అఫిడవిట్‌లో తప్పిదం! కానీ ఎన్నికల నిబంధనల మేరకు ఒకే..

14 Nov, 2023 10:01 IST|Sakshi

సాక్షి, మహబూబాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ అభ్యర్థి సింగపురం ఇందిర తన నామినేషన్‌తో పాటు దాఖలు చేసిన అఫిడవిట్‌లో తప్పిదం చోటుచేసుకుంది. ఇందిర తన అఫిడవిట్‌లో నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎదురుగా ఉన్న కాలంలో అప్లికేబుల్‌ బదులు నాట్‌ అప్లికేబుల్‌ అని పూరించారు. ఈ విషయమై సోమవారం ఆర్‌ఓ కార్యాలయంలో జరిగిన స్క్రూట్నీలో బీజేపీ అభ్యర్థి విజయరామారావుతో పాటు స్క్రూట్నీలో పాల్గొన్న ఇతర అభ్యర్థులు ఆర్‌ఓతో చర్చించారు. అయితే ఎన్నికల నిబంధనల మేరకు ఏ పార్టీ నుంచి బీ–ఫారం జతచేస్తారో దానినే పరిగణలోకి తీసుకుంటామని చెప్పారు. ఎన్నికల నియమావళి మేరకు ఆమె నామినేషన్‌ను ఆమోదించామని తెలిపారు.

వినయ్‌భాస్కర్‌.. తప్పుడు అఫిడవిట్‌..
బీఆర్‌ఎస్‌ పశ్చిమ నియోజకవర్గ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్‌ తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేశారని బీజేపీ నాయకుడు, న్యాయవాది రావు అమరేందర్‌రెడ్డి వరంగల్‌ పశ్చిమ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారికి ఫిర్యాదు చేశారు. ప్రజాప్రతినిధుల కేసులు విచారిస్తున్న ప్రత్యేక కోర్టు జరిమానా విఽధించిందని, ఈ జరిమానాను చెల్లించాడని, రూ.2 వేలకు పైగా జరిమానా చెల్లిస్తే ఎన్నికల్లో పోటీకి అనర్హుడవుతాడని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే బీఆర్‌ఎస్‌ అభ్యర్థి దాస్యం వినయ్‌భాస్కర్‌ తాను రూ.1,000 మాత్రమే జరిమానా చెల్లించినట్లు అఫిడివిట్‌లో చూపించారని ఫిర్యాదులో తెలిపారు.

తప్పుడు అఫిడవిట్‌ దాఖలు చేసిన వినయ్‌భాస్కర్‌ నామినేషన్‌ను తిరస్కరించాలని ఫిర్యాదులో కోరారు. ఈసందర్భంగా రావు అమరేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. వరంగల్‌ పశ్చిమ ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి పారదర్శకంగా విధులు, బాధ్యతలు నిర్వహించడం లేదని ఆరోపించారు. రూ.3 వేలు జరిమానా విధించిన జడ్జిమెంట్‌ ప్రతిని, జరిమానా చెల్లించినట్లు ఆధారాలు అందించినా.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి నామినేషన్‌పై చర్యలు తీసుకోకుండా ఆమోదించారని, దీనిపై ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ఇవి చదవండి: 'స్వతంత్ర అభ్యర్థుల' ఓట్లు.. మిగతా పార్టీలకు మేలు చేస్తాయా? నష్టం చేస్తాయా?

మరిన్ని వార్తలు