నదిపైనే ల్యాండింగ్‌ !

29 Dec, 2023 04:33 IST|Sakshi

ఉపరితలం గడ్డకట్టడంతో తప్పిన ప్రమాదం

రష్యాలో ఘటన

మాస్కో: రన్‌వేపై ల్యాండ్‌ చేయడం మామూలే.. నది ఉపరితలంపై విమానాన్ని పరుగెత్తించడంలోనే ఉంది అసలు మజా అనుకున్నాడో ఏమో. రష్యాలో చిన్న విమానాన్ని ఒక పైలట్‌ నేరుగా నదిపైనే ల్యాండ్‌ చేశాడు. అదృష్టవశాత్తు నది ఉపరితలం మొత్తం దట్టంగా మంచుతో నిండిపోవడంతో ప్రయాణికుల ప్రాణాలు నిలబడ్డాయి. రష్యాలో తూర్పు సైబీరియా పరిధిలోని జిర్యాంకా విమానాశ్రయ సమీపంలో జరిగిందీ ఘటన.

రష్యాలోని సఖా రిపబ్లిక్‌ ప్రాంతంలోని యాకుట్సŠక్‌ నగరం నుంచి 34 మంది ప్రయాణికులతో ఆంటోవ్‌ ఏఎన్‌–24 విమానం గురువారం ఉదయం జిర్యాంకా నగరానికి బయల్దేరింది. భారీగా మంచు కురుస్తుండటంతో జిర్యాంకా ఎయిర్‌పోర్ట్‌ రన్‌వే సరిగా కనబడక దానిని దాటేసి ఎదురుగా ఉన్న కోలిమా నదిపై ల్యాండ్‌చేశాడు.

నగరంలో ప్రస్తుతం గడ్డకట్టే చలి వాతావరణం రాజ్యమేలుతోంది. మైనస్‌ 40 డిగ్రీల ఉష్ణోగ్రత దెబ్బకు నది ఉపరితలం మొత్తం గడ్డకట్టింది. దీంతో దీనిపై ల్యాండ్‌ అయిన విమానం అలాగే కొన్ని మీటర్లు సర్రున జారుతూ ముందుకెళ్లి ఆగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదు. ఘటనకు కారకుడైన పైలట్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటామని అధికారులు చెప్పారు. సోవియట్‌ కాలంనాటి ఈ చిన్న విమానాన్ని పోలార్‌ ఎయిర్‌లైన్స్‌ నడుపుతోంది. 

>
మరిన్ని వార్తలు