బయటపెట్టిన అమెరికా అత్యున్నత కమిషన్‌ నివేదక

2 Dec, 2020 17:48 IST|Sakshi

వాషింగ్టన్‌: ఈ ఏడాది జూన్‌లో గల్వాన్‌ లోయలో భారత్‌-చైనా సైనికులు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ దాడిలో 20మంది భారత జవాన్లు అమరులయ్యారు. చైనా సైనికులు 45 మంది వరకు చనిపోయినట్లు అమెరికా మీడియా వెల్లడించింది. అయితే దీనిపై చైనా ఇంతవరకు నోరు విప్పలేదు. ఇప్పటికే కరోనా విషయంలో సీఎన్‌ఎన్‌ ప్రచురించిన ‘వుహాన్‌ ఫైల్స్‌’ చైనా గుట్టు రట్టు చేయగా.. తాజాగా గల్వాన్‌ దాడికి సంబంధించిన సంచలన వాస్తవాలను అమెరికా అత్యున్నత స్థాయి కమిషన్‌ వెల్లడించింది. యునైటెడ్ స్టేట్స్-చైనా ఎకనామిక్ అండ్ సెక్యూరిటీ రివ్యూ కమిషన్ (యూఎస్‌సీసీ) వార్షిక నివేదిక ప్రకారం చైనా పథకం ప్రకారమే ఈ దాడికి దిగిందని.. భారత్‌కు ప్రాణ నష్టం కలిగించడమే దాని ప్రధాన ఉద్దేశమని తెలిపే కొన్ని సాక్ష్యాలు లభించాయి అని యూఎస్‌సీసీ నివేదిక వెల్లడించింది. 

యూఎస్‌సీసీ 2000 సంవత్సరంలో ప్రారంభమయ్యింది. అమెరికా-చైనా మధ్య జాతీయ భద్రత, వ్యాణిజ్య సమస్యలను పరిశీలిస్తుంది. బీజింగ్‌పై అమెరికా కాంగ్రెస్‌ తీసుకోవాల్సిన పరిపాలన, శాసనపరమైన చర్యలను సిఫారసు చేస్తుంది. ఇక ఈ నివేదిక ప్రకారం వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఏసి) వెంబడి "చైనా ప్రభుత్వం రెచ్చగొట్టే ప్రవర్తన వెనుక ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియలేదు" అని నివేదిక పేర్కొంది. అయితే గల్వాన్‌ ఘర్షణకు "ప్రధాన కారణం" భారతదేశం సరిహద్దులో వ్యూహాత్మకంగా వ్యవహరించడం.. దళాలకు మద్దతు ఇచ్చే చర్యలను పెంచుకోవడమే అని యూఎస్‌సీసీ నివేదిక పేర్కొంది. (చదవండి: తూర్పులద్దాఖ్‌లో పీఎల్‌ఏపై ఆర్మీ పైచేయి)

గల్వాన్‌ ఘర్షణకు కొన్ని వారాల ముందు డ్రాగన్‌ రక్షణ మంత్రి వీ చైనా దళాలను ఉద్దేశించి సరిహద్దులో స్థిరత్వం కోసం ఘర్షణలకు దిగండి అని ప్రోత్సాహించాడని నివేదిక వెల్లడించిది. అలానే చైనా కమ్యూనిస్ట్ పార్టీ మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్‌లో వచ్చిన ఓ సంపాదకీయం ‘ఒకవేళ భారతదేశం గనక అమెరికా-చైనా శత్రుత్వంలో తలదూరిస్తే.. చైనాతో ఇండియాకు గల ఆర్థిక, వాణిజ్య సంబంధాల్లో "వినాశకరమైన దెబ్బ" ను ఎదుర్కొంటుందని హెచ్చరించినట్లు’ నివేదక తెలిపింది. గల్వాన్‌ ఘర్షణకు కొన్ని రోజుల ముందు చైనా ఆ ప్రాంతంలో భారీ ఎత్తున బలగాలను మోహరించినట్లు ఉపగ్రహ చిత్రాల ద్వారా తెలిసింది. (చదవండి: చైనాతో ఉద్రిక్తతలకు చెక్‌! )

ప్రస్తుతం బీజింగ్ వాస్తవ నియంత్రణ రేఖ(ఎల్‌ఏసీ) వెంట విస్తృతమైన మౌలిక సదుపాయాలను నిర్మించడంలో నిమగ్నమై ఉంది. ఇక గల్వాన్‌ ఘర్షణల తరువాత మొత్తం తూర్పు లద్దాఖ్‌ ప్రాంతంలో చోరబాట్లకు ప్రయత్నించింది. దాంతో ప్రస్తుతం కొన్ని నెలలుగా భారత్‌-చైనా మధ్య సరిహద్దులో ప్రతిష్టంభన కొనసాగుతోంది. ఇక తన దళాలను వెనక్కి రప్పించడానికి బీజింగ్‌ ఇష్టపడటంలేదు. ఈ సంవత్సరం చైనా కరోనా మహమ్మారి విషయంలో భారతదేశంతోనే కాకుండా జపాన్, ఆస్ట్రేలియా, తైవాన్, యూకే, కెనడా వంటి దేశాలతో చైనాదూకుడుగా వ్యవహరిస్తోంది. ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్‌.. చైనీస్ యాప్స్‌‌, టెక్‌ కంపెనీలపై నిషేధం, ఆంక్షలు విధించడం వంటివి చేస్తూ.. డ్రాగన్‌కు ధీటుగా బదులిస్తోంది. 
 

మరిన్ని వార్తలు