశం చేరుకునేందుకు రష్యన్‌ దౌత్యవేత్తల తిప్పలు

ఉత్తర కొరియా నుంచి రైల్‌ ట్రాలీని తోసుకుంటూ రష్యా వైపు ప్రయాణం

సియోల్‌: కరోనా మహమ్మారి కట్టడి కోసం ప్రపంచవ్యాప్తంగా దేశాలన్ని ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. చాలా దేశాలు ముందు జాగ్రత్తగా చర్యగా సరిహద్దులు మూసేశాయి. కొన్నాళ్ల తర్వాత రాకపోకలకు అనుమతించాయి. కానీ ఉత్తర కొరియాలో మాత్రం నేటికి ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి. దాంతో విదేశాల నుంచి నార్త్‌ కొరియా వెళ్లిన వారు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్వదేశనికి వెళ్లలేక.. అక్కడే ఉండలేక చాలా బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో స్వదేశానకి వెళ్లేందుకు రష్యన్‌ దౌత్యవేత్తలు చేసిన ప్రయత్నం ప్రస్తుతం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియోని రష్యన్‌ విదేశాంగ శాఖ తన టెలిగ్రామ్‌ అకౌంట్‌లో పోస్ట్‌ చేయడంతో ప్రస్తుతం ఇది ప్రపంచవ్యాప్తంగా వైరల్‌ అవుతోంది. 

వివరాలు.. రష్యన్‌ దౌత్యవేత్త మూడవ కార్యదర్శి వ్లాడిస్లావ్ సోరోకిన్, మరికొందరు తమ కుటుంబ సభ్యులతో పాటు ఉత్తర కొరియాలో చిక్కుకుపోయారు. కోవిడ్‌ వ్యాప్తికి భయపడి ఆ దేశం గతేడాది జనవరి నుంచి తన సరిహద్దులను మూసి వేసింది. దాంతో ఈ రష్యన్‌ దౌత్యవేత్తలు ఇన్నాళ్లు కొరియాలోనే ఉండి పోవాల్సి వచ్చింది. నిషేధం ఎప్పుడు ఎత్తివేస్తారో తెలియదు. ఇంకా ఎంతకాలం ఇలా ఉండాల్సి వస్తుందోనని వారు ఆందోళన చెందారు. దాంతో ఉత్తర కొరియా నుంచి రష్యాకు చేరుకోవడానికి వారు ఓ అద్భుతమైన మార్గం ఎన్నుకున్నారు. ఈ మేరకు ఓ రైల్‌ ట్రాలీని సిద్దం చేసుకున్నారు. తమ లగేజ్‌, చిన్న పిల్లలు, ఆడవారిని ట్రాలీలో కూర్చో పెట్టారు. ఆ తర్వాత మరి కొందరు ఆ ట్రాలీని రైలు పట్టాలపై తోయడం ప్రారంభించారు. 

అలా దాదాపు 32 గంటల పాటు ప్రయాణం చేసి రష్యా సరిహద్దుకు చేరుకున్నారు. వీరి రాక గురించి రష్యా విదేశాంగ శాఖ అధికారులకు ముందుగానే సమాచారం ఉండటంతో.. దౌత్యవేత్తల కోసం సరిహద్దులో వాహనాలు సిద్దంగా ఉంచారు. ఆ తర్వాత ఉత్తర కొరియా నుంచి వచ్చిన దౌత్యవేత్తల బృందానికి కోవిడ్‌ టెస్ట్‌ చేసి.. దేశంలోకి అనుమతించారు. కొద్ది రోజుల పాటు బయట తిరగవద్దని తెలిపారు. అలా మరో రెండు గంటల ప్రయాణం తర్వాత ఈ దౌత్యవేత్తలు తమ ఇళ్లకు చేరుకున్నారు. దాదాపు ఏడాది తర్వాత పుట్టిన గడ్డను చేరడంతో వారి సంతోషానికి హద్దు లేకుండా పోయింది. అంతసేపు పడిన శ్రమను మర్చిపోయి.. సంతోషంగా అరుస్తూ కేకలేశారు.

ఈ సందర్భంగా వ్లాడిస్లావ్ సోరోకిన్ మాట్లాడుతూ.. ‘‘క్షేమంగా ఇంటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. కానీ మా ప్రయాణం కనిపించినంత సులువేం కాదు. చాలా ఇబ్బందిపడ్డాం. ముఖ్యంగా రష్యావైపు నడుచుకుంటూ రావడం అనేది ఎంతో కష్టంతో కూడుకున్నది. ఏదైతేనేం క్షేమంగా ఇంటికి వచ్చాం. అది చాలు’’ అన్నారు. వీరి ప్రయాణానికి సంబంధించిన వీడియోను రష్యన్‌ విదేశాంగ శాఖ సోషల​ మీడియాలో షేర్‌ చేయడంతో ప్రస్తుతం ఇది తెగ వైరలవుతోంది. ఇది చూసిన నెటిజనులు దేవుడికి ధన్యవాదాలు నేను ఉత్తర కొరియాలో జన్మించలదు అంటూ కామెంట్‌ చేస్తున్నారు. 

చదవండి: 
ఆమె బతికే ఉంది.. ఇదిగో సాక్ష్యం
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర సరిహద్దులోకి వ్యక్తి..

Read latest International News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు