మొదలైన కొత్త మద్యం పాలసీ.. అప్పుడే 171 కోట్ల ఆదాయం!

1 Dec, 2023 09:39 IST|Sakshi

ఉమ్మడి జిల్లాలో230 మద్యం దుకాణాలు

నేటి నుంచి కొత్త వైన్‌షాపులుఅందుబాటులోకి

టెండర్ల ద్వారా రూ.171.90కోట్ల ఆదాయం

మహబూబ్‌నగర్‌ క్రైం: రెండేళ్ల పాటు కొనసాగిన మద్యం పాలసీ గురువారంతో ముగిసింది. శుక్రవారం నుంచి కొత్త మద్యం పాలసీ విధానం అమల్లోకి రానుంది. పాత మద్యం దుకాణాలు నిర్వహించే వ్యాపారులకు 75శాతం రాకపోవడంతో ఇకపై ఏం చేయాలనే ఆలోచనలో పడ్డారు. కొత్తగా దుకాణాలను సొంతం చేసుకున్న వారితో కొందరు వ్యాపార ఒప్పందం కుదుర్చుకున్నారు.

మరికొందరు తమ అనుచరులు, పనిచేసే వ్యక్తులతో టెండర్లు వేయించి దుకాణాలు దక్కేలా వేసిన ఎత్తుగడలు ఫలించాయి. మద్యం దుకాణాల్లో మళ్లీ లిక్కర్‌ కింగ్‌లదే పైచేయిగా మారింది. ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో ఆగస్టు 21న నిర్వహించిన టెండర్‌లలో మొత్తం 8,595 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా ప్రభుత్వానికి రూ.171.90కోట్ల ఆదాయం సమకూరింది.

గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఈసారి మద్యం దుకాణాలకు టెండర్లు రావడం ఆశ్చర్యం కల్గిస్తోంది. రోజురోజుకూ మద్యం వ్యాపారంపై చాలా మంది దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈసారి ఉమ్మడి జిల్లా వ్యాపారులతో పాటు ఆంధ్ర, కర్ణాటక నుంచి కూడా టెండర్లు దాఖలయ్యాయి. 2021 కంటే ఈసారి దరఖాస్తులు రెండింతలు పెరిగాయి. ప్రధానంగా మహబూబ్‌నగర్‌, నారాయణపేట, నాగర్‌కర్నూల్‌ జిల్లాలో దరఖాస్తులు రెట్టింపయ్యాయి.

బిజీబిజీ..
ఉమ్మడి జిల్లాలో కొత్త మద్యం దుకాణాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో గురువారం నుంచి హడావుడి మొదలైంది. 230 దుకాణాల్లో కొన్నింటిని అదే దుకాణాల్లో ఏర్పాటు చేసుకుంటుంటే.. మరికొన్ని దుకాణాలు కొత్తగా నిర్మాణం చేసుకుంటున్నారు. శుక్రవారం ఉదయం 10గంటల వరకు అన్నింటిని అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో వ్యాపారులు ఆయా దుకాణాల నిర్మాణ పనులు చేస్తూ బీజీబీజీగా కన్పించారు.

లాభాలు ఉండటంతో..
మద్యం విక్రయాల వల్ల భారీగా లాభాలు ఉండటంతో మద్యం వ్యాపారులతో పాటు రాజకీయ నేతలు కూడా రంగప్రవేశం చేశారు. దుకాణం ఎవరి పేరుతో వచ్చినా అంతా కలిసే వ్యాపారం చేసుకోవాలని ముందుగానే ఒప్పందం చేసుకున్నారు. ఒక్కో దుకాణానికి ఒక్కొక్కరు 10మందికిపైగా బినామీ పేర్లతో దరఖాస్తు చేసుకున్నారు.

వాళ్లలో ఏ ఒక్కరికి వచ్చినా అందరికీ లబ్ధి చేకూరేలా చేసుకున్నారు. మద్యం దుకాణాదారులే గ్రామాలు, వార్డుల్లో బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా చేస్తుంటారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రూ.4వేల కోట్ల వ్యాపారం సాగుతుండగా.. రానున్న రోజుల్లో విక్రయాలు మరింత పెరుగుతాయనే విశ్వాసంతో వ్యాపారులు ఉన్నారు.

మరిన్ని వార్తలు