జీఓ 69ను బొందపెట్టి.. కొడంగల్‌ను ఎండపెట్టిండు.. : రేవంత్‌రెడ్డి

18 Nov, 2023 01:24 IST|Sakshi

దత్తత పేరుతో తీవ్ర అన్యాయం!

పాలమూరు ఎత్తిపోతల నీళ్లు ఎక్కడ?

కొత్తపల్లి కార్నర్‌ మీటింగ్‌లో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి..

మహబూబ్‌నగర్‌: నారాయణపేట, కొడంగల్‌ నియోజకవర్గాలను సస్యశ్యామలం చేసేందుకు జీఓ నంబర్‌ 69 ద్వారా నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకాన్ని మంజూరు చేయిస్తే.. ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆ జీఓను బొందపెట్టారని పీసీసీ అధ్యక్షుడు, కొడంగల్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రేవంత్‌రెడ్డి విమర్శించారు. పాలమూరు ఎత్తిపోతల ద్వారా రెండేళ్లలో ఈ ప్రాంతానికి సాగునీరు అందించి రైతుల పాదాలు కడుతానన్న ముఖ్యమంత్రి నేటికీ సాగునీరు తీసుకురాలేదని మండిపడ్డారు.

ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం కొత్తపల్లి మండలంలో రేవంత్‌రెడ్డి కార్నర్‌ మీటింగ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొడంగల్‌ను దత్తత తీసుకున్న కేటీఆర్‌ ఈ ఐదేళ్ల కాలంలో ఏ అభివృద్ధి చేయలేదన్నారు. తాను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే కొత్తపల్లి నుంచి మహబూబ్‌నగర్‌, మద్దూరు నుంచి అన్ని మండలాలకు డబుల్‌ రోడ్లు మంజూరు చేయించినట్లు గుర్తు చేశారు. కొత్తపల్లి సబ్‌స్టేషన్‌ స్థాయిని పెంచి రైతులకు నాణ్యమైన విద్యుత్‌ అందించేందుకు ప్రయత్నించానని గుర్తు చేశారు. మోటార్లు కాలిపోకుండా రైతులకు వేలాది ట్రాన్స్‌ఫార్మర్లను మంజూరు చేయించానన్నారు.

కేసీఆర్‌ పాలనలో అన్ని వర్గాల ప్రజలకు అన్యాయానికి గురయ్యారన్నారు. దత్తత పేరుతో కొడంగల్‌కు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్‌ నెలకు రూ.4 వేలు, ఇందిరమ్మ ఇంటికి రూ.5 లక్షలు, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 అందజేస్తామని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి, జెడ్పీటీసీ రఘుపతిరెడ్డి, కాంగ్రెస్‌ నాయకులు లక్ష్మినారాయణరెడ్డి, సంజీవ్‌, నర్సింహ, చెన్నప్ప, మహేందర్‌రెడ్డి, రమేష్‌రెడ్డి, తిరుపతిరెడ్డి, హన్మిరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి: దొరల పాలనను అంతం చేయాలి! : ఎంపీ ధర్మపురి అర్వింద్‌

మరిన్ని వార్తలు