TS Election 2023: మహిళా రిజర్వేషన్లు అమలుతో.. తెరపైకి ఏనుగు మంజులారెడ్డి!

12 Oct, 2023 13:25 IST|Sakshi

క్రియాశీల రాజకీయాల్లోకి మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి సతీమణి..

ఎల్లారెడ్డి బీజేపీ టికెట్‌పై ఆశలు!

అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా ఆసక్తి..

భవిష్యత్తులో.. మంజులారెడ్డి ప్రయత్నం!

సాక్షి, కామారెడ్డి: ఎల్లారెడ్డి నియోజకవర్గంలో రాజకీయాలు మారుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డి సతీమణి మంజులారెడ్డి క్రియాశీల రాజకీయాల్లోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆమె అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. ఏనుగు రవీందర్‌రెడ్డి రాజకీయాల్లో అడుగుపెట్టిన నాటి నుంచి ఎన్నికల వ్యవహారాలతో పాటు క్యాడర్‌ బాధ్యతను ఆయన సతీమణి మంజులారెడ్డే చూసుకుంటున్నారు. ఉన్నత విద్యనభ్యసించిన మంజులారెడ్డికి రాజకీయాలపై మొదటి నుంచి ఆసక్తి ఉంది.

భర్త రవీందర్‌రెడ్డితో కలిసి పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటూ వచ్చారు. 2004 లో టీఆర్‌ఎస్‌ టికెట్‌ను మొదట మంజులారెడ్డికే కేటాయించాలని భావించారు. అయితే ఆమె స్థానంలో రవీందర్‌రెడ్డికి ఇచ్చారు. రవీందర్‌రెడ్డి గెలుపు కోసం మంజులారెడ్డి ఎంతో శ్రమించారు. ఎన్నికల సమయంలో ఆమె నియోజకవర్గం అంతటా తిరుగుతూ ప్రచారం చేశారు. తాడ్వాయి మండలంలో అయితే ప్రతి ఇల్లూ ఆమెకు పరిచయమే.. 2018 ఎన్నికల్లో రవీందర్‌రెడ్డి అనూహ్యంగా ఓటమి చెందారు.

అయినప్పటికీ నియోజకవర్గంలో ఆమె అనుచరులకు భరోసా ఇస్తూ వస్తున్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిన జాజాల సురేందర్‌ బీఆర్‌ఎస్‌లో చేరడంతో పార్టీలో రెండు గ్రూపులయ్యాయి. సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా సురేందర్‌రెడ్డికి పా ర్టీలో, ప్రభుత్వంలో ప్రాధాన్యత ఇవ్వడం, రవీందర్‌రెడ్డికి నామినేటెడ్‌ పదవులు దక్కకపోవడంతో ఆయన బీజేపీలో చేరారు. దీంతో బీజేపీ అభ్యర్థిగా ఆయన పోటీ చేస్తారని భావించారు. కానీ ఇటీవల చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో బీజేపీలో అసంతృప్తితో ఉన్న ఆయన కాంగ్రెస్‌లో చేరతారన్న ప్రచారం జరిగింది.

బీజేపీ నాయకత్వం రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించి అసంతృప్తులను చేరదీసి పదవులు కట్టబెట్టడంతో కొంత వెనక్కి తగ్గారు. భవిష్యత్తులో మహిళా రిజర్వేషన్లు అమలులోకి వచ్చే అవకాశాలు ఉండడంతో తనకు బదులుగా తన భార్య మంజులారెడ్డిని బరిలో నిలిపేందుకు రవీందర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. రవీందర్‌రెడ్డి అనుచరులు సైతం గట్టి నిర్ణయం తీసుకోవాలని ఒత్తిడి తెస్తుండడంతో ఎల్లారెడ్డి రాజకీయాల్లో కొనసాగాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఆయన తన భార్యకు బీజేపీ టికెట్టుకోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి.

మరిన్ని వార్తలు