Acharya Movie Review: ‘ఆచార్య’ మూవీ ఎలా ఉందంటే..

29 Apr, 2022 11:06 IST|Sakshi
Rating:  

టైటిల్‌ : ‘ఆచార్య’
నటీనటులు : చిరంజీవి, రామ్‌ చరణ్‌, పూజా హెగ్డే, సోనూసూద్‌ తదితరులు
నిర్మాణ సంస్థ: కొణిదెల ప్రొడక్షన్స్‌ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: నిరంజన్‌రెడ్డి, అన్వేష్‌ రెడ్డి, రామ్‌ చరణ్‌
దర్శకుడు: కొరటాల శివ
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్ర‌ఫి: తిరు
ఎడిటర్‌: నవీన్‌ నూలి
విడుదల తేది: ఏప్రిల్‌ 29,2022

Acharya Movie Review In Telugu

మెగాఫ్యామిలీ డ్రీమ్‌ ప్రాజెక్టుగా రూపుదిద్దుకున్న చిత్రం ‘ఆచార్య’. తొలిసారి రామ్‌ చరణ్‌ పూర్తిస్థాయిలో చిరంజీవితో కలిసి నటిస్తున్న చిత్రమిది. అందుకే ఈ మూవీ కోసం మెగా అభిమానులు చాలా ఆతృతగా ఎదురుచూశారు. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు ఈ శుక్రవారం( ఏప్రిల్‌ 29)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్‌, పాటలు​ సినిమాపై పాజిటివ్‌ బజ్‌ను క్రియేట్‌ చేశాయి. దానికి తోడు ప్రమోషన్స్‌ కూడా గ్రాండ్‌గా నిర్వహించడంతో ‘ఆచార్య’పై హైప్‌ క్రియేట్‌ అయింది. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ‘ఆచార్య’ను ప్రేక్షకులు ఏమేరకు ఆదరించారు? రివ్యూలో చూద్దాం. 

Chiranjeevi And Ram Charan Acharya Movie Review

కథేంటంటే..
ధర్మస్థలి.. 800 ఏళ్ల చరిత్ర ఉన్న టెంపుల్‌ టౌన్‌ అది. పక్కనే జీవధార నది. దానికి అటువైపు పాదఘట్టం అనే చిన్న తండా.  అక్కడి ప్రజలకు ధర్మస్థలి టెంపుల్‌తో ఎనలేని సంబంధం ఉంటుంది. ధర్మస్థలిలో ఉండే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేస్తూ.. ధర్మంగా ఉంటారు పాదఘట్టం తండా వాసులు. కానీ ధర్మస్థలి మున్సిపల్‌ చైర్మన్‌ బసవన్న(సోనూసూద్‌) చాలా క్రూరుడు. ధర్మస్థలి టెంపుల్‌లో అసాంఘిక కార్యక్రమాలను కొనసాగిస్తూ.. అక్కడి సొమ్మునంతా కాజేస్తాడు. రాజకీయంగా ఎదగడం కోసం.. ధర్మస్థలి అమ్మవారి టెంపుల్‌తో పాటు పాదఘట్టం గ్రామాన్ని కూడా మైనింగ్‌ మాఫియా లీడర్‌ రాథోడ్‌ (జిషు సేన్‌ గుప్తా)కు అప్పగించే ప్రయత్నం చేస్తాడు.

ఇలా ధర్మస్థలిలో అధర్మం పేట్రేగిపోతుండడంతో దాన్ని అడ్డుకోవడానికి ఆ గ్రామానికి వస్తాడు ఆచార్య(చిరంజీవి). బసవన్న గ్యాంగ్‌ చేసే అరాచకాలను ఒక్కొక్కటిగా ఎండగడుతూ ఉంటాడు. అసలు ఆచార్య ఎవరు? ధర్మస్థలిని వెతుక్కుంటూ ఎందుకు వచ్చాడు? ధర్మస్థలితో సిద్ధ(రామ్‌ చరణ్‌)కి ఉన్న అనుబంధం ఏంటి? ఆచార్యకి, సిద్ధకి మధ్య ఉన్న సంబంధం ఏంటి? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Acharya Movie Cast And Highlights
ఎలా ఉందంటే..?
కమర్షియల్‌ అంశాలకు సందేశాన్ని జోడించి సక్సెస్‌ సాధించిన కొద్ది మంది దర్శకుల్లో కొరటాల శివ ఒకరు. ‘మిర్చి’ మొదలు..‘ భరత్‌ అనే నేను’వరకు ఆయన తీసిన సినిమాలన్నీ సూపర్‌ హిట్టే. అలాంటి దర్శకుడు చిరంజీవి, రామ్‌ చరణ్‌ లాంటి స్టార్‌ హీరోలతో సినిమా తీస్తే.. ప్రేక్షకుల అంచనాలు ఓ రేంజ్‌లో ఉంటాయి. కొత్త కథని ఆశిస్తారు. కానీ కొరటాల మాత్రం ప్రేక్షకులకు పాత కథే చూపించాడు. అది కూడా అంతగా ఆసక్తిగా సాగలేదు. కథ, కథనం, మాటలు ఇలా ప్రతి అంశంలోనూ కొరటాల తీవ్ర నిరాశకు గురి చేశాడు. ఒకానొక దశలో అసలు ఇది కొరటాల శివ సినిమానేనా అన్న అనుమానం సగటు ప్రేక్షకుడికి కలగక మానదు.

కథను పక్కకు పెట్టి.. స్టార్‌ క్యాస్ట్‌ మీదే ఎక్కువ ఆధారపడ్డాడు డైరెక్టర్‌. మహేశ్‌ బాబు వాయిస్‌ ఓవర్‌తో ధర్మస్థలి నేపథ్యాన్ని చెప్పించి కథను ప్రారంభించాడు దర్శకుడు. ఆచార్య ధర్మస్థలిలోకి అడుగుపెట్టడం.. బసవన్న ముఠా చేసే అరాచాకాలను ఎండగట్టడం, రెండు పాటలతో ఫస్టాఫ్‌ ముగుస్తుంది. ఆచార్య చేసే పోరాట ఘట్టాలు చాలానే ఉన్నప్పటికీ... కథపై ప్రేక్షకుడికి అంత ఆసక్తి కలగదు. ఇంటర్వెల్‌ ముందు సిద్ధ పాత్ర ఎంటర్‌ అవుతుంది. దీంతో సెకండాఫ్‌పై కాస్త ఆసక్తి పెరుగుతుంది. కానీ అక్కడ కూడా ప్రేక్షకులను నిరాశపరిచాడు కొరటాల. ఆచార్య, సిద్ధ మధ్య వచ్చే సీన్స్‌ మినహా మిగతాదంతా సింపుల్‌గా సాగుతుంది. కథలో ఎలాంటి ట్విస్టులు ఉండవు. అయితే నక్సలైట్స్‌గా సిద్ద, ఆచార్య చేసే పోరాట ఘట్టాలు మాత్రం ఆకట్టుకుంటాయి. ఇక నీలాంబరి(పూజా హెగ్డే), సిద్ధల మధ్య వచ్చే సీన్స్‌ అయితే కథకు అతికినట్టుగా ఉంటాయి తప్ప..ఎక్కడా ఆసక్తి కలిగించవు. క్లైమాక్స్‌ కూడా చాలా సింపుల్‌గా, పాత సినిమాల మాదిరి ఉంటుంది. ‘లాహే లాహే’ ‘భలే భలే బంజారా' సాంగ్‌కి రామ్‌ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులు అందరినీ ఆకట్టుకుంటాయి. 

ఎవరెలా చేశారంటే.. 
ఏ పాత్రలోనైనా నటించడం కంటే జీవించేయడం  మెగాస్టార్‌ ప్రత్యేకత. ‘ఆచార్య’గా  తనదైన నటనతో చిరంజీవి అదరగొట్టేశాడు. ఫస్టాఫ్‌ అంతా కథని తన భూజాన వేసుకొని నడిపించాడు. ఫైట్స్‌ సీన్స్‌తో పాటు డ్యాన్స్‌ కూడా ఇరగదీశాడు. ముఖ్యంగా లాహే లాహే పాటతో పాటు స్పెషల్‌ సాంగ్‌కి చిరు అదిరిపోయే స్టెప్పులేసి అలరించాడు. ‘భలే భలే బంజారా’ సాంగ్‌కి రామ్‌ చరణ్‌తో చిరు వేసే స్టెప్పులైతే మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. ఇక సిద్ధ పాత్రకి పూర్తి న్యాయం చేశాడు రామ్‌ చరణ్‌. ప్రతి సీన్‌లోనూ చిరంజీవితో పోటీపడీ నటించాడు. డ్యాన్స్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

సెకండాఫ్‌లో సింహభాగం సిద్ధ పాత్రదే. సిద్ధని ప్రేమించే యువతి, సంగీతం టీచర్‌ నీలాంబరి పాత్రలో ఒదిగిపోయింది పూజాహెగ్డే. కాకపోతే సినిమాలో ఆమె పాత్రకు అంత ప్రాధాన్యత లేదు. నిడివి కూడా చాలా తక్కువే. ఇక విలన్‌గా సోనూసూద్‌ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. మైనింగ్‌ మాఫియా లీడర్‌ రాథోడ్‌గా జిషు సేన్‌ గుప్తా, పాదఘట్టంలోని ఆయుర్వేద వైద్యుడు వేదగా అజయ్‌ చక్కటి నటనను కనబరిచారు. కామ్రేడ్‌ శంకర్‌ అన్నగా సత్యదేవ్‌ చాలా బాగా నటించాడు. ఆయన పాత్ర నిడివి చాలా తక్కువే అయినా.. సినిమాకి కీలకం. నాజర్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ తమ పాత్రల పరిధిమేర నటించారు. 

సాంకేతిక విషయాలకొస్తే.. మణిశర్మ సంగీతం అంతంత మాత్రమేనని చెప్పాలి. నేపథ్య సంగీతం కూడా అంతగా ఆకట్టుకోదు. పాటలు ఓకే. తిరు సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ధర్మస్థలి టెంపుల్‌ టౌన్‌ని తెరపై చక్కగా చూపించారు. నవీన్‌ నూలి ఎడిటింగ్‌ పర్వాలేదు. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్లుగా ఉన్నాయి.

- అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:  
(2.75/5)
Poll
Loading...
మరిన్ని వార్తలు