కారు వేగం ధాటికి.. ఇద్ద‌రు యువ‌కుల విషాదం!

22 Dec, 2023 08:19 IST|Sakshi
కూతరు నగేశ్‌, పాడితం హరీశ్‌ (ఫైల్‌)

చొప్పదండిలో బైక్‌ను ఢీకొన్న కారు

బస్సు ఓవర్‌టేక్‌ చేయబోయిన కారు డ్రైవర్‌

మృతులది ధర్మారం మండలం మల్లాపూర్‌

గుంతల రోడ్డుపై ప్రమాదం!

కరీంనగర్: పట్టణంలోని సిద్ధార్థ ఉన్నత పాఠశాల సమీపంలో ప్రధాన రహదారిపై గురువారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతిచెందారు. స్థానికుల కథనం ప్రకారం.. ధర్మారం మండలం మల్లాపూర్‌ గ్రామానికి చెందిన కూతరు నగేశ్‌ (21), పడిదం హరీశ్‌ (19) ఇద్దరు స్నేహితులు. ద్విచక్ర వాహనం (టీఎస్‌ 22 హెచ్‌ 6725)పై మల్లాపూర్‌ నుంచి కరీంనగర్‌ వస్తున్నారు. ఈక్రమంలో వరంగల్‌ నుంచి ఆదిలాబాద్‌ వైపు వెళ్తున్న కారు సిద్ధార్థ స్కూల్‌ దాటాక బస్సును ఓవర్‌టేక్‌ చేయబోయి బైక్‌ను ఢీకొంది.

ఈ ఘటనలో కారు, బైక్‌ ధ్వంసం కాగా, బైక్‌ నడుపుతున్న నగేశ్‌, వెనుక కూర్చున్న హరీశ్‌ తీవ్రగాయాలతో అక్కడికక్కడే మృతిచెందారు. ఆదిలాబాద్‌కు చెందిన కారు డ్రైవర్‌ గౌస్‌ బస్సును ఓవర్‌ టేక్‌ చేసే క్రమంలో బైక్‌ను ఢీకొట్టినట్లు స్థానికులు భావిస్తున్నారు. కారు వేగం ధాటికి ఇద్దరు చెరో చోట ఎగిరిపడ్డారు. కాగా రాష్ట్ర రహదారిపై గత కొన్నేళ్లుగా గుంతలు పడ్డ చోటనే ప్రమాదాలు చోటు చేసుకోవడం గమనార్హం. ఇటీవలే ప్రమాద సూచికలను రోడ్డుపై ఏర్పాటు చేసిన అధికారులు, రోడ్డును మరమ్మతు చేయక పోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఒక్కడే కుమారుడు..
ప్రమాదంలో మృతి చెందిన పాడిదం హరీశ్‌ తల్లిదండ్రులకు ఒక్కడే కుమారుడు కావడంతో బంధువుల రోదనలు మిన్నంటాయి. చెర్లపల్లి నుంచి ధర్మారం మండలం మల్లాపూర్‌లో మూడేళ్లుగా నివాసం ఉంటూ సుతారి పనులు చేస్తు హరీశ్‌ తండ్రి రాజయ్య కుటుంబాన్ని పోషిస్తున్నాడు. హరీశ్‌ ఇంటర్‌ మొదటి సంవత్సరం వరకు చదవగా, మరో సోదరి ఐదో తరగతి చదువుతోంది.

సెల్‌ఫోన్‌ రిపేర్‌ చేస్తూ..
మృతుడు కూతురు నగేశ్‌ ఇటీవలే బైక్‌ కొనుగోలు చేశాడు. కరీంనగర్‌లో నివాసం ఉంటూ సెల్‌ఫోన్‌ రిపేర్‌లు చేస్తుండేవాడని గ్రామస్తులు తెలిపారు. మృతుడికి ఒక సోదరుడు, సోదరి ఉన్నారు. తండ్రి పో చమల్లు నగేశ్‌ చిన్నతనంలోనే మృతి చెందినట్లు తెలిసింది. సోదరుడికి వివాహమైంది. రోడ్డు ప్రమాదం నిరుపేద కుటుంబాల్లో విషాదం నింపింది.
ఇవి చ‌ద‌వండి: హనుమకొండ: దైవదర్శనానికి వెళ్తూ.. ఘోర ప్రమాదంలో ఒకే కుటుంబంలో నలుగురు మృతి

>
మరిన్ని వార్తలు