నిలబెట్టుకున్నాం | Sakshi
Sakshi News home page

నిలబెట్టుకున్నాం

Published Tue, Nov 14 2023 1:18 AM

- - Sakshi

ఇచ్చిన

మాట

నర్సంపేట: ‘ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు అందించి ఓట్లు అడుగుతామని ఆనాడు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకున్నాం. నేడు ప్రతీ ఇంటికి కనెక్షన్‌ ఇచ్చాకే ఓట్లకు వచ్చాం. తెలంగాణ ప్రజల కోసమే బీఆర్‌ఎస్‌ పుట్టింది. నాడు ఉన్న తెలంగాణను కాంగ్రెస్‌ పార్టీ ఊడగొట్టింది’ అని బీఆర్‌ఎస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. వరంగల్‌ జిల్లా నర్సంపేట పట్టణంలోని సర్వాపురంలో సోమవారం జరిగిన బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. కృష్ణా, గోదావరి నీళ్లు ఇవ్వక కాంగ్రెస్‌ పార్టీ ప్రజలను సావగొట్టిందన్నారు. 50ఏళ్ల కాంగ్రెస్‌ పాలనలో చేనేత ఆకలి చావులు, రైతుల ఆత్మహత్యలు, విద్యుత్‌ సమస్యలు ఉండేవన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో కావాల్సి న పరిణతి రాలేదని, గ్రామాల్లో నిజా నిజాలపై చర్చ పెట్టాలన్నారు. వ్యవసాయం బాగుండాలని శపథం పట్టామని, తెలంగాణలో బీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక విభిన్న పథకాలు అమలు చేస్తున్నామన్నారు. 60ఏళ్ల కలను పెద్ది సుదర్శన్‌రెడ్డి సాకారం చేసి గోదావరి జలాలు తెచ్చాడని, యాసంగిలో 1.35 లక్షల ఎకరాల పంటల సాగవుతుందని తెలిపారు. తెలంగాణలో నీటి తీరువాలు తొలగించామన్నారు. పార్టీల వైఖరేంటో ఆలోచన చేసి ఓటు వేయాలన్నారు. సీసాలతో వచ్చే వారికి ఓటు వేయద్దని తెలిపారు. నర్సంపేటలో 270 చెరువులు గోదావరి జలాలతో నింపామన్నారు. అభివృద్ధి కొనసాగాలంటే, తెలంగాణ పెడదారి పట్టొద్దంటే పెద్ది సుదర్శన్‌రెడ్డిని, బీఆర్‌ఎస్‌ను గెలిపించుకోవాలన్నారు. నర్సంపేట ప్రాంతం హత్యలతో ఉండేదని, పదేళ్ల కాలం నుంచి ప్రశాంతంగా ఉంటుందన్నారు. తెలంగాణ రాకముందు తలసరి ఆదాయంలో 19వ స్థానంలో ఉంటే నేడు మొదటి స్థానంలో నిలుస్తోందన్నారు. పెద్ది సుదర్శన్‌రెడ్డిని గెలిపిస్తే పాకాల, రంగాయ చెరువు కాల్వలను బాగు చేసుకుందామని, నర్సంపేటకు రింగ్‌ రోడ్డును ఏర్పాటు చేయిద్దామన్నారు. దేశానికి అన్నం పెట్టే అన్నపూర్ణగా తెలంగాణ రాష్ట్రాన్ని తీర్చిదిద్దామని, ప్రతీ ఇంటికి నల్లా నీళ్లు అందించి ఓట్లు అడుగుతామని ఆనాడు ఇచ్చిన వాగ్దానాలు నిలబెట్టుకొని నేడు ప్రతీ ఇంటికి కనెక్షన్‌ ఇచ్చాకే ఓట్లకు వచ్చామన్నారు. రైతుల సంక్షేమం కోసమే రైతుబంధు, 24 గంటల విద్యుత్‌, రైతు బీమా, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తే ప్రతిపక్షాలు ఓర్వలేకనే దుబారా చేస్తున్నామని ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. ప్రభుత్వం ఏదైనా.. మీ ఎమ్మెల్యే కరెక్టుగా ఉండాలన్నారు.

నా ఆస్తి మీరే.. నా బలగం మీరే :

పెద్ది సుదర్శన్‌రెడ్డి, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి

నర్సంపేటలో తాను కాంట్రాక్టులు చేయడం లేదని, దందాలు, సెటిల్‌మెంట్లు అసలే తెలియవని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. నా జీవితం నర్సంపేట నియోజకవర్గ ప్రజలతోపాటు కేసీఆర్‌కు అంకితమని, నిత్యం మీ వెంట, మీ వద్దే ఉంటున్నానన్నారు. కరోనా సమయంలో పారిపోయినోళ్లంతా ఎన్నికలు రాగానే జనాల మధ్యకు వచ్చి ఓట్లు అడుగుతున్నారని, అలాంటి వారి మాటలు ప్రజలు నమ్మి మోసపోవద్దన్నారు. నర్సంపేట నియోజకవర్గ ప్రజలకు తాను నిజం తెలుపుతున్నానని, ఈ విషయం కొంత మందికే తెలుసని పెద్ది అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పోలీసుల చేతిలో లాఠీ దెబ్బలు తిన్నానని, ఉద్యమ సమయంలోనే కుడి కన్ను పోగొట్టుకున్నానని తెలిపారు. ఉద్యమ సమయంలో తగిలిన గాయాలతో నాకు నిత్యం అనారోగ్య సమస్యలు వస్తూనే ఉంటాయని, నిత్యం ఫిజియోథెరపీ చేసుకుంటానని, ఇన్ని సమస్యలు ఉన్నా ప్రజల కోసమే పరితపిస్తుంటానని ఆయన తెలిపారు. కొంత మంది తాను నమస్కారం చేయనని తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దీన్ని ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరారు. సభలో మంత్రి సత్యవతిరాథోడ్‌, ఎంపీలు మాలోతు కవిత, పసునూరి దయాకర్‌, ఎమ్మెల్సీలు బండా ప్రకాశ్‌, మధుసూదనచారి, ఎన్నికల ఇన్‌చార్జ్‌, జనవనరుల కార్పొరేషన్‌ చైర్మన్‌ వి.ప్రకాశ్‌, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, జెడ్పీ వైస్‌ చైర్మన్‌ ఆకుల శ్రీనివాస్‌, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ పెద్ది స్వప్న, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ గుంటి రజని, వైస్‌ చైర్మన్‌ మునిగాల వెంకట్‌రెడ్డి, నాయకులు రాయిడి రవీందర్‌రెడ్డి, నల్ల మనోహర్‌రెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్‌లు, కౌన్సిలర్లు, క్లస్టర్‌ ఇన్‌చార్జ్‌లు పాల్గొన్నారు.

గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం..

నర్సంపేట రూరల్‌: ప్రజా ఆశీర్వాద బహిరంగ సభకు నర్సంపేట నియోజకవర్గంలోని అన్ని మండలాల పరిధి నుంచి పార్టీ శ్రేణులు, అభిమానులు భారీగా తరలివచ్చారు. దీంతో పట్టణమంతా గులాబీమయమైంది. కళాకారులుతమ ఆట పాటలతో సభికులను ఉత్తేజ పరిచారు. ఖమ్మం జిల్లానుంచి బయలుదేరిన సీఎం కేసీఆర్‌ 4.44 నిమిషాలకు నర్సంపేటలోని హెలిపాడ్‌ వద్దకు చేరుకోగా.. సభలో ప్రసంగించిన అనంతరం 5.25 నిమిషాలకు తిరుగు పయనమయ్యారు. సీఎం కేసీఆర్‌ ప్రసంగంతో గులాబీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఏసీపీలు, సీఐలు, ఎస్సైలతో పాటు ప్రత్యేక పోలీసు బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు.

అందుకే ధైర్యంగా ఓట్లడిగేందుకు వచ్చాం

తెలంగాణ కోసం పుట్టిందే బీఆర్‌ఎస్‌

ఆనాడు రైతులకు నీళ్లు ఇవ్వక

కాంగ్రెస్‌ సావగొట్టింది..

60ఏళ్ల గోదావరి జలాల కలను

పెద్ది సుదర్శన్‌రెడ్డి సాకారం చేశారు

పార్టీల వైఖరేంటి అన్నదానిపై

ఆలోచన చేయండి

అభివృద్ధి కొనసాగాలంటే

బీఆర్‌ఎస్‌కు ఓటు వేయాలి

నర్సంపేట బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభలో అధినేత కేసీఆర్‌

1/3

మాట్లాడుతున్న అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి
2/3

మాట్లాడుతున్న అభ్యర్థి పెద్ది సుదర్శన్‌రెడ్డి

3/3

Advertisement
Advertisement