'భూకబ్జాలు చేశానా? గుట్టలను మాయం చేశానా?' : బండి సంజయ్‌కుమార్‌

18 Nov, 2023 09:43 IST|Sakshi
మాట్లాడుతున్న బండి సంజయ్‌, హాజరైన ప్రజలు, బండి సంజయ్‌ను గజమాలతో సత్కరిస్తున్న బీజేపీ కార్యకర్తలు

నేనెట్లా అవినీతికి పాల్పడుతా..

ఎంపీ, కరీంనగర్‌ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌..

సాక్షి, కరీంనగర్‌: నేను అవినీతిపరుడినట.. నా దగ్గర డబ్బు సంచులున్నయట.. అందుకే అధ్యక్ష పదవి నుంచి నన్ను తీసేశారట.. నేనేమన్నా ఆయన లెక్క మంత్రినా? అధికారంలో ఉన్నామా? నీ లెక్క భూకబ్జాలు చేశానా? గుట్టలను మాయం చేశానా? భూములు కబ్జా చేసి కమీషన్లు తీసుకున్నానా? నేనెట్లా అవినీతికి పాల్పడుతానని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్‌ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. తెలంగాణలోనే అత్యంత అవినీతిపరుడైన మంత్రి గంగుల కమలాకర్‌కు తనను విమర్శించే నైతికహక్కు లేదన్నారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని 22, 23, 24 డివిజన్లతో పాటు కరీంనగర్‌ మండలం చామనపల్లిలో ప్రచారం నిర్వహించారు. చామనపల్లికి వచ్చిన సంజయ్‌కు యువకులు, మహిళలు ఘనస్వాగతం పలికారు. పలువురు యువకులు బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో సంజయ్‌ మాట్లాడుతూ.. నన్ను ఎంపీగా గెలిపిస్తే ప్రజల కోసం కొట్లాడితే సీఎం కేసీఆర్‌ 74 కేసులు పెట్టించి జైలుకు పంపించాడన్నారు. పదేళ్ల నుంచి తీగలగుట్టపల్లి ఆర్వోబీని పట్టించుకోని మంత్రి గంగుల కమలాకర్‌, నిధులు తీసుకొచ్చిన తనకు తెలియకుండానే కొబ్బరికాయ కొట్టి తానే తెచ్చినట్లు ప్రచారం చేసుకున్నాడని విమర్శించారు.

నేను చామనపల్లికి రాలేదంటున్న కమలాకర్‌కు అకాల వర్షాలతో పంటలు నష్టపోయిన రైతులను ఓదార్చి ప్రభుత్వంతో కొట్లాడిన విషయం గుర్తు లేదా? అని ప్రశ్నించారు. పంటలకు నష్టపరిహారం సీఎం కేసీఆర్‌ నుంచి రైతులకు ఎందుకు ఇప్పించలేదో చెప్పాలని డిమాండ్‌ చేశారు. మంత్రిగా ఉండి కొత్తగా ఒక్క రేషన్‌కార్డు ఇవ్వలేదని, గంగుల ఓడిపోవడం ఖాయమని అన్నారు.

తెలంగాణలోనే అత్యంత అవినీతిపరుడైన గంగుల కమలాకర్‌కు సీఎం కేసీఆర్‌ బీఫామ్‌ ఇవ్వకుండా సతాయించి, కరీంనగర్‌కే పరిమితం చేసిండని అన్నారు. నేను అవినీతికి పాల్పడితే ఎమ్మెల్యే టిక్కెట్‌ ఇవ్వరని, హెలిక్యాప్టర్‌ ఇచ్చి రాష్ట్రమంతా ప్రచారం చేయాలని పంపారని తెలిపారు. ఓటమి భయంతో కమలాకర్‌ కార్యకర్తలకు లక్ష సెల్‌ఫోన్లు, ఓటుకు రూ.10వేలు ఇచ్చి గెలవాలని చూస్తున్నాడని ఆరోపించారు. ప్రజలు వాస్తవాలను పరిశీలించి మీ కోసం కొట్లాడి జైలుకెళ్లిన తనకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు గండ్ర నళిని, ఎం.సంతోశ్‌కుమార్‌, ఎం.కుమార్‌, శ్రీనివాస్‌ తదితరులు పాల్గొన్నారు.

నాగులమల్యాలలో బీజేపీ ఇంటింటి ప్రచారం!
కొత్తపల్లి మండలం నాగులమల్యాల గ్రామంలో బీజేపీ నాయకులు శుక్రవారం ఇంటింటి ప్రచారం చేపట్టి ఓట్లు అభ్యర్థించారు. కొత్తపల్లి మండల ఇన్‌చార్జి జాడి బాల్‌రెడ్డి, శక్తి కేంద్రం ఇన్‌చార్జి రంజిత్‌, నాయకులు రమేశ్‌, అంజన్‌కుమార్‌, కరుణాకర్‌, రవీందర్‌, గంగారాజు, అనిల్‌, శ్రీనివాస్‌, ప్రసాదరావు తదితరులు ఇంటింటికీ తిరుగుతూ బీజేపీకి ఓటేసి మచ్చలేని అభ్యర్థి, ఎంపీ బండి సంజయ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

బీజేపీలో చేరిన మాజీ కార్పొరేటర్‌ పెంట సత్యనారాయణ
కరీంనగర్‌ కార్పొరేషన్‌లోని 15వ డివిజన్‌ మాజీ కార్పొరేటర్‌, బీఆర్‌ఎస్‌ నాయకుడు పెంట సత్యనారాయణ శుక్రవారం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ సమక్షంలో కాషాయ తీర్ధం పుచ్చుకున్నారు. తన అనుచరులు, బీఆర్‌ఎస్‌ నాయకులతో కలిసి ఎంపీ కార్యాలయానికి వచ్చిన పెంట సత్యనారాయణను బండి సంజయ్‌ సాదరంగా ఆహ్వానించారు.

ఆయనతోపాటు పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలకు కాషాయ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. మరోవైపు మంచిర్యాల జిల్లాకు చెందిన వివిధ పార్టీలకు నాయకులు పలువురు కరీంనగర్‌కు వచ్చి బండి సంజయ్‌ సమక్షంలో పార్టీలో చేరారు. బీజేపీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుదు రఘు, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
ఇవి చదవండి: నేతలకు కోవర్టుల టెన్షన్‌..! అన్ని పార్టీల్లో భయం భయం!

మరిన్ని వార్తలు