అలంకారప్రాయమేనా..! | Sakshi
Sakshi News home page

అలంకారప్రాయమేనా..!

Published Sat, Nov 18 2023 1:38 AM

టవర్‌సర్కిల్‌లో వెలగని స్ట్రీట్‌ లైట్లు - Sakshi

కరీంనగర్‌ కార్పొరేషన్‌: నగరానికి వాణిజ్య కేంద్రమైన టవర్‌సర్కిల్‌ వద్ద స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లు అలంకారప్రాయంగా మిగిలాయి. నిత్యం వేలాది మంది రాకపోకలు సాగించే ఈ ప్రాంతంలో వీధిదీపాలు వెలగడం లేదు. స్మార్ట్‌ సిటీలో భాగంగా ఏడాదిక్రితం నగరంలోని ప్రధాన వీధుల వెంట స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లు ఏర్పాటు చేశారు. ముందుగా కలెక్టరేట్‌ రోడ్‌లో ఏర్పాటు చేయగా, ఆ తర్వాత నగరంలోని ఇతర ప్రధాన రహదారులు, పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా టవర్‌సర్కిల్‌ ప్రాంతంలోనూ ఏర్పాటు చేసి ఆరు నెలల క్రితం ప్రారంభించారు. అప్పటి నుంచి ఈ లైట్ల నిర్వహణ అంతంతమాత్రంగానే సాగుతోంది. ఈ క్రమంలో 45 రోజులు నుంచి లైట్లు వెలగడం లేదు. కేబుల్‌ సమస్య కారణంగానే ఈ లైట్లు వెలగడం లేదని అధికారులు నిర్ధారించారు. లైట్ల సామర్థ్యానికి తగిన విధంగా కేబుల్‌ లేకపోవడంతోనే ఈ సమస్య తలెత్తినట్లు తేలగా, కనీసం లైట్ల సామర్థ్యం కూడా చూడకుండా కేబుల్‌ ఎలా వేస్తారని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. స్మార్ట్‌సిటీలో భాగంగా నగరంలో చేపడుతున్న పనుల్లో చాలా చోట్ల నాణ్యత ప్రశ్నార్థకంగా మారింది. ఈ జాబితాలో తాజాగా స్ట్రీట్‌ లైట్లు కూడా చేరడం విశేషం. నగరానికి ప్రధాన ఆకర్షణగా ఉండే టవర్‌సర్కిల్‌ వద్దనే స్ట్రీట్‌లైట్లు వెలగకపోతే మిగతా ప్రాంతాల్లో వాటి నిర్వహణ ఏ స్థాయిలో ఉంటుందో ఊహించొచ్చు.

హౌసింగ్‌ బోర్డులో ప్రారంభం కాని లైట్లు

స్మార్ట్‌సిటీలో భాగంగా మోడల్‌ కాలనీగా అభివృద్ధి చేసిన హౌసింగ్‌బోర్డు కాలనీలో ఇప్పటివరకు స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లు ప్రారంభం కాలేదు. కాలనీవ్యాప్తంగా దాదాపు 200 వరకు లైట్లు ఏర్పాటు చేయడంతో పాటు, వాటికి బాక్స్‌లు కూడా అమర్చారు. ఇప్పటివరకు విద్యుత్‌కనెక్షన్‌ ఇవ్వకపోవడంతో వినియోగంలోకి రావడం లేదు. కాలనీవాసులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోవడం లేదు. స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్ల కోసం ప్రత్యేకంగా ట్రాన్స్‌ఫార్మర్‌లు ఏర్పాటు చేయాలనే ట్రాన్స్‌కో సూచన మేరకు పెండింగ్‌ పడ్డట్లు నగరపాలక సంస్థ అధికారులు చెబుతున్నారు. అయితే ఇప్పటివరకు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేయకపోవడంతో, సంవత్సర కాలంగా అవి అలంకారప్రాయంగా మిగిలాయి.

ఇప్పటికై నా టవర్‌సర్కిల్‌లో స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్ల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలని, హౌసింగ్‌బోర్డుకాలనీలో లైట్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వాలని స్థానికులు కోరుతున్నారు.

టవర్‌సర్కిల్‌ వద్ద వెలగని

స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లు

హౌసింగ్‌బోర్డులో ప్రారంభం కాని వైనం

కొత్త కేబుల్‌ వేస్తున్నాం

టవర్‌సర్కిల్‌లో స్మార్ట్‌ స్ట్రీట్‌ లైట్లకు కొత్త కేబుల్‌ వేస్తున్నాం. పాత కేబుల్‌ స్థానంలో కొత్త కేబుల్‌ వేసే పనులు కొనసాగుతున్నాయి. వారం పదిరోజుల్లో పనులు పూర్తి చేసి స్ట్రీట్‌ లైట్లు వెలిగిస్తాం.

– గఫూర్‌, ఏఈ, నగరపాలక సంస్థ

1/1

Advertisement
Advertisement