పోయొద్దాం..! పోచారం..!! పచ్చదనంతో పలకరిస్తున్న పోచారం ప్రకృతి

16 Jul, 2023 13:13 IST|Sakshi

మెదక్‌జోన్‌: కోయిల కిలకిల రావాలు.. చెంగుచెంగున ఎగిరి దూకే జింకలు.. పురివిప్పి నాట్యం చేసే నెమళ్లు.. గాంభీర్యాన్ని ప్రదర్శించే మనుబోతులు.. నీల్గాయి, సాంబార్లు, మనసుకు ఆహ్లాదానిచ్చే పచ్చని అటవీఅందాల మధ్య నెలకొన్న సుందర దృశ్యాలు చూసేందుకు రెండు కళ్లూ చాలవు. అడవమ్మ ఒడిలో స్వేచ్ఛగా విహరిస్తూ.. అందాలను వీక్షించేందుకు ప్రకృతి ప్రేమికులు పట్టణాలను విడిచి పోచారం అభయారణ్యానికి పయనం అవుతున్నారు.

► జిల్లా కేంద్రానికి 15 కిలోమీటర్ల దూరంలో బోధన్‌–మెదక్‌ ప్రధాన రహదారి పక్కన కామారెడ్డి, మెదక్‌ జిల్లాల సరిహద్దు గ్రామం పోచారం శివారులో ఉందీ ఈ అభయారణ్యం.

► ఈ 600 ఎకరాల విస్తీర్ణంలో చుట్టూ కంచెను ఏర్పాటు చేశారు. ఇందులో 1983లో జింకల ప్రత్యుత్పత్తి కేంద్రాన్ని స్థాపించారు.

►వైల్డ్‌ డాగ్‌, చిరుత, వోల్ఫ్‌, జాకల్‌, ఫారెస్ట్‌ క్యాట్‌, బద్ధకం బేర్‌, సాంబార్‌, నీల్గాయి, చింకారా, చిటల్‌, నాలుగు కొమ్ముల జింకలను చూడొచ్చు.

► అభయారణ్యం పక్కనే నిజాం కాలంలో నిర్మించిన పోచారం ప్రాజెక్టు అందాలతో ఈ ప్రాంతం పర్యాటకులకు అడ్డాగా మారింది.

► హైదరాబాద్‌కు కేవలం 115 కిలోమీటర్లు దూరంలో ఉన్న అభయారణ్యానికి వారంతంలో పిల్లలు, పెద్దలు కుటుంబంతో కలిసి వచ్చి ఆనందంగా గడుపుతారు.

► నిజాంపాలనలో ఈ అభయారణ్యం వేట ప్రాంతంగా పేరుగాంచగా, నేడు వన్యప్రాణుల ఆవాసంగా మారింది.

► హైదరాబాద్‌తో పాటు రంగారెడ్డి, మేడ్చల్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, బోధన్‌ ప్రాంతాల నుంచి పర్యాటకులు సందర్శనకు వస్తుంటారు.

► వసతి కోసం పోచారం, మెదక్‌ వద్ద అతిథి గదుల్లో సేదతీరవచ్చు. మెదక్‌ వద్ద ఫారెస్ట్‌ రెస్ట్‌ హౌస్‌ కూడా ఉంది.

ఇలా చేరుకోవచ్చు..

హైదరాబాద్‌ నుంచి వయా నర్సాపూర్‌, జేబీఎస్‌ నుంచి వయా తూప్రాన్‌ మీదుగా మెదక్‌కు రావొచ్చు. మెదక్‌ నుంచి పోచారం అభయారణ్యం 15 కిలోమీటర్లు అక్కడ నుంచి 25 కిలోమీటర్ల దూరంలో సీఎస్‌ఐ చర్చి, ఖిల్లా, ఏడుపాయల, 3 కిలోమీటర్ల దూరంలో జైనమందిర్‌ ఉంటాయి.

మరిన్ని వార్తలు