రంగనాథుడి బ్రహ్మోత్సవాలు

28 Feb, 2023 22:08 IST|Sakshi
శ్రీరంగాపూర్‌ గ్రామంలోని రంగనాయకస్వామి ఆలయం

పెబ్బేరు రూరల్‌: భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న రంగాపురం మండల కేంద్రంలోని రంగనాథస్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. ఏటా ఫాల్గుణ శుద్ధపూర్ణిమ నుంచి ఉగాది పండుగ వరకు సుమారు 15రోజుల పాటు ఈనెల 28 నుంచి 9వరకు జాతర జరుగుతుంది. రథోత్సవానికి వచ్చే భక్తులకు శ్రీరంగాపురం గ్రామ సేవాసమితి ఆధ్వర్యంలో అన్నదానం, తాగునీటి వసతి కల్పిస్తున్నారు. ఇతర ఆలయాల్లో రాత్రివేళల్లో రథోత్సవం నిర్వహిస్తారు. ఇక్కడ మాత్రం ఉదయం నిర్వహించడం విశేషం.

ఉట్టిపడే శిల్పసంపద

రంగనాథస్వామి ఆలయంలో అద్భుతమైన శిల్పసంపద భక్తులను కట్టిపడేస్తుంది. వివిధ శిల్ప సంప్రదాయాలతో, ద్వార పాలకా శిల్పాలతో ఆకాశాన్నంటే అంతస్తులతో భక్తులకు ఆలయం స్వాగతం పలుకుతోంది. శేషశయనుడై అభయహస్తం చూపుతూ స్వామివారు, ఆయనకు ఎడమవైపున చతుర్భుజ తాయారు ఆలయంలో లక్ష్మీదేవి అమ్మవారు భక్తులకు దర్శనమిస్తారు. ఆలయం ప్రక్కనే ఆనాటి ప్రభువులు నిర్మించిన శ్రీరంగసముద్రం అనే సువిశాల మైన చెరువు చూపరులను ఆకట్టుకొంటుంది. ఆలయంలో ఇప్పటికే అనేక సినిమాలు, టీవీ సీరియల్స్‌ కోసం షూటింగ్‌ నిర్వహించారు. ఈ ఆలయాన్ని పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేసేందుకు అవసరమైన నిర్మాణాలు జరుగుతున్నాయి.

నేటి నుంచి ప్రారంభం

7న రథోత్సవం

ఆలయ చరిత్ర

మండల పరిధిలోని కొర్విపాడు (నేటి శ్రీరంగాపురం) గ్రామంలో సుమారు 340 సంవత్సరాల క్రితం సూగూరు (వనపర్తి) సంస్థాన ప్రభువు అష్టభాషా బహిరీ గోపాలరావు(క్రీ.శ.1670) కాలంలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది. గ్రామంలో రంగసముద్రం పేరు గల చెరువు ఒడ్డున గరుడాద్రి మీద నిర్మించిన శ్రీరంగనాయక స్వామి ఆలయం అపర శ్రీరంగంగా పేరొందింది. శ్రీరంగనాథస్వామి ఆలయం నిర్మాణంతో కొర్విపాడుగా పిలుచుకునే గ్రామం శ్రీరంగాపురంగా వాడుకలోకి వచ్చింది. తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధ వైష్ణవ పుణ్య క్షేత్రంగా ప్రఖ్యాతిగాంచిన శ్రీరంగంకు సమానంగా వనపర్తి జిల్లా , శ్రీ రంగాపురం గ్రామంలోని శ్రీరంగనాథస్వామి ఆలయం ప్రసిద్ధికెక్కింది. శ్రీరంగం వెళ్లి స్వామి వారిని దర్శించే శక్తిలేని భక్తులు శ్రీరంగాపురం లోని ఆలయాన్ని దర్శించి తరించవచ్చని భక్తుల నమ్మకం.

కార్యక్రమాలు ప్రారంభం ఇలా..

మంగళవారం ఉదయం ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. కొయిలాళ్వార్‌ తిరుమంజనం, రాత్రి విష్వక్సేనపూజ, పుణ్యాహవాన, అంకురార్పణ.

1న బుధవారం ఉదయం ధ్వజరోహణ, రాత్రి ఉత్సవాలు భేరి పూజ.

2న, గురువారం ఉదయం మూలమంత్ర హవనము, రాత్రి ఉత్సవములు సూర్యప్రభ, తిరువిధి ఉత్సవం.

3న శుక్రవారం ఉదయం మూలమంత్రహోమం, రాత్రి శేషవాహన తిరువీధి ఉత్సవం.

4న శనివారం ఉదయం మూలమంత్రహోమం, రాత్రి హనుమంత వాహన సేవ మంటపోత్సవం.

5న ఆదివారం చతుస్థానార్చన, సాయత్రం 6 గంటలకు మోహినీ సేవ, రాత్రి 8 గంటలకు గరుడ సేవ, శ్రీవారి కల్యాణం.

6న సోమవారం ఉదయం తిరువీధి సేవ, రాత్రి రథాంగహోమం,గజవాహన సేవ.

7న మంగళవారం ఉదయం 10 గంటలకు గంటలకు రథోత్సవం.

8న బుధవారం ఉదయం ఉత్సవములు శ్రీవారి మూలమంత్ర హోమం , రాత్రి ఉత్సవములు పారువేట,అశ్వవాహన సేవ.

9న గురువారం ఉదయం పూర్ణాహుతి, అవబృతం, తీర్థప్రసాద వితరణ, రాత్రి ధ్వజ అవరోహణ, నాగవల్లి ఉత్సవాలు జరుగుతాయి.

భక్తులకు ఇబ్బందిలేకుండా చూస్తాం..

బ్రహోత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా చూస్తాం. అవసరమైన ఏర్పాట్లు చేశాం. తాగునీరు, పారిశుద్ధ్యానికి, ప్రాధాన్యం ఇస్తున్నాం. – శేఖర్‌గౌడ్‌, ఆలయ ఈఓ

మరిన్ని వార్తలు