TS Election 2023: సమైక్య పాలనలో గోసపడ్డాం..!

18 Sep, 2023 12:19 IST|Sakshi

నేడు సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో సుభిక్షం!

మెదక్‌ మెడికల్‌ కళాశాలకు రూ.180 కోట్లు

ఏడుపాయల అభివృద్ధికి రూ.100 కోట్లు

మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌..

మెదక్‌: నాడు సమైక్య రాష్ట్రంలో బడ్జెట్‌లో నిధులు కేటాయించే వారు లేక ఇబ్బందులు పడ్డామని, రాష్ట్రం సాధించాక సీఎం కేసీఆర్‌ ముందుకు చూపుతో రాష్ట్రం సుబీక్షంగా మారిందని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, డెయిరీ, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ అన్నారు. ఆదివారం కలెక్టరేట్‌లో నిర్వహించిన జాతీయ సమైక్యతా వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఆవిష్కరించి, పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు, జిల్లా పురోగతిపై మాట్లాడారు.

ఉమ్మడి రాష్ట్రంలో కనీసం వైద్యం అందని పరిస్థితి ఉండేదని, నేడు జిల్లాకో మెడికల్‌ కళాశాల ఏర్పాటు చేసుకున్నామన్నారు. మెదక్‌ మెడికల్‌ కళాశాలకు రూ.180 కోట్లు మంజూరయ్యాయయని, వచ్చే ఏడాది నుంచి తరగతులు ప్రారంభిస్తామన్నారు. వనదుర్గ ఆలయ అభివృద్ధికి వంద కోట్లు, జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీలకు రూ.125 కోట్లను కేటాయించినట్లు పేర్కొన్నారు. మెదక్‌ చుట్టూ రింగ్‌రోడ్డు నిర్మాణానికి త్వరలోనే నిధులు విడుదల చేసేందుకు సీఎం హామీ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు.

సంక్షేమంలో నంబర్‌వన్‌..
బీసీ సంక్షేమ శాఖ ద్వారా చేతి, కులవృత్తుల వారికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నామన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అన్నివర్గాల అభ్యున్నతికి అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. జిల్లాలో గతంలో 1,33,314 మెట్రిక్‌ టన్నుల ధాన్యం దిగుబడి రాగా, నేడు 3,09,189 మెట్రిక్‌ టన్నులకు పెరిగిందన్నారు. రైతుబంధు కింది 2018 నుంచి నేటి వరకు 2,43,380 మంది రైతులకు రూ.1,909 కోట్లు అందించామని, రైతు బీమా కింద 5,137 మృతుల కుటుంబాలకు రూ.256.85 కోట్లు పంపిణీ చేశామన్నారు.

రూ.378.23 కోట్లు రుణమాఫీ చేసినట్లు వివరించారు. టీఎస్‌ ఐపాస్‌తో జిల్లాకు 871 పరిశ్రమలకు సంబంధించి 1869 అనుమతులు వచ్చాయని, 27,900 మందికి ఉపాధి లభించిందన్నారు. ఎస్సీ, ఎస్టీలకు సబ్సిడీ కింద రూ.1.11కోట్లు, ఎస్టీలకు రూ.2.24కోట్ల రుణాలు అందించామన్నారు. మొదటి విడత గొర్రెల పంపిణీలో రూ.128కోట్లు చెల్లించామని, రెండో విడతకు 2,579 మంది లబ్ధిదారులకు యూనిట్లు అందించామన్నారు. పాడి పశువుల పథకం కింద రూ.5.44 కోట్లు సబ్సిడీగా పంపిణీ చేశామన్నారు.

జిల్లాలోని మూడు రిజర్వాయర్లతో సహా 1,617 చెరువుల్లో చేపలు పెంచుతున్నామని, 16,200 మంది సభ్యులకు వీటిని అందించామన్నారు. 31 కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం చేపట్టామని, దివ్యాంగులకు రూ.3,016 నుంచి రూ.4,016కు పింఛన్‌ పెంచామన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పద్మాదేవేందర్‌రెడ్డి, మదన్‌రెడ్డి, కలెక్టర్‌ రాజర్షి షా, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, జెడ్పీ చైర్‌పర్సన్‌ హేమలత, ఇఫ్కో డైరెక్టర్‌ దేవేందర్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, వైస్‌ చైర్మన్‌ మల్లికార్జున్‌ గౌడ్‌, గ్రంథాలయ చైర్మన్‌ చంద్రగౌడ్‌ తదతరులు పాల్గొన్నారు.

ఎస్పీ కార్యాలయంలో..
జిల్లా పోలీస్‌ ప్రధాన కార్యాలయంలో ఆదివారం జాతీయ సమైక్యత వేడుకలు నిర్వహించారు. ఎస్పీ రోహిణి ప్రియదర్శిని జాతీ య జెండా ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. జిల్లా పోలీస్‌ ఏ.ఆర్‌ హెడ్‌ క్వార్టర్‌లో అదనపు ఎస్పీ మహేందర్‌ జెండా ఎగురవేశారు. కార్యక్రమంలో డీఎస్పీ ఫణింద్ర, ఆర్‌ఐలు అచ్యుతరావు, నాగేశ్వర్‌రావు, ఎస్‌బీ సీఐ సందీప్‌రెడ్డి, సీఐ దిలీప్‌కుమార్‌, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

జిల్లా పరిషత్‌ కార్యాలయంలో..
సమైక్యత దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్‌ కార్యాలయంలో జెడ్పీ చైర్‌ పర్సన్‌ హేమలత జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ వెంకట శైలేష్‌, వెల్దుర్తి జెడ్పీటీసీ రమేష్‌ గౌడ్‌, కార్యాలయ పర్యవేక్షకులు మాణయ్య, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

చేపపిల్లలను వదులుతున్న మంత్రి, ఎమ్మెల్యేలు..
రాష్ట్రంలో మత్స్యకారుల అభివృద్ధికి సీఎం కేసీఆర్‌ పెద్ద పీటవేశారని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. పట్టణంలోని గోసముద్రం చెరువులో ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌ రెడ్డి, మదన్‌ రెడ్డితో కలిసి ఆదివారం చేపపిల్లలను వదిలారు. అనంతరం మత్స్యకారులకు గుర్తింపు కార్డుల పంపిణీ చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో మత్స్యరంగాన్ని నాటి ప్రభుత్వాలు పూర్తిగా నిర్లక్ష్యం చేశాయని అన్నారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌ రావు నాయకత్వంలో పెద్ద ఎత్తున మత్స్య రంగ అభివృద్ది నిధులు ఖర్చు చేస్తున్నట్లు వివరించారు. ఈ రంగంపై ఆధారపడి జీవనం సాగిస్తున్న లక్షలాదిమంది మత్స్యకారుల కుటుంబాలు ఆర్ధిక ంగా, సామాజికంగా అభివృద్ది చెందాలనే లక్ష్యంతో దేశంలో ఎక్కడా లేని విధంగా ఉచితంగా చేప, రొయ్య పిల్లలను అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రంలో పెద్ద ఎత్తున నీటి వనరులను అభివృద్ది చేసుకొని ప్రతి నీటి వనరులో చేప పిల్లలను విడుదల చేస్తున్న ఫలితంగా మత్స్య సంపద మూడింతలు పెరిగిందన్నారు. అర్హులైన మత్స్యకారులకు ప్రభుత్వ లబ్ది అందాలనే ఉద్దేశం తో నూతనంగా లక్షమంది మత్స్యకారులకు సొసైటీలలో సభ్యత్వాలు కల్పిస్తున్నామని చెప్పారు. ఈ వత్తి గౌరవాన్ని మరింత పెంచినట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్‌ హేమలత,కలెక్టర్‌ రాజర్షి షా, మున్సిపల్‌ చైర్మన్‌ చంద్రపాల్‌, ఎస్పీ రోహిణి ప్రియదర్శిని, మత్స్య శాఖ ఏడీ రజని తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు